ముచ్చటగా మూడు
ABN , First Publish Date - 2023-02-21T00:16:50+05:30 IST
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు తొలిసారిగా మూడు ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. వైసీపీ.. సామాజిక న్యాయం పేరిట మూడు సామాజిక వర్గాలకు చెందిన ముగ్గురిని ముచ్చటగా ఎంపిక చేసింది. ఇప్పటికే పదవుల్లో వున్న ఇద్దరికి అదనపు గిఫ్ట్ పేరిట ఎమ్మెల్సీ స్థానాలను కట్టబెట్టింది.
విధేయత పేరిట వైసీపీ ఏకపక్ష నిర్ణయం
పాలకొల్లు బెదిరింపులతో దారికొచ్చిన వైసీపీ
స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్
తణుకులో కాదూ కూడదనుకున్నా వంక రవీంద్ర వైపే మొగ్గు
జయమంగళకు ఎమ్మెల్యే కోటాలో పదవి
పాతోళ్లందరికీ దాదాపు పాతరేసేశారు
వైసీపీలో సమన్యాయం పేరిట సరికొత్త రాగం
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు తొలిసారిగా మూడు ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. వైసీపీ.. సామాజిక న్యాయం పేరిట మూడు సామాజిక వర్గాలకు చెందిన ముగ్గురిని ముచ్చటగా ఎంపిక చేసింది. ఇప్పటికే పదవుల్లో వున్న ఇద్దరికి అదనపు గిఫ్ట్ పేరిట ఎమ్మెల్సీ స్థానాలను కట్టబెట్టింది. స్థానిక సంస్థల కోటా నుంచి నరసాపురం ఎంపీగా వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయి ప్రస్తుతం పరిశ్రమల సమాఖ్య కార్పొరేషన్‌కు చైర్మన్‌గా వున్న వంక రవీంద్ర, జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్, ఈ మధ్యనే టీడీపీకి మంగళం పాడి వైసీపీ తీర్థం పుచ్చుకున్న జయమంగళ వెంకటరమణను ఎంపిక చేశారు.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
గడిచిన వారం రోజులుగా ఏ రోజుకారోజు రాజకీయ పరిణామాలు మారుతూ వచ్చాయి. బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలుగుదేశం నుంచి వైసీపీలో చేరిన కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయ మంగళ వెంకటరమణకు ఎమ్మెల్యేల కోటా కింద అవకాశం ఇచ్చారు. ఎవరూ ఊహించిన విధంగా పాలకొల్లు రాజకీయాలను వైసీపీ మరో కుదుపు కుదిపింది. ఇప్పటికే అక్కడ నాలుగు స్తంభాలాటగా మారిన పార్టీని దృష్టిలో పెట్టుకుని, దీనికితోడు మాకంటూ ఛాన్స్ ఇవ్వకపోతే రెబల్‌గానే పోటీ అంటూ కొందరు సవాల్ విసరడంతో కీడించి మేలించి గుణ్ణం నాగబాబును కాదని జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్‌కు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తున్నారు. 2014 జరిగిన ఎన్నికల్లో నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన వంక రవీంద్రకు కాపు సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్సీగా కొలువు ఇచ్చారు. ఈ మూడింటిలో రవీంద్ర, జయమంగళ పేర్లు ఊహించి నవే అయినా, ఆకస్మికంగా జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ అభ్యర్థిత్వం తెర ముందుకు వచ్చింది. మారిన రాజకీయ పరిణామాల క్రమంలో తొలుత గుణ్ణం నాగబాబుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని వైసీపీ భావించింది. ఆయన పార్టీని నమ్ముకుని తనకు ఒక ఛాన్స్ ఇవ్వాలని కోరడంతో దాదాపు అందుకు అంగీకరించినట్టే వైసీపీలో ప్రచారం సాగింది. కాని ఈలోపే సీనియర్, మాజీ జడ్పీ చైర్మన్ మేకా శేషుబాబు సైతం ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తాను కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నానని, తన అభ్యర్థిత్వం పరిశీలించాలని పట్టుపట్టారు. ఒకవేళ లేకుంటే రెబల్ అభ్యర్థిగా రంగంలోకి దిగాలని శేషుబాబుకు ఎంపీటీసీలు, కొందరు జడ్పీటీసీలు మద్దతుగా నిలిచి కాస్త ఒత్తిడి పెంచారు. వీటన్నింటినీ వైసీపీ అధిష్ఠానం పరిగణనలోకి తీసుకుంది. గౌడ సామాజిక వర్గం నుంచి తనకు ఛాన్స్ ఇవ్వకుండా వ్యవహరిస్తే ఆ నష్టం నేరుగా పార్టీకే తగులుతుందని, పరిస్థితి గమనించాలని ప్రాధేయపడ్డారు. అయినా సరే శేషుబాబు పోకడలపై ఓ వైపు కన్నేసి ఉంచి దీనికి విరుగుడిగా శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన కవురు అభ్యర్థిత్వం వైపే పార్టీ మొగ్గు చూపింది. మొత్తం మీద సామాజిక న్యాయం అమలులో తామే ముందు వరుసలో ఉన్నామంటూ ప్రచారం చేసుకుంటున్న వైసీపీ అదే క్రమంలో పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన సీనియర్ నేతలను గాలికొదిలేసింది. కనీసం ఈ ప్రయోగంలో వారి పేర్లను పరిగణనలోకి తీసుకోలేదు. ఇదంతా వైసీపీలో ఇదేం రాజకీయం అంటూ అసంతృప్తికి దారితీసింది. దీనికితోడు పదవుల్లో ఉన్న వారికే.. ప్లీజ్ ఇంకో పదవి అంటూ బతిమలాడి ఇచ్చినట్టు వైసీపీ వ్యవహారం ఉందని పార్టీలో మిగతా వారంతా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీగా ఎంపికైన వారిలో రవీంద్ర ఇప్పటికే పరిశ్రమలకు సంబంధించి కార్పొరేషన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన తణుకులో పారిశ్రామికవేత్తగా కూడా చిరపరిచితం. ఇదే తరుణంలో తణుకు నుంచి రవీంద్రను ఎంపిక చేయడం అక్కడ పార్టీలో కొందరికి ఇష్టం లేకున్నా కాపు సామాజిక వర్గం నుంచి ప్రాధాన్యత ఇవ్వాలనుకుని చివరికి ఆయనకే ఎమ్మెల్సీ స్థానం కట్టబెట్టినట్టు చెబుతు న్నారు. ఇదే నియోజకవర్గానికి చెందిన కారుమూరి నాగేశ్వరరావు మంత్రిగా కొనసాగుతున్నారు. మరి అలాంటప్పుడు తణుకులోనే రెండు పదవులు ఉండేలా రవీంద్రకు ఎమ్మెల్సీ స్థానం ఇవ్వడం ఏమిటనే ఆక్షేపణ పార్టీలో కొందరు విశ్లేషిస్తున్నారు. అయినా సరే వైసీపీ అధిష్ఠానం తాను ఏదైతే అనుకుందో, ఎవరినైతే ఎంపిక చేయాలను కుందో చివరి వరకు ఆ వైపే అడుగులు వేసినట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
పాలకొల్లులో గ్రూపులకు చెక్
పాలకొల్లులో గ్రూపులకు చెక్ పెట్టేందుకు వైసీపీ అధిష్ఠానం ఒకింత దూకుడుగానే వ్యవహరించింది. ఇప్పటికే నియోజకవర్గ ఇన్‌చార్జిగా, జడ్పీ చైర్మన్‌గా ఉన్న కవురు శ్రీనివాస్‌ను రంగంలోకి దింపడం ద్వారా ఓవైపు బీసీ కోటా కొనసాగిస్తూనే మరోవైపు వర్గాలకు చెక్ పెట్టినట్టు ఆ పార్టీలో కొందరు భావిస్తున్నారు. అయితే పార్టీ విధేయతకే పెద్ద పీట వేసేలా వ్యవహరిస్తూనే దానికి సామాజిక సమతుల్యత పేరిట కలరింగ్ ఇచ్చారంటూ మరికొందరు విమర్శిస్తున్నారు. దానికి ఉదాహరణగా టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జయమంగళను పార్టీలోకి తీసుకోవడం, ఆ వెంటనే బలమైన సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం చూస్తుంటే పార్టీ పోకడ ఇట్టే అర్థమవుతుందని చిర్రుబుర్రులాడేవారు కనిపిస్తున్నారు.
వైసీపీలో మారిన వ్యూహం
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంతకు ముందు ఎమ్మెల్సీలుగా టీడీపీ నుంచి మంతెన సత్యనారాయణ రాజు, అంగర రామ్మోహన్ కొనసాగగా వారి పదవీ కాలం సమీపించిన నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు అనివార్యమ య్యాయి. ఈసారి బీసీ నినాదం చేస్తున్న వైసీపీ ఆఖరికి ఎమ్మెల్సీ ఎన్నికలను వ్యూహాత్మకంగా అమలు చేస్తోంది. బీసీలకు పెద్ద పీట వేస్తున్నట్టు చెబుతూనే మరోవైపు క్షత్రియ, కమ్మ సామాజిక వర్గాల నుంచి ఎవరికీ ప్రాధా న్యత లేకుండా చేసింది. గతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా క్షత్రియ సామాజిక వర్గం నుంచి ప్రాధాన్యం ఇచ్చేవారు. ఈసారి వైసీపీ దీనిని బేఖాతర్ చేసింది. పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన కారుమంచి రమేష్, కృష్ణశ్రీనివాస్, గూడూరి ఉమాబాల, సీనియర్ నేత మేకా శేషుబాబు వంటి వారంతా ఎమ్మెల్సీ స్థానాలను ఆశించినా వారి సేవలన్నీ గతం గతః అంటూ పక్కన పెట్టేసినట్టు భావిస్తున్నారు. వీరిలో కొందరు వైసీపీ ప్రముఖుల నుంచి బలమైన హామీనే పొందినా జాబితా విడుదలయ్యే సమయానికి దీనిలో స్థానం లేకుండా పోవడం విశేషం. ఈ పద్ధతిని పదే పదే వైసీపీలో సీనియర్ నేతలంతా చర్చించుకుంటున్నారు. పరిస్థితిని విశ్లేషిస్తూనే పార్టీలో సైతం పోకడలు మారాయి,అంతకంటే మించి సామాజిక సమతుల్యత పేరిట పనికొచ్చే వారిని పక్కన పెడుతున్నారనే వాదనను ఇంకొందరు వినిపిస్తున్నారు. జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ ఎమ్మె ల్సీగా ఎంపిక కావడంతో భవిష్యత్తులో ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారనే దానిపై ఆ పార్టీలో మరోసారి రచ్చకు దారితీసే అవకాశం ఉంది.