ప్రజా హోరు

ABN , First Publish Date - 2023-09-04T23:59:38+05:30 IST

యువగళం పాదయాత్రలో జనం హోరెత్తారు. మహిళలు, అభిమానులు యువనేత లోకేశ్‌కు సాదర స్వాగతం పలికారు. ఎక్కడికక్కడ పూలవర్షం కురిపించారు. ఉండి నియోజకవర్గంలో సోమవారం కోలమూరు నుంచి 204 రోజు యువగళం పాదయాత్ర ప్రారంభమైంది.

 ప్రజా హోరు
ఉండి మండంలో కోలమూరులో పాదయాత్రలో నారా లోకేశ్‌

ఉత్సాహంగా యువగళం పాదయాత్ర

లోకేశ్‌ దృష్టికి సమస్యల వెల్లువ

సావధానంగా వింటూ.. భరోసా ఇస్తూ..

యువనేతకు అడుగడుగునా నీరాజనాలు

నేడు భీమవరంలో బహిరంగ సభ

భీమవరం/ఉండి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): యువగళం పాదయాత్రలో జనం హోరెత్తారు. మహిళలు, అభిమానులు యువనేత లోకేశ్‌కు సాదర స్వాగతం పలికారు. ఎక్కడికక్కడ పూలవర్షం కురిపించారు. ఉండి నియోజకవర్గంలో సోమవారం కోలమూరు నుంచి 204 రోజు యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. ప్రతీ గ్రామంలోనూ ప్రజలు తమ సమస్యలను యువనేత దృష్టికి తీసుకువెళ్ళారు. కోలమూరు, పామలపర్రు, వెలివర్రు, ఉండి, ఎఆర్‌పీ అగ్రహారం మీదుగా భీమవరం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. కోలమూరులో పెద్ద సంఖ్యలో మహిళలు లోకేశ్‌ను కలిశారు. మంచినీరు కూడా సక్రమంగా సరఫరా చేయడం లేదని, తాగునీటికి కటకటలాడుతున్నామని వైసీపీ ప్రభుత్వంపై మహిళలు దుమ్మెత్తిపోశారు. మురుగు నీరు తాగడంతో అనారోగ్య సమస్యలు ఎదురువుతున్నాయిజ ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. విద్యుత్‌ సమస్య తీవ్రంగా ఉంది. ఎడాపెడా కోతలు విధిస్తున్నారు. లో ఓల్టేజీతో ఇళ్లలో విద్యుత్‌ పరికరాలు కాలిపోతున్నాయి. నాసిరకం మద్యం తాగి అనారోగ్యం పాలవుతున్నారంటూ మహిళలు ఏకరవు పెట్టారు. దీనిపై లోకేశ్‌ స్పందిస్తూ ప్రజల దాహార్తిని తీర్చేందుకు జలజీవన మిషన్‌ నిధులు కేటాయించినా వాటిని వినియోగించుకోలేని చేతకాని దద్దమ్మ ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే వాటర్‌ గ్రిడ్‌ ద్వారా ఇంటింటికి 24 గంటలపాటూ మంచినీరు సరఫరా చేస్తామని భరోసా ఇచ్చారు. లో ఓల్టేజీ సమస్యను పరిష్కరించి ప్రజలకు రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తామని చెప్పారు. నీరు చెట్టు ద్వారా టీడీపీ హయాంలో కాలువలో పూడికలు తీయిస్తే జగన్‌ వచ్చాక మరుగున పడేశారని ధ్వజమెత్తారు. ప్రతీ ఏటా కాలువలకు మరమ్మతులు చేపట్టి పూడికలు తీస్తామంటూ రైతులకు హామీ ఇచ్చారు. పామలపర్రులో మహిళలు యువనేతపై పూలవర్షాన్ని కురిపించి తమ అభిమానం చాటుకున్నారు. మహిళలు, వృద్ధులు తమ ముఖిలిత హస్తాలతో యువనేతను దీవించారు. ఉండి సెంటర్‌ జనంతో కిటకిట లాడింది. పాదయాత్ర వెంట ఆటోలు, మినీ వ్యాన్‌ల ర్యాలీ నిర్వహించారు. మార్గమద్యంలో వ్యాపారులు, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉండిలో ఆక్వా రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఆకివీడు, కాళ్ళ, ఉండి, పాలకొల్లు తదితర మండలాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. జగన్‌ హయాంలో ఆక్వా సంఘం సంక్షోభంలోకి కూరుకుపోయిందని లోకేశ్‌ దృష్టికి తీసుకువెళ్లారు. విద్యుత్‌ చార్జీల పెంపు, రాయితీ కుదింపు ధరల పతనం, రొయ్య ధరల పతనం, నాణ్యత లేని రొయ్య పిల్ల సరఫరా, మేత, మందుల ధర పెరుగుదల తదితర సమస్యలను రైతులు ఏకరవు పెట్టారు. వీటిని లోకేశ్‌ సావధానంగా విన్నారు. తెలుగుదేశం అధికారం లోకి వచ్చిన వెంటనే ఆక్వా సమస్యలన్నీ పరిష్కరిస్తామని సంక్షోభం నుంచి గట్టెక్కిస్తామని భరోసా ఇచ్చారు. లోకేశ్‌తో ఫొటోలు దిగేందుకు జనం ఎగబడ్డారు. పెంటపాడు మండలం కే.పెంటపాడులో ఇటీవల పంచాయతీ ఎన్నికలలో వైసీపీ డిపాజిట్లు గల్లంతైన విషయాన్ని నియోజకవర్గ ఇన్‌చార్జి వలవల బాబ్జి, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు గంధం సతీష్‌లు లోకేశ్‌ దృష్టికి తీసుకువెళ్ళారు. దీనిపై ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనాన్ని చూపించారు. పాదయాత్రలో శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మో హన్‌నాయుడు, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతా రామలక్ష్మి, ఎమ్మెల్యేలు మంతెన రామరాజు,నిమ్మల రామానాయుడు, పెన్మెత్స వెంకటేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యేలు శివరామరాజు, ఆరిమిల్లి రాధాకృష్ణ, బూరుగు పల్లి శేషారావు, మాజీ ఎమ్మెల్సీలు అంగర రామ్మోహన్‌రావు, పాందువ్వ శ్రీను, నరసాపురం ఎంపీ రఘు రామ కృష్ణంరాజు కుమారుడు భరత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-06T08:57:28+05:30 IST