Share News

సుద్ద ముక్కకు సొమ్మేదీ?

ABN , First Publish Date - 2023-11-20T00:31:51+05:30 IST

ప్రభుత్వ పాఠశాల బలోపేతమే తమ ధ్యేయం అంటూ చెప్పే ప్రభుత్వం నేడు పాఠశాలల నిర్వహణకు కావాల్సిన కనీస నిధులు మంజూరు చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తోంది. విద్యార్థులకు పాఠాలు బోధించడానికి కావాల్సిన కావల్సిన సుద్దముక్కలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేక ఉపాధ్యా యులు జేబుల్లోంచి ఖర్చు పెట్టాల్సివస్తోంది.

 సుద్ద ముక్కకు సొమ్మేదీ?

గత నాలుగేళ్లుగా మెయింటినెన్స్‌ గ్రాంట్లు నిల్‌

ఉపాధ్యాయులకు తప్పని బిల్లుల చెల్లింపులు

నెరవేరని విద్యాశాఖ మంత్రి హామీ

ప్రభుత్వ పాఠశాల బలోపేతమే తమ ధ్యేయం అంటూ చెప్పే ప్రభుత్వం నేడు పాఠశాలల నిర్వహణకు కావాల్సిన కనీస నిధులు మంజూరు చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తోంది. విద్యార్థులకు పాఠాలు బోధించడానికి కావాల్సిన కావల్సిన సుద్దముక్కలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేక ఉపాధ్యా యులు జేబుల్లోంచి ఖర్చు పెట్టాల్సివస్తోంది. డిజిటల్‌ విద్య, ఆన్‌లైన్‌ క్లాస్‌లు, బైజూస్‌ ట్యాబ్‌లు, టోఫెల్‌, ఐఎఫ్‌బీ ప్యానెల్స్‌ నిర్వహణ అంటూ పలు రకాలుగా సాంకేతిక పరిజ్ఞానం వినియోగం చేస్తున్న మన అధికారులు వాటి నిర్వహణకు ఖర్చయ్యే విద్యుత్‌ బిల్లులకు సొమ్ములు విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది.

నిడమర్రు, నవంబరు 19: గతంలో పాఠశాలల నిర్వహణ ఖర్చుల కోసం ప్రభుత్వం ప్రతి పాఠశాలకు, విద్యార్థుల నమోదు ఆధారంగా రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు నిధులు మంజూరు చేసేవారు. విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే జూన్‌, జూలై నెలల్లో కాకపోయినా సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో ఆయా పాఠశాలల విద్యాకమిటీ బ్యాంకు ఖాతాల్లో నిధులు జమయ్యేవి. స్కూల్‌ గ్రాంట్‌, మెయింట్‌నెన్స్‌ గ్రాంట్‌, టీఎల్‌ఎం గ్రాంట్‌ రూపాల్లో నిధులు మంజూరయ్యేవి. తర్వాత కాలంలో గత నాలుగేళ్లుగా ప్రభుత్వం నిర్వహణ ఖర్చులకు సొమ్ములు విడుదల చేయడం లేదు. గత విద్యా సంవత్సరం పాఠశాల నిర్వహణకు ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల కాకపోవడంతో ఉపాధ్యాయులే తమ జేబుల్లోంచి సొమ్ములు వెచ్చించాల్సి వచ్చింది. ఈలోపు బదిలీలు జరగడంతో ఖర్చుచేసిన దానికి నిధులు విడుదల కాక బిల్లులు సబ్మిట్‌ చేసి ఆ సొమ్ములకు నీళ్లు వదులుకొని బదిలీపై వెళ్లిపోయారు. ఈ విధంగా ఒక్కో పాఠశాల హెచ్‌ఎం ప్రాథమిక పాఠశాల అయితే రూ.10 వేలు, ప్రాథమికోన్నత పాఠశాల అయితే రూ.20 వేలు పైచిలుకు ఇక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులైతే రూ.50 వేల పైచిలుకే చేతి చమురు వదిలించుకున్నారు. పాఠశాల నిర్వహణకు కావాల్సిన వస్తు సామగ్రి, కరెంట్‌ బిల్లులు, రిజిస్టర్ల కొనుగోలు మొత్తం ఈ మెయింట్‌నెన్స్‌ గ్రాంట్‌ నుంచి మాత్రమే పొందాల్సిన పరిస్థితి వచ్చింది.

పాఠశాల మెయింట్‌నెన్స్‌ హెచ్‌ఎంలదే..

నాడు–నేడు ఫేజ్‌–1 ఆధునికీకరణలో భాగంగా ప్రతి గదిలో ఫ్యాన్‌లు, ట్యూబ్‌లైట్లు, వాటర్‌ ప్యూరిఫైయర్‌లు పంపిణీ చేశారు. వీటి నిర్వహణకు ప్రతి నెల విద్యుత్‌ బిల్లులుగా సుమారు రూ.1500 నుంచి రూ.4000 వరకు ఖర్చవుతోంది. డిజిటలైజేషన్‌ పేరుతో పాఠశాలకు స్మార్ట్‌ టీవీలు, ఐఎఫ్‌బీ టీవీ ప్యానెల్స్‌ను సరఫరా చేయడంతో వాటి వినియోగం నిమిత్తం వస్తున్న విద్యుత్‌ బిల్లులు వందల్లో నుంచి వేలల్లోకి పెరిగింది. ఈ విద్యుత్‌ బిల్లుల భారం పాఠశాల హెచ్‌ఎంలదే అవుతోంది.

రికార్డుల కొనుగోలు ఖర్చులు బారెడు

పాఠశాలల్లో అత్యంత ఆవశ్యకమైన మధ్యాహ్న భోజన పథకం రిజిస్టర్లు, సీసీఈ రిజిస్టర్లు, పీటీఏ, పేరెంట్స్‌ కమిటీ రిజిస్టర్లు, లైబ్రెరీ రిజిస్టర్లు, సుద్దముక్కలు, స్టేషనరీ. మొదలగు 46 రకాల రిజిస్టర్లతో పాటు ఇటీవల విద్యాశాఖ రాష్ట్రస్థాయి అధికారుల ఆకస్మిక తనిఖీల సందర్భంగా పెరిగిన మరో 36 రిజిస్టర్లు కొనుగోలు, నిర్వహణ ఉపాధ్యాయులకు భారంగా మారుతోంది.

విద్యార్థుల వారీగా రిజిస్టర్ల భారం..

ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో వచ్చిన బేస్‌మెంట్‌ పరీక్షల మొదలు ఇటీవల నిర్వహించిన ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌–4 వరకు ప్రతి విద్యార్థికి పరీక్షల కోసం ప్రత్యే నోటు పుస్తకాలు పెట్టి నిర్వహించాల్సి రావడం మరింత భారంగా మారుతోంది. ఒక్కో పాఠశాలలో 30 నుంచి 300 మంది వరకు విద్యార్థులు ఉండగా ఒక్కో పరీక్ష పుస్తకం రూ.20 వేసుకున్నా రూ.6000 పై చిలుకు ఖర్చు అవుతోంది. ఇవన్నీ నిధులు మంజూరు కాక ఉపాధ్యాయులే సొంతంగా భరిస్తున్నారు.

గత విద్యా సంవత్సరంలో నిధులు లేవు..

గత విద్యాసంవత్సరంలో పాఠశాలకు సంబంధించి ప్రభుత్వం ఒక్క పైసా కూడా నిధులు విడుదల చేయలేదు. గతంలో పాఠశాలకు మెయింట్‌నెన్స్‌ గ్రాంట్‌గా రూ.5,000, స్కూల్‌గ్రాంట్‌ రూ. 2000–5000, టీఎల్‌ఎం గ్రాంట్‌ ఒక్కో టీచర్‌ కు రూ.1000, లాంగ్వేజి ఫెస్టివల్‌ గ్రాంట్‌ రూ.1000, స్కూల్‌ సేఫ్టీ గ్రాంట్‌ రూ.2000–2500 విడుదలయ్యేవి. కానీ గత విద్యాసంవత్సరంలో ఒక్కరూపాయి కూడా విడుదల కాకపోవడం ప్రభుత్వం ఉపాధ్యాయు లపై కక్ష సాధింపు ధోరణికి నిదర్శనం.

ఈ విద్యా సంవత్సరంలోనూ..

ఈ విద్యా సంవత్సరంలో పాఠశాల మొదలై ఇప్పటికే ఐదు నెలలు గడిచినప్పటికీ ఇప్పటివరకు ఒక్క పైసా సొమ్ము విడుదల కాలేదు. మెయింట్‌నెన్స్‌ నిధులు కూడా మంజూరు కాకపోవడంతో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. ఒకవైపు జీతభత్యాలు సక్రమంగా రాకపోగా సొంత సొమ్మును పాఠశాలకు ఖర్చు పెట్టాల్సి రావడంతో టీచర్లు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు.

విద్యాశాఖ మంత్రి హామీ తూచ్‌

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పత్రికా సమావేశం పెట్టి ఇక నుంచి స్కూళ్లకు విద్యుత్‌ బిల్లులు ఉపాధ్యాయులు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వమే నేరుగా విద్యుత్‌ పంపిణీ సంస్థలకు చెల్లిస్తుందని ప్రకటన చేశారు. ఇది జరిగి సు మారు నాలుగు నెలలు గడుస్తున్న ఇప్పటివ రకు సంబంధిత జీవో విడుదల కాకపోవడం విడ్డూరంగా ఉంది. మంత్రి మాటలకే కాలం చెల్లిపోయిందని ఉపాధ్యాయులు గుసగుసలా డుతున్నారు. చేసేదిలేక చచ్చినట్లు ఉపాధ్యా యులే తమ జీతాల నుంచి చెల్లిస్తున్నారు.

ఉమ్మడి పశ్చిమ జిల్లాలో స్కూళ్లు..

ప్రాధమిక పాఠశాలలు

ఏలూరు జిల్లా 1,388, పశ్చిమ జిల్లా 1,075 మొత్తం = 2,463

ప్రాథమికోన్నత పాఠశాలలు

ఏలూరు జిల్లా 207, పశ్చిమ జిల్లా 88 మొత్తం = 295

ఉన్నత పాఠశాలలు

ఏలూరు జిల్లా 213, పశ్చిమ జిల్లా 211 మొత్తం = 424

పాఠశాలకు మంజూరు కావాల్సిన నిధులు

గత విద్యాసంవత్సరం బకాయిలు రూ.335 కోట్లు (సుమారు)

ఈ విద్యాసంవత్సరం రావాల్సిన సొమ్ము రూ.350 కోట్లు (సుమారు)

మెయింటినెన్స్‌ గ్రాంట్‌ ఇవ్వడంలో నిర్లక్ష్యం

అంతర్జాతీయ విద్యా ప్రమాణాల పేరుతో వేల కోట్లు రూపాయలు ఖర్చు పెడుతున్నామని ప్రచారం చేసుకుంటున్న ఈ ప్రభుత్వం పాఠశాలలకు కావాల్సిన కనీస మౌలిక వసతుల కల్పించడంలో భాగంగా ఇవ్వాల్సిన మెయింట్‌నెన్స్‌ గ్రాంట్‌ ఇవ్వడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించడాన్ని ఖండిస్తున్నాం. ఐఎఫ్‌బీ, స్మార్ట్‌ టీవీ, డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌ల నిర్వహణ కోసం విద్యుత్‌ బిల్లులు చెల్లించకపోడం పట్ల నిరసన తెలుపుతున్నాం. ఉపాధ్యాయులు సొంత సొమ్ములు ప్రతి నెల రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వెచ్చించి పాఠశాలలు నడుపుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

– బి.గోపిమూర్తి, రాష్ట్ర కోశాధికారి, యూటీఎఫ్‌ ఉపాధ్యాయ సంఘం

టీచర్లపై కక్ష సాధింపు ధోరణి తగదు..

గత ఏడాది నుంచి పాఠశాలకు విడుదల కావాల్సిన నిధులను ప్రభుత్వం మంజూరు చేయకపోవడం దారుణమైన విషయం. హెచ్‌ఎంలకు ప్రతి నెల రూ.5 వేల వరకు చేతి సొమ్ము వదులుతోంది. సమగ్రశిక్ష అభియాన్‌ నుంచి రావాల్సిన నిధులు విడుదల చేయకుండా ఉపాధ్యాయులపై కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తోంది. గత ఏడాది నుంచి ఉపాధ్యాయులే విద్యుత్‌ బిల్లులు, స్టేషనరీ బిల్లులు సొంతంగా చెల్లిస్తున్నారు. ఈ ఏడాది కూడా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం దారుణం

– పుప్పాల సూర్యప్రకాశరావు, ప్రధాన కార్యదర్శి ఎస్‌టీయూ, ఉపాధ్యాయ సంఘం ఏలూరు జిల్లా.

Updated Date - 2023-11-20T00:33:30+05:30 IST