గప్‌చుప్‌గా..
ABN , Publish Date - Dec 17 , 2023 | 11:26 PM
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో వైద్య ఆరోగ్యశాఖ, వైద్య విధాన పరిషత్, మెడికల్ కాలేజీలకు సంబంధించిన వివిధ రకాల పోస్టుల భర్తీలో భారీ అవకతవకలు జరిగినట్టు స్పష్టంగా తేటతెల్లమవుతోంది.
ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీలో ఎన్నో అక్రమాలు
స్పందనలో ఫిర్యాదు చేసినా చర్యలు కరువు
తప్పుడు సమాచారంతో ఉన్నతాధికారులనే బోల్తా కొట్టించిన ఓ ఉద్యోగి
నకిలీ సర్టిఫికెట్లతో తన కుటుంబ సభ్యుడికే ఉద్యోగం..
మరికొందరికి నకిలీ కొవిడ్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు
పూర్తిస్థాయిలో విచారణ జరపాలంటున్న నిరుద్యోగులు
ఏలూరు క్రైం, డిసెంబరు 17 :
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో వైద్య ఆరోగ్యశాఖ, వైద్య విధాన పరిషత్, మెడికల్ కాలేజీలకు సంబంధించిన వివిధ రకాల పోస్టుల భర్తీలో భారీ అవకతవకలు జరిగినట్టు స్పష్టంగా తేటతెల్లమవుతోంది. అధికారులు చూసీచూడ నట్టు వ్యవహరించడం, నకిలీ అభ్యర్థుల్లో కొంతమందిపైనే ఫిర్యా దులు చేయడం, మరికొందరిని దొడ్డిదారిన ఇళ్లకు పంపిం చడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైద్య విధాన పరిషత్‌లో పనిచేస్తున్న కొంతమంది ఉద్యో గులు ఈ వ్యవ హారంలో కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలు విన్పిస్తున్నా యి. ఒక ఉద్యోగైతే ఏకంగా తన కుటుంబంలో ఒకరికి అర్హత లేకపోయినా పోస్టింగ్ కల్పిం చారు. చివరకు పట్టుబడడంతో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ క్రమంలోనే ఉద్యోగాల భర్తీలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.
2022 ఆగస్టులో వైద్య ఆరోగ్యశాఖ, వైద్య విధాన పరిషత్, మెడికల్ కాలేజీల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో వివిధ రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మెరిట్ ప్రకారమే ఉద్యోగ నియామ కాలు, రిజర్వేషన్‌ను అనుసరించి ఏడాది కాల వ్యవధితో ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దీంతో వైద్య విధాన పరిషత్‌లోని కొంత మంది ఉద్యోగులు అక్రమాలకు తెరతీశారు. ఆ పోస్టులలో కొన్నింటిని దొడ్డిదారిన అక్రమ మార్గంలో భర్తీ చేశారనే విమర్శలు వచ్చాయి. అప్పట్లోనే పలు ఫిర్యా దులు వచ్చినా తగిన విచారణ చేయకుండా, ఏ ఉద్యోగి అయితే ఈ అక్రమాలకు పాల్పడ్డాడో అదే ఉద్యోగి ఆ ఫిర్యాదులకు తిరిగి సమాధానం చెప్పే సీటులో ఉండడంతో అన్ని ఫిర్యాదులను మూసివేశారు. మొదటి విడత కొవిడ్ ఆరు నెలలు, రెండో విడత కొవిడ్‌లో ఆరు నెలలు తాత్కాలికంగా వివిధ రకాల పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయగా వారు కొవిడ్ సేవలు అందించారు. అనంతరం వివిధ రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నేపథ్యంలో కొోవిడ్‌లో ఏ పోస్టులో పనిచేశారో అదే పోస్టు ఈ రిక్రూట్‌మెంట్‌లో ఉంటే మొదటి ఆరు నెలలు కొవిడ్‌లో పనిచేసిన వారికి సర్వీసు మార్కులు కింద ఐదు మార్కులు, రెండవ కొవిడ్ సేవలకు ఐదు మార్కులు అదనంగా ఇచ్చేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదే అదనుగా దరఖాస్తు చేసుకున్న వారిలో చాలా మంది కొవిడ్‌లో పనిచేయకుండానే నకిలీ సర్టిఫికెట్లు పెట్టి సర్వీసు మార్కులను పొందారు. వాస్తవానికి కొవిడ్‌లో అపాయింట్‌మెంట్ ఆర్డర్, బ్యాంక్ అకౌంట్‌లో వారికి ఆరు నెలలు పడి గౌరవ వేతనం స్లిప్‌లను పెట్టాల్సి ఉంది. ఒకవేళ అపాయింట్‌మెంట్ ఆర్డర్ లేకపోయినా ఖచ్చితంగా జీతం పడిన బ్యాంక్ అకౌంట్ వివరాలు, వీటితో పాటు కొవిడ్‌లో ఎక్కడ పని చేశారో ఆ ఆస్పత్రి నుంచి జారీ చేసిన సర్వీసు సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంది. కేవలం సర్వీసు సర్టిఫికెట్ ఒకటే పెట్టి మార్కులు పొందారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ విధంగా 20 మంది వరకు ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
అంతేకాకుండా 108 అంబులెన్సులో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు లేక పోయినా ఆ సర్వీసును రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ పరిగణలోకి తీసుకోక పోయినా ఇక్కడ మాత్రం పరిగణ లోకి తీసుకుని ఇద్దరికి ఉద్యో గాలు ఇవ్వడం పట్ల అప్పట్లో స్పందనలో కొంతమంది అభ్యర్థులు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 108లో పైలెట్ (డ్రైవర్), ఈఎంటీ (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్) పోస్టులు మాత్రమే ఉన్నాయి. అంతకు మించి ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు కాని లేవు. డ్రైవర్ పోస్టులు తీస్తే డ్రైవర్‌గా సర్వీసుకు మార్కులు పొందవచ్చు. ఈఎంటీగా పోస్టులు తీస్తే ఈఎంటీ మార్కులు పొందవచ్చు. ఇక్కడ ఈఎంటీగా పనిచేసిన వారికి ల్యాబ్‌టెక్నీషియన్‌గా సర్వీసు మార్కులు కలిపారు. ఈఎంటీగా చేసిన వారికి ఫార్మసీ పోస్టుల భర్తీలో మార్కులు కలిపారు. రాష్ట్రంలోని ఏ జిల్లాలోను ఇలా అడ్డగోలుగా సర్వీసు మార్కులు కలప లేదు. ఇక్కడ మాత్రం ఒక ఉద్యోగి ఈ విధంగా తమకు కావాల్సిన వారికి పోస్టులు ఇవ్వడానికి మార్కులు కలిపినట్టు తెలుస్తోంది. రేడియో గ్రాఫర్ పోస్టుల భర్తీలో డిగ్రీ అర్హత ఉన్నప్పటికీ వారికి ఉద్యోగం ఇవ్వకుండా తమ అనుకున్న వారికి కాంట్రాక్టు పోస్టులు ఇవ్వడానికి ముందే ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆ విధంగా మెరిట్ లిస్టును తయారు చేశారు. దీంతో అర్హులైన బాధితులు వెంటనే వైద్య విధాన పరిషత్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా రేడియో గ్రాఫర్ డిగ్రీ చేసిన వారు కూడా రేడియో గ్రాఫర్ పోస్టులకు అర్హతేనని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ లోపే ఆర్డర్లు ఇచ్చేసి పోస్టింగుల్లో తమవాళ్లను కూర్చోబెట్టేశారు. అర్హత ఉన్న వారిని పక్కన పెట్టి అర్హత లేని వారిని ఉద్యోగాల్లో కూర్చోపెట్టారని స్పందనలో ఫిర్యాదులు చేయగా సమస్య పరిష్కారం అయిందని తప్పుడు సమాచారంతో ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించి స్పందన ఫిర్యాదులను సైతం మూసివేశారు.
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేసే ఒక ఉద్యోగి రేడియోగ్రాఫర్ నకిలీ సర్టిఫికెట్ తెచ్చుకుని వైద్య విధాన పరి షత్‌లో పనిచేసే ఒక ఉద్యోగి సహకారంతోనే పోస్టు పొంది అదే ఆస్పత్రి లోని ఎక్స్‌రే విభాగంలో ఉద్యోగంలో చేరాడు. ఎనిమిది నెలల పాటు హాయిగా జీతం తీసుకున్నాడు. చివరకు అతను దరఖాస్తుతో పెట్టిన రేడియో గ్రాఫర్ సర్టిఫికెట్ నకిలీదిగా తేలడంతో గుట్టు చప్పుడు కాకుం డా అతనిని ఇంటింటికి పంపించారు. వాస్తవానికి క్రిమినల్ కేసు పెట్టాల్సి ఉన్నా ఈ విషయాన్ని గప్‌చుప్‌గా దాసేశారు. ఆడియో మెట్రిక్ టెక్నీషి యన్ పోస్టుల్లో మాత్రం ఒక ఉద్యోగినిపై అదే సమయంలో కేసు కట్టించి చేతులు దులుపేసుకున్నారు. డీసీహెచ్‌ఎస్ కార్యాలయంలో పనిచేసే ఒక ఉద్యోగికి సంబంధించిన ప్రాంతానికి చెందిన వారే 28 మంది వరకు ప్రస్తుతం వివిధ రకాల ఆ నోటిఫికేషన్‌లో ఉన్న ఉద్యోగాల్లో అక్రమ మార్గంలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టులో పనిచేస్తున్నారని ప్రచారం ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు 2022 ఆగస్టు నోటిఫికేషన్ ద్వారా ప్రస్తు తం ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాల్లో ఉన్న వారి అర్హత సర్టిఫి కెట్లను, వివిధ రకాల సర్వీసు సర్టిఫికెట్లను పరిశీలిస్తే వాస్తవాలు బయట పడతా యని, నిజమైన ప్రతిభావంతులకు న్యాయం జరుగుతుందని బాధితు లు వాపోతున్నారు. ప్రస్తుతం ఆడియో మెట్రిక్ టెక్నీషియన్ పోస్టుల్లో నకిలీ సర్టిఫికెట్లు పొందారని ఇటీవల ఇద్దరిపై ఏలూరు టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.