చనుబండ అపర భద్రాద్రిలో.. మహా పట్టాభిషేకం

ABN , First Publish Date - 2023-04-01T00:21:29+05:30 IST

అపర భద్రాద్రిగా పేరుగాంచిన చనుబండ కోదండరామాలయంలో శుక్రవారం శ్రీరామ మహాపట్టాభిషేకం వైభవంగా నిర్వహించారు.

చనుబండ అపర భద్రాద్రిలో.. మహా పట్టాభిషేకం
మహాపట్టాభిషేకం నిర్వహిస్తున్న అర్చకస్వాములు

చాట్రాయి, మార్చి 31: అపర భద్రాద్రిగా పేరుగాంచిన చనుబండ కోదండరామాలయంలో శుక్రవారం శ్రీరామ మహాపట్టాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఉదయం 11 గంటలకు సీతారామలక్ష్మణులను పల్లకిలో ఊరేగిస్తూ భక్తుల జయజయధ్వానాలతో మండపానికి తీసుకువచ్చారు. అర్చకస్వాములు విష్వక్సేన, కలశ తదితర పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించి మహాపట్టాభిషేకం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అర్చక స్వాములు మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో శ్రీరాముడి పాలన ఉత్తమమైనదని, అందుకే ప్రతి ఒక్కరూ రామరాజ్యం రావాలని కోరుకుంటారన్నారు. రాష్ట్ర సహకార యూనియన్‌ చైర్మన్‌ దేశిరెడ్డి రాఘవరెడ్డి దంపతులు, నియోజకవర్గ టీడీపీ నాయకులు పర్వతనేని గంగాధర్‌ స్వామివారికి పూజలు చేశారు. చుట్టు పక్కల మండలాలు, సరిహద్దు తెలంగాణ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి మహాపట్టాభిషేకాన్ని తిలకించారు. అన్నదాన కమిటీ ఆధ్వర్యలో 2500 మంది మహిళలకు సీతమ్మ ప్రసాదంగా గాజులు, పసుపు కుంకుమ పంపిణీ చేశారు. అనంతరం భారీ అన్నసమారాధన జరిగింది. విజయవాడకు చెందిన దివ్యాంగురాలు తన తల్లి సహకారంతో వీల్‌చైర్‌లో వచ్చి చనుబండలో సీతారామ కల్యాణం, శ్రీరామ మహాపట్టాభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించింది. తాను సీఏ చదివి విద్యుత్‌శాఖలో అకౌంట్స్‌ ఆపీసర్‌గా పనిచేస్తున్నానని ప్రతి ఏటా శ్రీరామనవమికి చనుబండ కుటుంబంతో వస్తానని తెలిపారు.

Updated Date - 2023-04-01T00:21:29+05:30 IST