మండిన ఎండ.. అల్లాడిన జనం

ABN , First Publish Date - 2023-05-25T23:46:06+05:30 IST

రోహిణి కార్తె ప్రవేశంతో ఎండలు మండిపోతున్నాయి. వడగాడ్పులు, ఉక్కబోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

మండిన ఎండ.. అల్లాడిన జనం

రోహిణి కార్తె ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు నమోదు

చింతలపూడి / కామవరపుకోట, మే 25: రోహిణి కార్తె ప్రవేశంతో ఎండలు మండిపోతున్నాయి. వడగాడ్పులు, ఉక్కబోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. గురువారం ఉదయం 9 గంటల నుంచి రోడ్లపై జన సంచారం తగ్గిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేడిమి గాలులు వీచడంతో ఇంట్లో ఉండలేక, వీధుల్లో తిరగలేక సతమతమయ్యారు. వృద్ధులు, చిన్నారులు, వ్యాధిగ్రస్తులు తాపానికి తల్లడిల్లారు. రోహిణి ప్రభా వం చూపించిందంటూ ప్రజలు అసహనాన్ని వ్యక్తం చేశారు. జూన్‌ 8 వరకు రోహిణి కార్తె ఉంటుందని పండితులు తెలియజేశారు. పెళ్లిళ్ల సీజన్‌ కావడం తో షాపింగ్‌లకు వచ్చే వారు ఏసీ దుకాణాల వైపు చేస్తున్నారు. చింతలపూడి పట్టణంలో చలివేంద్రాలు లేకపోవడంతో దూర ప్రాంతాల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. జ్యూస్‌ సెంటర్లలోను, దుకాణాల్లో ఉండే వాటిని వినియోగిం చుకుంటున్నారు. కొందరు ఇంటి నుంచి తెచ్చుకున్న నీటిని వినియోగించారు. పెళ్ళిళ్ళ సీజన్‌ అయినప్పటికీ మార్కెట్‌లో సందడి లేదు.

వడదెబ్బ నివారణ జాగ్రత్తలు పాటించాలి

ఎండ తీవ్రతతో వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకో వాలని వైద్యాధికారి సునీల్‌వర్మ సూచించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వీధుల్లోకి వెళ్లవద్దని సూచిస్తున్నారు. డీహైడ్రే షన్‌కు గురైతే సరైన సమయంలో చికిత్స తీసుకోవాలన్నారు. నీరు, పళ్ల రసాలు, కొబ్బరినీళ్లు, మజ్జిగ, ద్రవ పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. లేత వర్ణం, తేలికైన కాటన్‌ దుస్తులను ధరించాలన్నారు. రోజూ కనీసం 15 గ్లాసుల నీళ్లు తాగాలన్నారు. పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల న్నారు. రెండు పూటలా స్నానం చేయాలని, భోజనం మితంగా చేయాలని, ఎండ వేళ ఇంటిపట్టునే ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపి, కాళ్లకు చెప్పులు వేసుకోవాలన్నారు. ఇంట్లో కిటికీలు తెరిచే ఉంచుకోవాలని, ఫ్యాన్‌ వేసి చల్లగా ఉంచుకోవడం వలన వేసవి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. వదడెబ్బ తగిలిన వారికి తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాపాయమేనని స్పష్టం చేశారు. వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ గల ప్రదేశానికి చేర్చాలన్నారు. చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డతో శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చే వరకు తుడుస్తూనే ఉండాలి. చల్లని గాలి తగిలేలా ఉండాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, చిటికెడు ఉప్పు కలిగిన గ్లూకోజు ద్రావణం, ఓరల్‌ డ్రిహైడ్రేషన్‌ ద్రావణం తాగించాలన్నారు. వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలో ఉంటే నీరు తాగించ కుండా వీలైనంత త్వరగా వైద్య కేంద్రానికి తీసుకువెళ్లాలని సూచించారు.

Updated Date - 2023-05-25T23:46:06+05:30 IST