వైద్యసేవలన్నీ బోర్డులకే పరిమితం

ABN , First Publish Date - 2023-06-03T00:48:02+05:30 IST

ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి ఏడాది నుంచి మెడికల్‌ కాలేజీ వచ్చేస్తోందని ఊరిస్తూ ఉన్నారు. మెడికల్‌ కాలేజీ అనుమతి వచ్చిన మరుక్షణమే సకల సదుపాయాలతో కూడిన వైద్యం అందుతుందంటూ ప్రజాప్రతినిఽధులు హోరెత్తించారు.

వైద్యసేవలన్నీ బోర్డులకే పరిమితం

అనుమతి వచ్చి నెలరోజులు దాటినా కానరాని రేడియాలజీ వైద్యులు

ఏడు ఆలా్ట్ర సౌండ్‌ స్కానింగ్‌ మిషన్లు ఉన్నా ఉపయోగం సున్నా

ఇబ్బందులు పడుతున్న గర్భిణులు, రోగులు

అడుగడుగునా వైద్య విభాగాల బోర్డుల ఏర్పాటు.. వైద్య సేవలు శూన్యం

ఏలూరు క్రైం, జూన్‌ 2 : ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి ఏడాది నుంచి మెడికల్‌ కాలేజీ వచ్చేస్తోందని ఊరిస్తూ ఉన్నారు. మెడికల్‌ కాలేజీ అనుమతి వచ్చిన మరుక్షణమే సకల సదుపాయాలతో కూడిన వైద్యం అందుతుందంటూ ప్రజాప్రతినిఽధులు హోరెత్తించారు. వారు మాటలు నమ్మిన ప్రజలు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఆశగా చూశారు. అయితే పేరుకు మెడికల్‌ కళాశాల అని చెప్పి యంత్రాలను మాత్రమే గొప్పగా చూపిస్తున్నారు. కనీసం టెక్నీషియన్లు అందుబాటులో లేనేలేరు. ఆస్పత్రిలో మాత్రం అన్ని విభాగాలు ఉన్నట్టు అడుగడుగునా గొప్పగా బోర్డులను పెట్టేశారు. వాస్తవానికి చూస్తే యంత్రాలకు, వైద్య పరికరాలకు, బోర్డులకు మాత్రమే పరిమితమై కనిపిస్తుందే తప్ప రోగులకు ఏ మాత్రం వైద్య సేవలు అందడం లేదు.

ఈ ఏడాది ఏప్రిల్‌ 26న ఏలూరు ప్రభుత్వ మెడికల్‌ కళాశాల మంజూరు అవడమే కాకుండా ఈ ఏడాది 150 మెడికల్‌ విద్యార్థులకు ప్రవేశాన్ని కల్పిం చారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిని టీచింగ్‌ ఆస్పత్రిగా అన్ని సదుపాయాలు ఉన్నాయంటూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయా విభాగాల్లో వైద్యులు, సిబ్బంది, ల్యాబ్‌లు సమృద్ధిగా ఉన్నాయంటూ మెడికల్‌ కాలేజీ అనుమతి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పైన పటారం, లోన లొటారం అన్న తీరుగా ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి మారింది. వైద్య విధాన పరిషత్‌ ఆధీనంలో ఉండగా ఆల్ర్టా సౌండ్‌ స్కానింగ్‌ను కాంట్రాక్టు పద్ధతిపై వైద్యుల చేత నిర్వహించేవారు. ఆస్పత్రిలో ఉన్న గైనకాలజిస్టులైనా అవసరాన్ని బట్టి నిర్వహించేవారు. ఏడాది క్రితం మచిలీపట్నం నుంచి డాక్టర్‌ అరుణకుమారిని సివిల్‌ సర్జన్‌ స్పెలిస్టుగా పదోన్నతి కల్పించి ఏలూరు ప్రభుత్వాస్పత్రికి నియమించారు. ఆమె వచ్చి కొద్ది రోజులకే వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆస్పత్రిలోని వైద్య విధాన పరిషత్‌ సిబ్బందిని బదిలీ చేశారు. ప్రస్తుతం డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ)లో ఏలూరు సర్వజన ఆస్పత్రి కొనసాగుతోంది. ఏడాది నుంచి ఇప్పటి వరకూ అలా్ట్రసౌండ్‌ స్కానింగ్‌ లేకపోవడంతో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. మెడికల్‌ కళాశాలకు అనుమతి వచ్చి నెల రోజులు దాటినా ఆయా విభాల్లోని వైద్యులను నియమించనేలేదు. ఆస్పత్రికి రోజుకు 100 నుంచి 150 మంది గర్భిణులు ఓపీ విభాగానికి వస్తున్నారు. అవసరమైన వారికి ఆలా్ట్రసౌండ్‌ స్కానింగ్‌ తీయాల్సి ఉంటుంది. కానీ ఆస్పత్రిలో అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు స్కాన్‌ సెంటర్లకు వెళ్లి సొమ్ములు చెల్లించి స్కానింగ్‌ చేయించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సర్జికల్‌ విభాగానికి సంబంధించి ఆలా్ట్ర సౌండ్‌ స్కాన్‌ అవసరం అవుతుంది. వారి పరిస్థితీ ఇదే విధంగా ఉంది. సర్జికల్‌ విభాగానికి సంబంధించి రోగులకు సిటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ స్కాన్‌ గాని చేయిస్తున్నారు. కానీ ఆస్పత్రికి వచ్చే గర్భిణుల పరిస్థితే దారుణంగా ఉంది. ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఇప్పటికే ఐదు ఆలా్ట్రసౌండ్‌ స్కానింగ్‌ మిషన్లను ఫ్రీ కన్‌సెప్షన్‌ అండ్‌ ఫ్రీ నాటల్‌ డయాగ్నస్టిక్‌ టెక్నిక్స్‌ యాక్ట్‌ (పీసీపీఎన్‌డీటీ యాక్టు) కింద జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నమోదు చేయించారు. మరో రెండు అత్యాధునిక ఆలా్ట్రసౌండ్‌ స్కానింగ్‌ మిషన్లు సర్వజన ఆస్పత్రికి వచ్చాయి.ఈ రెండు మిషన్లను పీసీపీఎన్‌డీటీయాక్టు కింద నమోదు చేయాల్సి ఉంటుంది. ఏడు మిషన్లు ఆస్పత్రికి అందుబాటులో ఉన్నా ఒక్క అసిస్టెంట్‌ రేడియాలజీ వైద్యుడు కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు కనీసం అసిస్టెంట్‌ రేడియాలజీ వైద్యులనైనా నియమిస్తే గర్భిణులకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంది.

Updated Date - 2023-06-03T00:48:02+05:30 IST