మామి‘డీలా’

ABN , First Publish Date - 2023-05-31T23:58:09+05:30 IST

మామిడి సాగుదారులు ఏటా నష్టాల పాలవుతూనే ఉన్నారు. ప్రస్తుత సీజన్‌లో మామిడి రైతుతో తొలుత వాతావరణం దోబూచులాడడంతో చేతికంది వచ్చిన పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా కృషి చేయాల్సి వచ్చింది.

మామి‘డీలా’
చాట్రాయిలో రోడ్డుపక్కన పారబోసిన మామిడి కాయలు తింటున్న గేదె

తొలుత వాతావరణం దోబూచులాట

తెగుళ్ల విజృంభణ.. పెరిగిన పెట్టుబడులు

నాలుగు దశాబ్దాల కనిష్ఠానికి ధర

కాయలు కొని నగదు చెల్లించని ఢిల్లీ సేఠ్‌లు

ప్రభుత్వం తీరుతో మామిడి రైతులు కుదేలు

(నూజివీడు టౌన్‌)

మామిడి సాగుదారులు ఏటా నష్టాల పాలవుతూనే ఉన్నారు. ప్రస్తుత సీజన్‌లో మామిడి రైతుతో తొలుత వాతావరణం దోబూచులాడడంతో చేతికంది వచ్చిన పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా కృషి చేయాల్సి వచ్చింది. ఒకవైపు పురుగు మందుల పిచికారీ రూపేణ పెట్టుబడులు రెట్టింపు అవ్వగా మరోవైపు మంగు తెగులుతో కాయ నాణ్యత పూర్తిగా దెబ్బతింది. దాదాపు నాలుగు దశా బ్దాల కనిష్ఠానికి బంగినపల్లి ధర పడి పోయింది. మామిడి రైతు పరిస్థితిని ఆసరాగా తీసుకున్న ఢిల్లీ సేఠ్‌లు అందిన కాడికి దండుకోగా, ప్రస్తుతం కొన్న కాయలకు సైతం నగదు చెల్లింపులు చేయకుండా స్వస్థలాలకు వెళ్లిపోవడంతో మధ్యవర్తులుగా ఉన్న కమిషన్‌ ఏజెంట్లు, మామిడి రైతులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది.

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నూజివీడు సబ్‌ డివిజన్‌లో దాదాపు 40 వేల హెక్టార్లలో మామిడి సాగు అవుతోంది. నూజివీడు నియోజకవర్గాన్ని ఏలూరు జిల్లాలో విలీనం చేయగా, ప్రస్తుతం ఏలూరు జిల్లాలో సైతం మామిడి దాదాపు అంతేమొత్తంలో సాగులో ఉంది. మామిడి సీజన్‌ డిసెం బరు నుంచి ప్రారంభం కాగా సీజన్‌లో మూడు దఫాలుగా దాదాపు పదిరోజుల పాటు వేసవిలో భారీ వర్షాలు నమోదు కావడంతో మామిడిలో చీడపీడల ఉధృతి విపరీతంగా పెరిగింది. దీంతో సీజన్‌ మొత్తం మీద సాధారణంగా రెండు, మూడు దఫాలతో సరిపెట్టే పురుగు మందుల పిచికారీని పది నుంచి పదిహేనుసార్లు పిచికారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు పెట్టుబడులు మూడింతలు పెరిగాయి. అయినా రాతిమంగు, తేనెమంగులు ఉధృతి పెరగడంతో మామిడి కాయల నాణ్యత తీవ్రంగా దెబ్బతింది. బంగినపల్లి, కలెక్టర్‌ (తోతాపురి), రసం, చిన్నరసం, సువర్ణరకంల ప్రతిరకం మామిడి నాణ్యత తీవ్రంగా దెబ్బతినడంతో ఏప్రిల్‌ 15వ తేదీవరకు ఆశాజనకంగా ఉన్న మామిడి కాయల మార్కెట్‌, అనంతరం పతనమ వ్వడంతో మామిడికాయలు కొనేనాథుడు కరువు అయ్యాడని చెప్పవచ్చు.

నాలుగు దశాబ్దాల కనిష్ఠానికి ధర

మామిడి ఫలరాజం బంగినపల్లి సాధారణంగా మార్కెట్లో టన్ను రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ధర పలుకుతోంది. ప్రస్తుత చీడపీడల ఉధృతి నేపఽథ్యంలో సంబంధిత మామిడిధర నాలుగు దశాబ్దాల కనిష్ఠానికి అంటే టన్ను రూ.2వేల నుంచి రూ.4వేలకు పడిపోయింది. ఒక కాయ ధర కేవలం రూ.60 పైసలకు పడిపోవడంతో మామిడి రైతు కాయలను ఏం చేయాలో తెలియక తోటను ఖాళీ చేయాల్సిన పరిస్థితుల్లో కాయలను మార్కెట్‌కు తరలించారు. ఇదే అదునుగా భావించిన దళారులు ధరను భారీగా తగ్గించడంతో పెట్టుబడులు రాని పరిస్థితుల్లో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.

ముఖం చాటేస్తున్న ఢిల్లీ సేఠ్‌లు

మామిడి రైతు దుస్థితిని ఆసరాగా తీసుకుని, ధరను పతనం చేసిన ఢిల్లీ సేఠ్‌లు చివరికి ఆ రెండు నుంచి రూ.4వేలు ధరను సైతం ఇవ్వకుండా రైతులకు ముఖం చాటేస్తున్నారు. మామిడి ఉత్పత్తులను జ్యూస్‌ తదితరాలకు ఢిల్లీ పంపిన సేఠ్‌లు నగదును చెల్లించేందుకు వారం నుంచి పదిరోజుల గడువు విధించారు. అనంతరం తమ స్వస్థలాలకు వెళ్లిపోయి ముఖం చాటేసి ఫోన్‌లను సైతం స్విచ్‌ఆఫ్‌ చేశారు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో నూజివీడు, పరిసర ప్రాంతాల్లోని ఆగిరిపల్లి, ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలోని చీమల పాడు, విస్సన్నపేట, తిరువూరు తదితర ప్రాంతాలకు చెందిన కమిషన్‌ ఏజెంట్లు ఉన్నారు.

దెబ్బతీసిన వైసీపీ ప్రభుత్వం తీరు

అననుకూల వాతావరణ పరిస్థితుల్లో మామిడి రైతును ఆదుకునేందుకు గత టీడీపీ ప్రభుత్వం 2015లో ప్రవేశపెట్టిన వాతావరణ ఆధారిత పంటల బీమాకు ప్రస్తుత వైసీపీ ప్రభు త్వం తిలోదకాలు ఇవ్వడంతో మామిడి రైతు పరిస్థితి రెండిం టికి చెడ్డ రేవడిలా తయారైంది. టీడీపీ ప్రభుత్వం 2015లో వాతావరణ ఆధారిత పంటల బీమాను ప్రవేశపెడుతూ రాష్ట్రంలోని చిత్తూరు, నెల్లూరు, కడప, కృష్ణ, పశ్చిమ గోదా వరి, విజయనగరం జిల్లాలకు సంబంధిత బీమాను వర్తింప చేసింది. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం సంబంధిత వాతావరణ ఆధారిత పంటల బీమా అమలులో ఉందా? లేదా? అనేది సైతం తెలియని వ్వకుండా తిలోదకాలు ఇచ్చింది. ప్రస్తుతం మామిడి రైతు దుస్థితికి రాష్ట్రప్రభుత్వ తీరే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత సీజన్‌ లో పంటల బీమా అమలులో ఉండి ఉంటే మామిడి రైతులు కొంత గట్టెక్కే పరిస్థితి ఉండేది. గత ప్రభుత్వాలు మామిడిలో కవర్లు కట్టే విధానం ప్రవేశపెట్టి నూరుశాతం సబ్సిడీపై కవర్లను అందించాయి. ప్రస్తుత ప్రభుత్వం సబ్సి డీని ఎత్తివేయడంతోనే మామిడిలో రాతిమంగు, తేనెమంగు, ఉధృతమవ్వడానికి కారణమని దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని రైతుసంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

పశువులకు ఆహారంగా మామిడి కాయలు

చాట్రాయి, మే 31: కాసులను కురిపించాల్సిన మామిడి కాయలు మంగుతెగులు వల్ల పశువులకు ఆహారంగా మారు తున్నాయి. ఈ ఏడాది మామిడికి మంచి ఆదాయం వస్తుందని రైతులు కొండంత ఆశతో ఉన్న సమయంలో అకాల వర్షాలు వచ్చి మంగుతెగులు సోకి అధిక శాతం తోటల్లో కాయలు నల్లగా మారిపోయాయి. ఈ కాయలు మార్కెట్‌కు తీసుకెళ్లితే ఎవరూ కొనడం లేదు. చెట్లకు వదిలేస్తే పండి రాలిపడిపోతున్నాయి. చెట్లపై కాయలు పండి రాలిపోతే చెట్లలోని సారం తగ్గిపోయి వచ్చే ఏడాది కాపు రాదు. చేసేది లేక కాయలు కోసి రోడ్లు పక్కన పారబోస్తున్నారు. గత ఐదారేళ్ల నుంచి వివిధ కారణాల వల్ల మామిడి సాగులో వరుస నష్టాలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెగుళ్ల బెడద వల్ల నిండా మునిపోతున్నామని, ప్రభుత్వం సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించడంతో పాటు మార్కెటింగ్‌ సదుపాయం, గిట్టుబాటు ధర ఇప్పించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని మామిడి రైతులు కోరుతున్నారు.

Updated Date - 2023-05-31T23:58:09+05:30 IST