Share News

నేడు ఎమ్మెల్సీ సాబ్జీ అంత్యక్రియలు

ABN , Publish Date - Dec 17 , 2023 | 12:03 AM

రోడ్డు ప్రమా దంలో మృతి చెందిన ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు, యూటీఎఫ్‌ నాయకులు తెలిపారు.

నేడు ఎమ్మెల్సీ సాబ్జీ అంత్యక్రియలు
సాబ్జీ కుటుంబసభ్యులను ఓదార్చుతున్న ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ రఘువర్మ

పోలీస్‌ లాంఛనాలతో అంతిమ కార్యక్రమాలు

విద్యాసంస్థల్లో మౌనం, సంతాప సభలు

ఏలూరు ఎడ్యుకేషన్‌/ఏలూరు టూటౌన్‌, డిసెంబరు 16: రోడ్డు ప్రమా దంలో మృతి చెందిన ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు, యూటీఎఫ్‌ నాయకులు తెలిపారు. అమెరికాలో నివాసం ఉంటున్న ఆయన కుమార్తె శనివారం రాత్రికి ఏలూరు చేరుకుంటారన్నారు. సాబ్జీ భౌతిక కాయానికి నివాళులర్పించేందుకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజల సందర్శనార్థం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఏలూరు నగరంలోని ఇండోర్‌ స్టేడియంలో ఉంచుతారు. తొలుత ఆశ్రం ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచిన భౌతికకాయాన్ని తీసుకుని ర్యాలీగా యూటీఎఫ్‌ జిల్లా కార్యాల యానికి తీసుకెళ్లి కొద్దిసేపు ఉంచుతామని తెలిపారు. అనంతరం భౌతికకా యాన్ని అంత్యక్రియల నిమిత్తం కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని వివరించారు. పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతిమయాత్రకు రాష్ట్రవ్యాప్తంగా పెద్దసంఖ్యలో ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు హాజరయ్యే అవకాశం ఉండడంతో ఆ మేరకు ఏర్పాట్లను యూటీఎఫ్‌ నాయకత్వం చేస్తోంది. అంతిమయాత్రను సత్రంపాడు, శాంతినగర్‌, సీఆర్‌ఆర్‌ కళాశాల, కొత్త బస్టాండ్‌, ఓవర్‌ బ్రిడ్జి, జూట్‌మిల్లు వంతెన, పంపులచెర్వు, వంగా యగూడెం, పాలతూము సెంటర్‌మీదుగా సాగిన తరువాత మదీనా మసీదు వద్ద వున్న శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహి ంచాలని నిర్ణయించారు. అనంతరం సాయంత్రం యూటీఎఫ్‌ భవన్‌లో సంతాప సభ నిర్వహిస్తారు.

ఉపాధ్యాయ నేతకు నివాళులు

దివంగత షేక్‌ సాబ్జీ కుటుంబసభ్యులను శనివారం ఏలూరు సత్రంపా డులోని క్యాంప్‌ ఆఫీసులో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధిక సంఖ్యలో టీచర్లు పరామర్శించారు. ఎమ్మెల్సీ భార్య, కుమారుడిని, మిగతా కుటుంబసభ్యులను ఓదార్చారు. చిత్రపటంవద్ద నివాళులర్పించారు. టీడీపీ సీనియర్‌ నాయకుడు మాగంటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఒక నిబద్ధత గల పోరాట ప్రతిమ కలిగిన ఉద్యమ నాయకుడిని కోల్పోవడం ఉద్యమాలకు లోటన్నారు. సాబ్జీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీపీఎం జిల్లా కార్యాలయంలో సంతాప సభ నిర్వహించారు. జిల్లా కార్యదర్శి ఎ.రవి, సీనియర్‌ నాయకులు సోమయ్య, కిషోర్‌, ఎ.శ్రీనివాస్‌, రామకృష్ణ, హైమావతి, శ్యామలరాణి, తదితరులు పాల్గొన్నారు.

ఏపీ చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ ఆదిశేషు, కో–కన్వీనర్‌ కృష్ణారావు సాబ్జీ మృతికి ఉపాధ్యాయ ఉద్యమానికి తీరని లోటని అన్నారు. జనసేన పార్టీ కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ చిన్ననాటి నుంచే ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న సాబ్జీ మరణం తీవ్రంగా కలిచివేసిందన్నారు. కలెక్టరేట్‌ వద్ద అంగన్వాడీల సమ్మె శిబిరంలో సంతాప సభ నిర్వహించారు. అంగన్వాడీలు విజయం సాఽధించే వరకు పోరాటమే సాబ్జీకి ఇచ్చే ఘనమైన నివాళి అని సీఐటీయూ జిల్లా ప్రదాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్‌ కొనియాడారు. యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఆలీ, కార్యదర్శి రవికుమార్‌, కోశాధికారి అంగర మోహన్‌, తదితరులు పాల్గొన్నారు.

సానుభూతిని తెలియజేసిన ప్రముఖుల్లో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, ఏపీ మెడికల్‌ బోర్డు డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రసాద్‌, డీఈవో పి.శ్యాంసుందర్‌, యూటీఎఫ్‌ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌.సుభాష్‌చంద్రబోస్‌, బి.వి.రమణమూర్తి తదితరులు ఉన్నారు.

విద్యాసంస్థల్లో సంతాపసభలు, మౌనం

సాబ్జీ ఆకస్మిక మృతిని పురస్కరించుకుని శనివారం జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపాన్ని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి, పాఠశాలల బలోపేతానికి షేక్‌ సాబ్జీ చేసిన కృషిని విద్యార్థులకు వివరించారు.

Updated Date - Dec 17 , 2023 | 12:05 AM