కర్ణాటక మంత్రిగా మోగల్లు రాజు గారు

ABN , First Publish Date - 2023-05-31T23:58:44+05:30 IST

కర్ణాటక కేబినేట్‌లో మంత్రిగా చోటు దక్కించుకున్నారు.. మోగల్లు వాసి.. నడింపల్లి బోస్‌ రాజు. మన్యం వీరుడు అల్లూరి సీతా రామరాజు, అణు శాస్త్రవేత్త ఏఎస్‌ రావులతో ఇప్పటికే మోగల్లుకు గుర్తింపు వచ్చింది.

కర్ణాటక మంత్రిగా మోగల్లు రాజు గారు

బెంగళూరు / పాలకోడేరు, మే 31(ఆంధ్రజ్యోతి): కర్ణాటక కేబినేట్‌లో మంత్రిగా చోటు దక్కించుకున్నారు.. మోగల్లు వాసి.. నడింపల్లి బోస్‌ రాజు. మన్యం వీరుడు అల్లూరి సీతా రామరాజు, అణు శాస్త్రవేత్త ఏఎస్‌ రావులతో ఇప్పటికే మోగల్లుకు గుర్తింపు వచ్చింది. తాజాగా బోస్‌ రాజు ద్వారా మరోసారి ఈ వూరు వార్తల్లోకి వచ్చింది. 74 ఏళ్ల వయసున్న బోస్‌ రాజు ఇక్కడే పుట్టి పెరిగారు. పాలకోడేరులో ఎస్‌ఎస్‌ఎల్‌సీ పాసయ్యారు. 1967లో ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లమో చేశారు. తర్వాత కర్నాటకలోని మాన్వీలో స్థిరపడ్డారు. అక్కడే ఎరువుల వ్యాపారం చేస్తూ 1969లో యువజన కాంగ్రెస్‌ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించి, చురుకైన పాత్ర పోషిస్తూ వచ్చారు. రెండుసార్లు ఎమ్మెల్యే గెలుపొందారు. కాంగ్రెస్‌ హైకమాండ్‌ వద్ద మంచి పలుకుబడి సంపాదించారు. కర్ణాటక ముఖ్యమంత్రులుగా ఎస్‌.బంగారప్ప, వీరప్ప మొయిలీ కేబినెట్‌లలో కీలక పదవులు నిర్వహించారు. తాజాగా సీఎం సిద్ధరామయ్య నాయకత్వంలో ఏర్పడిన మంత్రిమండలిలో చిన్న తరహా నీటిపారుదల, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరో వైపు ఆయన తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ చార్జిగా వ్యవహరిస్తున్నారు. త్వరలో జరగనున్న తెలం గాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధిష్టానం కోటా కింద బోస్‌ రాజుకు మంత్రి పదవి ఇచ్చారు. బోస్‌ రాజును కర్ణాటక రాజు క్షత్రియ సమాఖ్య బుధవారం అభినందించి, ఘనంగా సన్మానించింది. సమాఖ్య గౌర వాధ్యక్షుడు డాక్టర్‌ ఎ.రాధాకృష్ణరాజు, అధ్యక్షుడు కె.శ్యామరాజు, కార్యదర్శి ఎస్‌ఎన్‌ రవికుమార్‌ రాజు, కోశాధికారి సీఏ వరదరాజు హాజరయ్యారు.

Updated Date - 2023-05-31T23:58:44+05:30 IST