జోరుగా పొరుగు మద్యం

ABN , First Publish Date - 2023-09-22T00:21:26+05:30 IST

జిల్లాలో అక్రమ మద్యం ప్రవహిస్తోంది. పొరుగు రాష్ర్టాల నుంచి దిగుమతి అవుతోంది. బ్రాండెడ్‌ రకాలు దిగుమతి అవుతుండడంతో మద్యం ప్రియులు అటువైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలోని ఆర్థికంగా బలోపేతమైన ఓ పట్టణంలో ప్రతిరోజు రూ. 5 లక్షల విలువైన అక్రమ మద్యం అమ్మకాలు జరుగుతున్నట్టు అంచనా. అక్కడ ప్రభుత్వ మద్యం షాపులు లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాయి.

జోరుగా పొరుగు మద్యం

పక్క రాష్ర్టాల నుంచి దిగుమతి..

పడిపోతున్న ప్రభుత్వ అమ్మకాలు

లక్ష్యం పెంచాలంటూ ఎక్పైజ్‌పై ఒత్తిడి

బెంబేలెత్తుతున్న బార్‌ యజమానులు

నాసిరకం మద్యంతో విముఖత

ఇతర ప్రాంతాల నుంచి బ్రాండెడ్‌ మందు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

జిల్లాలో అక్రమ మద్యం ప్రవహిస్తోంది. పొరుగు రాష్ర్టాల నుంచి దిగుమతి అవుతోంది. బ్రాండెడ్‌ రకాలు దిగుమతి అవుతుండడంతో మద్యం ప్రియులు అటువైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలోని ఆర్థికంగా బలోపేతమైన ఓ పట్టణంలో ప్రతిరోజు రూ. 5 లక్షల విలువైన అక్రమ మద్యం అమ్మకాలు జరుగుతున్నట్టు అంచనా. అక్కడ ప్రభుత్వ మద్యం షాపులు లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాయి. అక్రమ మద్యాన్ని అరికట్టలేక పోతున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తనిఖీల్లో పట్టుబడితే లక్షల రూపాయల విలువైన అక్రమ మద్యం స్వాధీనం చేసుకుంటు న్నారు. అయినా తెలంగాణ రాష్ట్రం నుంచి యథేచ్ఛగా మద్యం తరలి వస్తోంది. నాణ్యమైన మద్యం కావడంతో దానికోసం మందుబాబులు ఎగబడుతున్నారు. మరోవైపు అక్కడ ధరలు తక్కువగా ఉంటున్నాయి. ప్రభుత్వ షాపుల్లో ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. అదే ధరకు బ్రాండెడ్‌ రకాలు దొరుకుతున్నాయి. అక్రమ మద్యానికి ఇదే ఊత మిస్తోంది. దాంతో జిల్లాలో లక్ష్యాన్ని చేరుకోలేక చతికిల పడుతున్నారు. జిల్లాకు ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకోవాలంటే రూ.2.40 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగాలి. ప్రస్తుతం ప్రతిరోజు రూ.2.10 కోట్లకు చేరుకోవడం కష్టతరమ వుతోంది. ఇప్పటిదాకా ఆక్వా ప్రభావం వల్లే అమ్మకాలు తగ్గిపోయా యని అధికారులు సమర్థించు కుంటూ వస్తున్నారు.ఆక్వా ఉత్పత్తులు పడిపోవడం,సాగు తగ్గిపోవడం వంటి కారణాలు మద్యం అమ్మకాలపై ప్రభావం చూపాయని ఉన్నతాధి కారులకు నివేదికలు ఇస్తూ వచ్చారు. నిజానికి జిల్లాలో ఆక్వా రంగం దెబ్బతింది. ఉత్పత్తులు పడిపోయాయి. దాని ప్రభావంతోనే అమ్మకాలు తగ్గిపోయాయదానిపైనే ఇప్పుడు ఉన్న తాధికారులు దృష్టి పెట్టారు. ఇటీవల ఎక్సైజ్‌ శాఖకు జిల్లాలో కొత్త అధికారి బాధ్యతలు చేపట్టారు. ఆయన దృష్టికి అక్రమ మద్యం విషయం వెళ్లినట్టు తెలుస్తోంది. అమ్మకాలు పడిపోవడానికి కారణాలు వెతక్కుండా అక్రమ మద్యంపైనా దృష్టి సారించాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

దొంగలు పడ్డారు..

ప్రభుత్వం అధిక ధరలకు మద్యం విక్రయిస్తోంది. అదికూడా అన్‌ బ్రాండెడ్‌ రకాలు సరఫరా చేస్తోంది. నాణ్యమైన మద్యం లభ్యం కావడం లేదు. ప్రభుత్వ మద్యం సేవించి అనారోగ్యం పాలువుతున్నారన్న అపవాదు ఉంది. మరోవైపు బార్‌లకు కొన్ని రకాల బ్రాండెడ్‌ రకాలను సరఫరా చేస్తున్నారు. అయితే అక్కడ మద్యం షాపులకంటే అధిక ధరలకు అమ్మకాలు సాగిస్తున్నారు. ఎంఆర్‌పీ కంటే అధికంగా విక్రయించుకునే వెసులుబాటు బార్‌లకు ఉంది. ధరలు అధికం వల్ల బార్‌లలోనూ ఆశించిన స్థాయిలో అమ్మకాలు సాగడం లేదు. జిల్లాలోని అత్యధిక బార్‌లు నస్టాల్లో నడుస్తున్నాయి. అన్నింటికీ పొరుగు రాష్ర్టాల నుంచి వస్తున్న అక్రమ మద్యమే కారణమంటూ అంతా గగ్గోలు పెడుతున్నారు. పండుగ సీజన్‌లోనూ ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగలేదు. అప్పట్లో హర్యాణా నుంచి మద్యం దిగుమతి అయ్యింది. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల కనుసన్నల్లో అమ్మకాలు నిర్వహించారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ధరలు పెరగడం వల్ల ప్రభుత్వ మద్యం షాపుల్లో దొంగలు పడుతున్నారు. మద్యం బాటిళ్లను ఎత్తుకుపోతున్నారు. జిల్లాలో ఇలా ఆరు మద్యం షాపుల్లో దొంగలు పడినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే దీనిపై పోలీసు యంత్రాంగం కూడా కేసులు నమోదు చేయలేని పరిస్థితి నెలకొంది. ధరలు పెరిగిపోవడం వల్లే దొంగతనాలకు ఊతమిస్తోంది.

రోజుకో రకం

ప్రభుత్వ మద్యం షాపుల్లో ఏ రోజు ఏ బ్రాండ్‌ అందుబాటులో ఉంటుందో తెలియని పరిస్థితి. ఒకటి రెండు రకాల మాత్రమే కాస్త నాణ్యతతో ఉంటున్నాయి. అదికూడా పంపిణీ అయిన గంటల వ్యవధిలోనే అమ్ముడు పోతున్నాయి. తర్వాత నాసిరకం మద్యమే దిక్కవుతోంది బ్రాండెడ్‌ రకాల కోసమని ప్రభుత్వం ప్రత్యేకంగా స్టాల్స్‌ ఏర్పాటు చేసింది. అయితే ఇతర రాష్ర్టాల్లో లభ్యమైన బ్రాండ్‌లు ఇక్కడ ఉండడం లేదు. అదే ఇప్పుడు జిల్లాలో అమ్మకాలు తగ్గుదలకు కారణమవుతోంది. దీనిని అరికట్టేందుకు అవకాశం లేకుండా పోతోంది. సారా అమ్మకాలను అడ్డుకున్నారు.అక్రమ మద్యాన్ని మాత్రం అరికట్టలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారు.

Updated Date - 2023-09-22T00:21:26+05:30 IST