కాపులను ఆదుకుంటాం
ABN , First Publish Date - 2023-09-04T00:07:40+05:30 IST
ఎటు చూసినా జనం... యువత కేరింతలు. మహిళలు, రైతులు, కార్మికులు, వ్యాపారులు సెల్ఫీ దిగేందుకు ఆరాటం. ఒక వైపు ఎండలు హోరెత్తిస్తున్నా నుదుట చెమట కారుతున్నా ఏమాత్రం ఖాతరు చేయకుండా ఎండలోనే లోకేశ్ పాదయాత్ర సాగింది.
ఉత్సాహంగా లోకేశ్ పాదయాత్ర
అడుగడుగునా పోటెత్తిన జనం
గణపవరంలో జన గర్జన
భువనపల్లి నుంచి ఎదురై స్వాగతం
వాసుబాబును చూస్తే జాలేస్తోంది
స్థానిక ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డ లోకేశ్
ఎటు చూసినా జనం... యువత కేరింతలు. మహిళలు, రైతులు, కార్మికులు, వ్యాపారులు సెల్ఫీ దిగేందుకు ఆరాటం. ఒక వైపు ఎండలు హోరెత్తిస్తున్నా నుదుట చెమట కారుతున్నా ఏమాత్రం ఖాతరు చేయకుండా ఎండలోనే లోకేశ్ పాదయాత్ర సాగింది. యువగళం పాదయాత్ర 203వ రోజుకు చేరింది. ఆదివారం ఉదయం విడిది చిన నిండ్రకొలను నుంచి ఆరంభమై ఉండి మండలం కోలమూరు వరకు నిర్విఘ్నంగా సాగింది.
ఏలూరు–ఆంధ్రజ్యోతి–ప్రతినిధి/నిడమర్రు/గణపవరం, సెప్టెంబరు 3 : టీడీపీ అధికారంలోకి వచ్చాక కాపులకు అన్ని విధాలా ప్రాధాన్యం ఇచ్చి ఆదుకుంటామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ భరోసా ఇచ్చారు. ఇప్పటికే ఈ ప్రభుత్వంలో అన్ని సామాజికవర్గాల మాదిరిగానే కాపులను కూడా జగన్ నమ్మించి గొంతు కోశాడని దుయ్యబట్టారు. అధికారంలోకి వస్తే కాపు కార్పొరేషన్‌కు ఏడాదికి రూ.2 వేల కోట్లు కేటాయిస్తామన్న జగన్ మాట తప్పి మడమ తిప్పాడని విమర్శించారు. కాపు నేతలు, యువకులపై తప్పుడు కేసులు బనాయించి వేదిస్తున్నాడన్నారు. నిడమర్రు మండలం పెదనిండ్రకొలనులో తమకు న్యాయం చేయాల్సిందిగా కోరుతూ వైసీపీ ప్రభుత్వ వైఖరిపై కాపు నాయకులు లోకేశ్‌కు వినతిపత్రం ఇచ్చారు. కాపు కార్పొరేషన్ ద్వారా టీడీపీ హయంలో రూ.3100 కోట్లు ఖర్చు చేశామని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. కాపు రిజర్వేషన్‌కు సంబంధించి సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.
గోదారోళ్ల ఎటకారం అంటే ఇష్టం..
గోదారోళ్ల ఎటకారం అంటే నాకు భలే ఇష్టం. గోదావరి నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో, ఇక్కడ ప్రజలకు అంత స్వచ్ఛమైన మనస్సు ఉంటుంది. ఉంగు టూరులో కుర్రాళ్ల ఉత్సాహం ఒక రేంజ్‌లో ఉంది. ఉంగుటూరు ఊపు చూస్తుంటే ఫ్యాన్ రెక్కలు ఇరగడం ఖాయమనిపిస్తోందని గణపవరం బహిరంగ సభలో లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. ఉంగుటూరు నియోజకవర్గంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అప్పటి ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు హయాంలో బాగా జరిగాయని..కానీ మీరు ఏం చేశారు. పాలిచ్చే ఆవును వద్దునుకున్నారు. వాసు బాబును గెలిపించారు. అభివృద్ధి జరిగిందా? ప్రజల జీవితాల్లో మార్పులు వచ్చాయా? వాసుబాబు తియ్యని మాటలతో నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందా? ఇచ్చిన హామీలను ఆయన ఒక్కటైనా నిలుపుకున్నారా.. అంటూ లోకేశ్ స్థానిక ఎమ్మెల్యే తీరుపై సెటైర్‌లు విసిరారు. నాలుగు మండలాలు నలుగురికి పంచేశారు.. వారేమో ప్రజలను దోచుకుంటున్నారు. రెండు సెంట్ల స్థలం పేరుతో గ్రావెల్ అమ్ముకున్నారు. కొల్లేరులో అక్రమంగా చెరువులు తవ్వి లీజులకిచ్చుకున్నారు. ఎమ్మెల్యే బంధువే షాడో ఎమ్మెల్యేగా పనిచేయడం లేదా అంటూ లోకేశ్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎమ్మెల్యేను చూస్తే జాలేస్తొంది. ఇంటి ముందు రోడ్డు వేసే దిక్కులేదు. ఆయనే బాధ పడుతు న్నాడంట. ఆయన సొంతూరులో తాగునీటి సమస్యను పరిష్కరిం చలేకపోయారట..అంటూ ఎమ్మెల్యే తీరుపై సుదీర్ఘంగా ప్రసంగించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే భీమడోలు, చేబ్రోలు, ఉంగుటూరు రైల్వే లైన్‌లపై ఫ్లయ్‌ఓవర్లు నిర్మిస్తామని ప్రకటించారు. లోకేశ్ వెంట జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజ నేయులు, మాజీ మంత్రులు పీతల సుజాత, జవహర్, జడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, మాజీ ఏంపీ మాగంటి బాబు, మాజీ ఎమ్మెల్సీ పాందువ్వ శ్రీను, జోన్–2 ఇన్‌చార్జ్ మందలపు రవి, పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జ్‌లు వలవల బాబ్జీ, బడేటి చంటి, పొత్తూరి రామరాజు పాల్గొన్నారు.
గ్రామాలకు గ్రామాలే నిర్వీర్యం..
జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో గ్రామాలు నిర్వీర్యం చేశారని, కోలుకోలేనంతగా దెబ్బతీశాడని, కేంద్రం విడుదల చేసిన 14, 15 ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చిన రూ.9 వేల కోట్లను జగన్ సర్కార్ దోపిడీ చేసిందని లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వం కారణంగా బ్లీచింగ్ పౌడర్‌కు నిధులు లేని దుస్థితి పంచాయతీలు ఎదుర్కొంటు న్నాయని నిడమర్రు ప్రజలతో భేటీ అయినప్పుడు లోకేశ్ ఆక్షేపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక నిడమర్రు పోలీస్టేషన్ నుంచి అడవికొలను రహ దారితో పాటు రాష్ట్రంలో పాడైపోయిన రోడ్లన్నింటిని నిర్మిస్తామని, అలాగే ఇళ్లు లేని పేదవాడికి పక్కా ఇళ్లు నిర్మిస్తామన్నారు.
ఇక్కడకు రావొద్దు.. పోలీసులపై ఫైర్
నిడమర్రు మండలం మందలపర్రులో ఆదివారం మధ్యాహ్నం వైసీపీ కార్యకర్తలు యువగళం యాత్రపై రాళ్ల దాడికి దిగారు. ఈ నేపఽథ్యంలో సాయంత్రం వేళ బువ్వనపల్లిలో లోకేశ్ బస చేసిన ప్రాంతానికి కొంత మంది పోలీసు అధికారులు వచ్చారు. మందలపర్రులో జరిగిన ఘటనకు సంబంధించి కొందరిని తమ వెంట తీసుకు వెళ్తామని పోలీసులు కోరగా అందుకు జిల్లా టీడీపీ నేతలంతా అభ్యంతరం వ్యక్తం చేశారు జడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు పోలీసులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలుగుదేశం కార్యకర్తలు ఆయనతో జత కలిశారు. లోకేశ్ బస చేస్తున్న ప్రాంతానికి మీరంతా ఎందుకు వచ్చారంటూ ఇది సరికాదని నచ్చ జెప్పేందుకు ప్రయత్నించారు.
ఉత్సాహంగా అడుగులు
పాదయాత్ర ఆసాంతం ఉత్సాహంగా సాగింది.వందల మందితో యువనేత లోకేశ్ సెల్ఫీలు దిగారు. ఎక్కడకక్కడ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. యాత్ర సాగుతున్న మార్గంలో గోతులు, గుంతలు కన్పిస్తుంటే.. జగన్ ఇదేనా ప్రగతి అంటూ సెల్ఫీతో లోకేశ్ సవాల్ విసిరారు. చిననిండ్ర కొలనులో మహిళలు, పిల్లలు రోడ్లు వెంబడి బారులు తీరగా పిల్లలందరికీ చాక్లెట్‌లు పంచుతూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. చిననిండ్రకులను నుంచి మార్గమధ్యలో ఉన్న ఆక్వా చెరువుల దగ్గరకు వెళ్లి ఆక్వా వాస్తవ పరిస్థితులను ఆక్కడున్న వారితో మాట్లాడి ఆరా తీశారు. ఇప్పుడున్న సమస్య తీరాలంటే ఏం చేయాలని ప్రశ్నించినప్పుడు.. విద్యుత్ చార్జీలు తగ్గించి, సీడు, ఫీడు నాణ్యత కల్గినవి సర ఫరా చేస్తే చాలని రైతులు సమాధానం ఇచ్చారు. ‘లోకేశ్ బాబు ఇది చేసిపట్టు చాలు, నీకు వందల కుటుంబాలు రుణ పడి ఉంటాయి. ఇప్పటికే కోలుకోలేని దెబ్బతిన్నాం. 15 ఏళ్లుగా చేపల సాగు చేస్తున్న మేము ఈ రంగంలో పడని తిప్పలు లేవంటూ ఇక ముందు ఆ కష్టాలు తీర్చండయ్యా’ అంటూ రైతు అప్పారావు లోకేశ్‌కు ఏకరువు పెట్టాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రంగాన్ని ఆదుకుని తీరుతానని స్పష్టం చేశారు.
204వ రోజు : టు డే టూర్ షెడ్యూల్
ఉ.8.00 కోలమూరు నుంచి ప్రారంభం
ఉ.8.30 కోలమూరు సెంటర్‌లో స్థానికులతో సమావేశం
ఉ.9.15 పాములపర్రులో, ఉ.11:00 ఉండి సెంటర్‌లో, ఉ.11:30 అంబేడ్కర్ విగ్రహం వద్ద స్థానికులతో మాటామంతీ
మ.12.00 ఉండి కోట్ల ఫంక్షన్ హాలు వద్ద భోజన విరామం
సా.3.00 ఆక్వా రైతులతో ముఖాముఖి
సా.4.00 పాదయాత్ర కొనసాగింపు
సా.5.30 భీమవరం నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశం
సా.6.00 భీమవరం శ్రీరామ ఆటో మొబైల్స్ వద్ద విడిది కేంద్రంలో రాత్రి బస