మేము సైతం..
ABN , Publish Date - Dec 18 , 2023 | 12:40 AM
అంగన్వాడీల దీక్షలకు చిన్నారుల తల్లులు సైతం సంఘీభావం తెలిపారు. కైకలూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద 6వ రోజు ఆదివారం అంగన్వాడీ కార్యకర్తల దీక్షల్లో అంగన్వాడీ చిన్నారులతో వారి తల్లులు పాల్గొన్నారు.
అంగన్వాడీల దీక్షలకు చిన్నారులతో సహా పాల్గొన్న తల్లులు
గడ్డి తింటూ ముదినేపల్లిలో అంగన్వాడీల నిరసన
కైకలూరు, డిసెంబరు 17: అంగన్వాడీల దీక్షలకు చిన్నారుల తల్లులు సైతం సంఘీభావం తెలిపారు. కైకలూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద 6వ రోజు ఆదివారం అంగన్వాడీ కార్యకర్తల దీక్షల్లో అంగన్వాడీ చిన్నారులతో వారి తల్లులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్, ఆయా పర్యవేక్షణ బాగుంటుందని పిల్లలను ధైర్యంగా పంపుతున్నామని, ఇపుడు ఎవరెవరో వచ్చి తమ పిల్లలను పాఠశాలకు పంపాలని కోరుతున్నారని వారికి తమ పిల్లలను అప్పగించలేమన్నారు. పిల్లలు ఆయాల తోనే స్కూలుకు వెళతామంటున్నారని, కొత్తవారితో వెళ్లమని మారాం చేస్తున్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ శిబిరాన్ని జనసేన నాయకుడు బీవీ రావు సందర్శిం చి మద్దతు తెలిపారు. చిన్నారులకు ఆయన బిస్కెట్లు పంపిణీ చేశారు. యూనియన్ అధ్యక్షురాలు కె. సుజాత, మీనాకుమారి తదిత రులు పాల్గొన్నారు.
ఎండుగడ్డి తింటూ....
ముదినేపల్లి: తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఆరు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులు ముదినేపల్లిలో ఆదివారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరం వద్ద అంగన్వాడీలు ఎండుగడ్డి తింటూ నిరసన తెలిపారు. యూనియన్ నాయకులు సూరపనేని అరుణ కుమారి, రెబ్ పా, బండి పద్మ, రోజా రాణి ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసనలో పాల్గొన్నారు.
మోకాళ్ళపై నిలబడి..
ముసునూరు: ముసునూరు గ్రామ సచివాలయం వద్ద అంగన్‌వాడీల నిరసన దీక్షలు ఆదివారంతో 6వ రోజుకు చేరాయి. మోకాళ్ళపై నిలబడి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వర్కర్స్ యూనియన్ నియోజకవర్గ కార్యదర్శి పి.రాజకుమారి మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని తాము సమ్మెకు దిగితే ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు బద్దలు కొట్టి వాటిని నిర్వహణ బాధ్యతను సచివాలయ సిబ్బందికి అప్పగిం చటం దారుణమన్నారు. ఇప్పటికైనా తమ డిమాండ్లు అమలు చేయాలని రాజకుమారి డిమాండ్ చేశారు.