వెల్లివిరుస్తున్న మతసామరస్యం

ABN , First Publish Date - 2023-02-07T00:19:29+05:30 IST

జగన్నాథపురంలో ఉరుసు ఉత్సవాలు కుల మతాలకతీతంగా సాగుతున్నాయి.

వెల్లివిరుస్తున్న మతసామరస్యం

జగన్నాథపురంలో కుల, మతాలకతీతంగా ఉరుసు ఉత్సవాలు

తాడేపల్లిగూడెం రూరల్‌, ఫిబ్రవరి 6: జగన్నాథపురంలో ఉరుసు ఉత్సవాలు కుల మతాలకతీతంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఘమ్మస్‌ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పూలతో అలంకరణ నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హజరత్‌ కాలే మస్తాన్‌ షాకు ప్రత్యేక పూజలు చేశారు. ఇటు ముస్లిం మత పెద్దలులు కూడా ముస్లిం ఆచారాలతో ఈ దర్గా వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. దర్గాను టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వలవల బాబ్జి, జిల్లా అధికార ప్రతినిధి ముత్యాల సత్యనారాయణ, పరిమి వీరభద్రరావు, తదితరులు సందర్శించి పూజలు చేశారు.

ఉరుసు ఉత్సవాల కథ ఇది..

106 ఏళ్లుగా హిందువులు నిర్వహించే ఈ ఉరుసు వేడుకలకు ఒక కథ ఉంది. 1917లో ఒక కుటుంబం ఆస్తి విషయంమై కోర్టు కేసులో ఇబ్బంది పడుతున్న తరు ణంలో తెలిసిన వారు హజరత్‌ కాలేషా మస్తాన్‌ షా దర్గాకు వెళ్లి మొక్కుకుంటే కేసు గెలుస్తారని చెప్పారు. ఆ మేరకు దర్గాకు వెళ్లి మొక్కుకున్న అతి తక్కువ సమయంలోనే ఆస్తి వారి సొంతం అయింది. దీంతో ఆ ప్రాంతానికి వెళ్లిన సమయంలో ఆ కుటుంబలో ఒకరైన వెంకాయమ్మ కలలో మస్తాన్‌ బాబా కనపడి తనకు దర్గా నిర్మించాలని కోరగా జగన్నాఽథపురంలో 1918లో దర్గాను నిర్మించారు. అప్పటి నుంచి వారి వంశానికి చెందిన వారే ఈ దర్గాను నిర్వహిస్తూ ఉరుసు ఉత్సవం నిర్వహిస్తున్నారు. హిందూ ముస్లింల కతీతంగా ఈ ప్రాంత ప్రజలతో పాటు చుట్టు పక్కల గ్రామాల వారు ఉత్సవాల్లో పాల్గొంటారు. ప్రస్తుతం ఈ దర్గాను వెంకాయమ్మ వారసులు అబ్బిన నాగమణి, రాజీవ్‌ చౌదరి నిర్వహిస్తున్నారు. ఈ ఉరుసు ఉత్సవానికి రాష్ట్ర నలుమూలల నుంచి ముస్లిం పెద్దలు హాజరై దర్గా వద్ద ఉత్సవాల నిర్వహణకు సహకారం అందిస్తారు.

Updated Date - 2023-02-07T00:19:34+05:30 IST