చట్ట సభలలో సీట్ల కోసం

ABN , First Publish Date - 2023-09-23T00:34:37+05:30 IST

దివంగత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చలవతో ఇప్పటికే స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్‌ స్థానిక సంస్థల ఎన్నికలలో మహిళలకు అమలులో ఉండడంతో గ్రామస్థాయి నుంచి వారు రాజకీయాల్లో జెండా ఎగరేస్తున్నారు.

చట్ట సభలలో సీట్ల కోసం

పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు

70 ఏళ్లుగా ఒకటి, రెండు సీట్లే అవకాశం

చట్టం అమలైతే ఉమ్మడి పశ్చిమలో 5 అసెంబ్లీ సీట్లు, ఒక పార్లమెంట్‌ సీటు కేటాయించాల్సిందే

బిల్లు ఆమోదించిన ప్రధానికి మహిళల కృతజ్ఞతలు

భీమవరం, సెప్టెంబరు 22 : దివంగత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చలవతో ఇప్పటికే స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్‌ స్థానిక సంస్థల ఎన్నికలలో మహిళలకు అమలులో ఉండడంతో గ్రామస్థాయి నుంచి వారు రాజకీయాల్లో జెండా ఎగరేస్తున్నారు. సర్పంచ్‌, ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్పీటీసీ వంటి పదవుల్లో సగం వాటా పొందుతున్నారు. ఎన్టీ రామారావు మహిళలకు ఆస్తి వాటాతో పాటు పదవుల్లో కూడా రిజర్వేషన్‌ ఇవ్వడంతో మహిళలు విజయపథంలో నడుస్తున్నారు. ఎన్టీఆర్‌ సంస్కరణల వల్ల మహిళలకు అవకాశాలు ఇప్పటికీ మెరుగ్గా ఉన్నాయి. అయితే చట్టాలు చేసే అసెంబ్లీ, పార్లమెంటులలో సముచిత స్థానం లేదనేది నిర్వివాదాంశం. తాజా సవరణ వల్ల రాబోయే రోజుల్లో మహిళలు చట్టసభల్లో కొలువుదీరను న్నారు. తాజా లెక్కల ప్రకారం చూస్తే 15 అసెంబ్లీ సీట్లతో ఉన్న ఉమ్మడి పశ్చి మ జిల్లాలో 5 అసెంబ్లీ సీట్లు మహిళలకు దక్కే అవకాశాలు ఉన్నాయి. నరసా పురం, ఏలూరు, రాజమహేంద్రవరం పార్లమెంటుల్లో ఒక సీటు దక్కనుంది.

చరిత్రలోకి వెళితే..

పశ్చిమ గోదావరి జిల్లాలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి అసెంబ్లీలో నారీ ప్రవేశం పరిశీలిస్తే.. ఒకరు ఇద్దరితోనే కొనసాగుతూ వచ్చింది. తొలిసారిగా 1946లో ఉమ్మడి మద్రాసు అసెంబ్లీకి భీమవరం నుంచి స్వాతంత్య్ర సమరయోధుడు భూపతిరాజు సుబ్బతాతరాజు సతీమణి భూపతిరాజు బంగారమ్మ ఎన్నికయారు. అదేసమయంలో ఏలూరు నుంచి కూడా మహిళా ప్రతినిధి ఎన్నికయ్యారు. స్వాతంత్రం వచ్చిన తరువాత 1952లో తొలిసారిగా ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ప్రాతినిధ్యం కనిపించ లేదు. ఏలూరు నుంచి పార్లమెంటుకు సీపీఐ తరఫున కమల కుమారి విజయం సాధించారు. ఇక తదుపరి 16 అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో మహిళల ప్రాతినిధ్యం అంతంత మాత్రమే.

నియోజకవర్గాల వారీగా చూస్తే..

పాత ఉమ్మడి జిల్లా పరిధిలో లెక్కిస్తే తణుకు, పోలవరం అసెంబ్లీలు మినహాయిస్తే మిగిలిన అసెంబ్లీలో ఒక్కొక్కసారైనా మహిళలు పోటీ చేశారు.

కొవ్వూరు అసెంబ్లీకి తొలిసారిగా పోటీపడిన మహిళగా తానేటి వనిత రికార్డుకు ఎక్కారు. 2014లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి చెంది 2019లో విజయం సాధించి మంత్రి అయ్యారు. టీడీపీ తరఫున వంగలపూడి అనిత పోటీ చేశారు.

అత్తిలి అసెంబ్లీ నుంచి 1959లో తొలిసారిగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా చోడగం అమ్మన రాజా పోటీలో గెలుపొందారు.

ఆచంట నియోజకవర్గం నుంచి 1985లో కమిడి అంబుజ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఇదే నియోజకవర్గంలో 1999లో టీడీపీ అభ్యర్థిగా మోచెర్ల జోహార్‌ గెలిచారు. 2004లో పీతల సుజాత టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు.

పెనుగొండ నియోజకవర్గంలో టీడీపీ ప్రారంభమైన 1983, 1985ల్లో వరుసగా ప్రత్తి మణెమ్మ విజయం సాధించి ఎన్టీ రామారావు మంత్రివర్గంలో చోటు సంపాదించారు.

పాలకొల్లు నియోజకవర్గంలో ఒకే ఒక్కరు బంగారు ఉషారాణి 2009లో ప్రజారాజ్యం పార్టీ అధినేత మెగాస్టార్‌ చిరంజీవి పై పోటీ చేసి గెలిచారు.

నరసాపురంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ అత్త అయిన పరకాల కాళికాంబ 1981లో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచారు. 1983లో ఓటమి చెందారు.

తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎక్కువసార్లు మహిళలు పోటీ చేసిన చరిత్ర నమోదైంది. 1972లో కోసూరి కనకలక్ష్మి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 1983లో ఈలి వరలక్ష్మి గెలవగా మళ్లీ 1985లో ఓటమి చెందారు. 1987లో ఉప ఎన్నికల్లో వరలక్ష్మి పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచారు. 1989లో మళ్లీ ఓటమి చెందారు.

భీమవరం అసెంబ్లీలో ఒకే ఒక్కరు పోటీపడ్డారు. 1994 ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా భూపతిరాజు విజయకుమార్‌రాజు సతీమణి కాంతా కమలకస్తూరి పోటీ చేసి ఓటమి చెందారు.

ఉండి నియోజకవర్గంలో స్వత్రంత అభ్యర్థిగా గెలిచిన ఘనత కట్రేడ్డి ఆండాలమ్మకు దక్కుతుంది. 1970 ఉపఎన్నికల్లో కూడా విజయం సాధించారు.

ఉంగుటూరు నియోజకవర్గంలో తొలిసారి ఇమ్మణ్ణి రాజేశ్వరి 2004లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో గన్ని లక్ష్మీకాంతం పోటీ చేసి ఓటమి చెందారు.

దెందులూరు నియోజకవర్గంలో తొలిసారి కాంగ్రెస్‌ అభ్యర్థిగా 1985లో మేరీపాల్‌ పద్మావతి పోటీ పడి ఓటమి చెందగా.. 1991లో మాగంటి వరలక్ష్మి విజయం సాధించి మంత్రి అయ్యారు.

ఏలూరు అసెంబ్లీ నుంచి 1994లో మాగంటి వరలక్ష్మి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు.

గోపాలపురం అసెంబ్లీ చరిత్రలో మాత్రం అనేక మంది మహిళలు పోటీపడి గెలిచారు. 1972లో దాసరి సరోజిని కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచారు. తిరిగి ఈమె 1983లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 1985 ఎన్నికల్లో నంబూరు ఝాన్సీ కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఓటమి చెందారు. 1999 ఎన్నికల్లో మద్దాల సునీత ఓటమి చెందారు. ఈమె 2004లో మళ్లీ పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచారు. తానేటి వనిత తొలిసారిగా ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆమెపై పోటీ చేసిన తిరిగిపల్లి ఉష ఓటమి చెందారు.

చింతలపూడి నియోజకవర్గంలో తొలిసారి మందలపు జమునారాణి 1999లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయా రు. 2014లో పీతల సుజాత టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.. ఆమెపై బార్ల దేవి ప్రియ ఓటమి చెందారు.

మూడు దశాబ్దాల కల సాకారం

మూడు దశాబ్దాల కల సాకారమవుతోంది. జనగణన, నియోజకవర్గాల డీ లిమిటేషన్‌ ప్రమేయం లేకుండా తక్షణమే అమలు చేయాలి. లోకసభ, శాసనసభలే కాకుండా అన్ని చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేసినప్పుడే న్యాయం చేసినట్టవుతుంది. ఎన్నికల లబ్ది కోసం కాకుండా మహిళా సాధి కారత, మహిళల హక్కుల కోసం కృషి చేసినందుకు ప్రధాని మోదీకి అభినందనలు.

– డాక్టర్‌ ఆరేటి రాణి, డిస్ట్రిక్ట్‌ సెక్రటరీ, ఇన్నరవీల్‌

రిటైర్డ్‌. ప్రిన్సిపాల్‌, కేజీఆర్‌ ఎల్‌ కాలేజీ, భీమవరం

ఎన్టీఆర్‌ హయాంలోనే ప్రాధాన్యం

ఇంత కాలానికి మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్‌ ఇవ్వడం అభినందనీయం. ఇప్పటికే స్థానిక సంస్థలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించడానికి ఆనాడే మహానుభావుడు ఎన్టీ రామారావు శ్రీకారం చుట్టారు. ఈసారి రాష్ట్ర కేంద్ర చట్టసభల్లో మహిళా సమస్యలకు మెరుగైన ప్రాతినిధ్యం లభించే అవకాశం వచ్చింది.

– మాదాసు కనకదుర్గ, భీమవరం

Updated Date - 2023-09-23T00:34:37+05:30 IST