ఏం కష్టమొచ్చిందో..?
ABN , First Publish Date - 2023-05-26T00:17:38+05:30 IST
ఆ కుటుంబానికి ఏం కష్టం వచ్చిందో తెలియదు. రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. తల్లీ కొడుకులు మృతి చెందగా, కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది.

రైలుకు ఎదురుగా వెళ్లి తల్లీ, కొడుకుల ఆత్మహత్య..
కుమార్తె పరిస్థితి విషమం.. ఏలూరు తరలింపు
తాడేపల్లిగూడెం రూరల్, మే 25 : ఆ కుటుంబానికి ఏం కష్టం వచ్చిందో తెలియదు. రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. తల్లీ కొడుకులు మృతి చెందగా, కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. తాడేపల్లి గూడెంలో గురువారం రాత్రి జరిగింది. తాడేపల్లిగూడెం రైల్వే పోలీసులు తెలిపిన వివరాలివి.. తాడేపల్లిగూడెం శేషమహల్ ప్రాంతానికి చెందిన గుత్తి శివ ఆంజనేయులు మార్కెట్‌లో వెల్లుల్లి వ్యాపారం చేస్తుంటాడు. అతనికి భార్య సత్యప్రభ (38), కొడుకు త్రిభువన్ (18), కుమార్తె అమృత(15) ఉన్నారు. కుమారుడు ఇంటర్, కుమార్తె పదో తరగతి పూర్తిచేశారు. ఏం జరిగిందో తెలియదు. వీరు ముగ్గురూ గురువారం రాత్రి రైల్వేస్టేషన్ సమీపంలోని నిడదవోలు వెళ్లే వైపు ఫ్లైఓవర్ కిందకు చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకునేందుకు ట్రాక్‌పైకి వెళ్లారు. ఆ క్రమంలో త్రిభువన్ ముందుగా గుర్తు తెలియని రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది చూసిన తల్లీ కూతుళ్లు సత్యప్రభ, అమృత విశాఖ వైపు వెళ్తున్న తిరుమల ఎక్స్‌ప్రెస్‌కు ఎదురుగా వెళ్లడంతో అది వీరిని వేగంగా ఢీకొంది. పట్టాలపై వీరిని చూసిన రైలు డ్రైవర్ హారన్ కొట్టినప్పటికి ఫలితం లేకపోయింది. సత్యప్రభ అక్కడికక్కడే మృతి చెందగా, అమృత తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతోంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అమృతను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి ఏలూరు తరలించారు. కుటుంబ కలహాల కారణంగా వారు ఈ చర్యకు పాల్పడి ఉంటారని స్థానికులు భావిస్తుండగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జీఆర్‌పీ ఎస్‌ఐ శ్రీహరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.