చేదు ఫలం
ABN , First Publish Date - 2023-03-05T00:19:17+05:30 IST
మామిడి పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది నూజివీడు. ఫలరాజంగా పేరుగాంచిన మామిడిని ఉమ్మడి కృష్ణా జిల్లా లో 60 వేల హెక్టార్లలో సాగులో ఉండగా, జిల్లాల పునర్ వ్యవస్తీకరణ అనంతరం ఏలూరు జిల్లా పరిధిలో 40 వేల హెక్టార్లలో సాగులో ఉంది.
నేలరాలుతున్న మామిడి పూత, పిందెలు
రాత్రి వేళల్లో మంచుతో దిగుబడికి దెబ్బ
అధికంగా పురుగు మందుల వాడకం
పెరిగిన ఖర్చులు.. రైతుల గగ్గోలు
(నూజివీడు):
మామిడి పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది నూజివీడు. ఫలరాజంగా పేరుగాంచిన మామిడిని ఉమ్మడి కృష్ణా జిల్లా లో 60 వేల హెక్టార్లలో సాగులో ఉండగా, జిల్లాల పునర్ వ్యవస్తీకరణ అనంతరం ఏలూరు జిల్లా పరిధిలో 40 వేల హెక్టార్లలో సాగులో ఉంది. అయితే అననుకూల వాతావ రణ పరిస్థితుల నేపఽథ్యంలో, లాభాల బాటలో పయనించా లని ఆశించిన మామిడి రైతుకు గత కొన్నేళ్ళుగా ఏటా ఏదో రూపేణా నష్టాల బాట తప్పడం లేదు. రెండేళ్ల క్రితం క్రితం కోవిడ్ నేపఽథ్యంలో మార్కెట్లు లేక వచ్చిన దిగుబడులను మార్కెట్ చేసుకునే పరిస్థితి లేక మామిడి రైతు తీవ్రంగా నష్టపోతే ఈ సీజన్‌లో అననుకూల వాతావరణ పరిస్థితులు మామిడి రైతును వెంటాడుతు న్నాయి. నవంబర్ నుంచి నూజివీడు డివిజన్ పరిధిలో పూతలు ప్రారంభమవడంతో ముందస్తు దిగుబడులు వస్తాయని రైతులు భావించారు. అయితే ముందస్తుగా వచ్చిన పూత పిందెగా మారగా ఈ సీజన్‌లో మామిడి లాభాలను అందిస్తుందని రైతులు ఆశిం చారు. దాదాపు నెల రోజులుగా తిరిగి పూతలు రావడంతో పిందె దశలోవున్న మామిడి నేలరాలుతూ మామిడి రైతును నిరాశపరుస్తూ, పంటకు తీవ్రంగా నష్టం జరుగుతోంది. వాస్తవంగా రాత్రి ఉష్ణోగ్రత 16 డిగ్రీలు, పగటి ఉష్ణోగ్రత 36 డిగ్రీలు వాతావరణ పరిస్థితి ఉంటే మామిడి బోటు(మొగ్గ) దశ నుంచి పూతదశ ఏర్పడుతుంది. డిసెంబర్, జనవరి నెలల్లో చెదురుమదురుగా పడిన వర్షాల వల్ల వాతావరణంలో వేడి పెరగడంతో పూత దశ నెమ్మదించింది. ఫిబ్రవరి మధ్య స్తం నుండి మార్చి ప్రథమార్థం వస్తున్నా రాత్రి పూట శీతల గాలులు వీయడంతోపాటు ఉదయం తొమ్మిది గంటల వరకు మోడెం(మంచు) ఏర్పడటంతో మామిడి తోటల్లో తిరిగి పూత లు వస్తున్నాయి. ఫలితంగా మామిడి చెట్లలో సారం వచ్చే పూతకు వెళ్లడంతో ముందస్తుగా వచ్చిన పిందెలు రాలి నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు.
ఆశ నిరాశల మధ్య రైతులు
అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా పిందె దశలో ఉండాల్సిన మామిడి తిరిగి పూతలు రావడంతో మామిడి రైతు ఆశ, నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. వచ్చిన పిందె నేల రాలడంతో దిగుబడులపై నిరాశ, తిరిగి పూతలు వస్తుండటంతో, పిందె నిలబడి అనుకున్న దిగుబడులు రాకపోతాయా అనే ఆశల మధ్య మామిడి రైతు కొట్టు మిట్టాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా పెట్టుబడులు విపరీతంగా పెరుగుతుండగా పురుగు మందుల వాడకం సైతం అధికమవుతోంది. సాధారణంగా మామిడి పూత, పిందె దశలో మూడు నుంచి నాలుగుసార్లు పురుగు మందుల పిచికారి సాధారణంగా జరుగుతుంది. అయితే నవంబరు నుంచి పూతలు కనిపించడంతో నాటి నుంచి నేటి వరకు దాదాపు పదిసార్లకు మించి పురుగు మందులు పిచికారి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో దాదాపు 50 శాతం పెట్టుబడులు పెరుగుతున్నాయని రైతులు వాపోతున్నారు.
పెరిగిన చీడపీడల ఉధృతి
మామిడి ప్రస్తుత సీజన్‌లో చీడపీడల ఉధృతి అధికంగా కనిపిస్తోంది. ప్రధానంగా కోడిపేను పూత దశలో మామిడిని దెబ్బ తీస్తోందని రైతులు వాపోతున్నారు. గత ఏడాది మిర్చి పంటపై ప్రభావం చూపిన కోడి పేను ఈ సీజన్‌లో మామిడి పూత దశలో తీవ్రంగా దెబ్బతీస్తోంది. పూతలోని పుప్పొడిని తింటూ ఉండటమే కాక పిందె ఏర్పడే దశలో పిందెపై గీరడంతో పిందెలు దెబ్బ తింటున్నాయని వీటి నివారణకు ఎన్ని పురుగు మందులు వాడినా ఉపయోగం ఉండటం లేదంటూ రైతులు వాపోతున్నారు.