Share News

కిరోసిన్‌ పోసి నిప్పు పెట్టారు

ABN , First Publish Date - 2023-12-04T00:23:44+05:30 IST

ఏజెన్సీ ప్రాంతంలో జీవిస్తున్నప్పటికి పిల్లలు బాగా చదవాలనే కోరికతో కూలీ పని చేస్తున్నారు. ఆరోజు యఽథావిధిగా ఆ దంపతులు కూలి పనికి వెళ్లారు. ఇంటివద్ద వున్న కుమార్తెపై గుర్తు తెలియని ఆగంతుకులు కిరోసిన్‌ పోసి నిప్పంటించారని బాధితురాలు చెబుతోంది.

కిరోసిన్‌ పోసి నిప్పు పెట్టారు
లావణ్

తీవ్ర గాయాలు.. విజయవాడకు తరలింపు

బాధితురాలి వాంగ్మూలం..

గుళ్లవాయిలో ఘటన

ఏలూరు క్రైం/వేలేరుపాడు, డిసెంబరు 3 : గ్రామీణ ప్రాంతంలో వారు వ్యవసాయ కూలీలుగా జీవిస్తున్నారు. తమ ఇద్దరు పిల్లలను కష్టపడి చదివిస్తున్నారు. వారి కాళ్లపై వారు నిలబడాలని, వారు పడుతున్న కష్టాలు వారికి రాకూడదని చదివిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో జీవిస్తున్నప్పటికి పిల్లలు బాగా చదవాలనే కోరికతో కూలీ పని చేస్తున్నారు. ఆరోజు యఽథావిధిగా ఆ దంపతులు కూలి పనికి వెళ్లారు. ఇంటివద్ద వున్న కుమార్తెపై గుర్తు తెలియని ఆగంతుకులు కిరోసిన్‌ పోసి నిప్పంటించారని బాధితురాలు చెబుతోంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఏలూరు ప్రభుత్వాసుత్రికి, మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు.

వేలేరుపాడు మండలం గుళ్లవాయి గ్రామానికి చెందిన బేతి సుధాకర్‌, సుజాత దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమారుడైన సాయి ఆశ్వారావుపేటలో ఇంటర్‌ చదువుతున్నాడు. కుమార్తె లావణ్య (16) వేలేరుపాడు హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతోంది. ఆదివారం ఉదయం తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లగా ఇంటివద్ద లావణ్య ఒంటరిగా ఉంది. మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని ఇద్దరు ఆగంతుకులు మాస్క్‌లు ధరించి వచ్చి ఇంటిలోని కిరోసిన్‌ ఆమెపైనే పోసి నిప్పంటించారు. మంటల్లో చిక్కుకున్న ఆమె కేకలు వేయడంతో పక్కనే వున్న ఆమె వదిన ఉషారాణి వచ్చి ఇరుగుపొరుగు సహకారంతో మంటలను ఆర్పారు. అప్పటికే లావణ్య 95 శాతం కాలిపోయింది. ఆమెను వేలేరుపాడు ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. ఎస్పీ మేరీప్రశాంతి ఆస్పత్రికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. అత్యవసర విభాగాపు వైద్యులు జ్యోతి, సర్జన్‌ అనూషలు బాధితురాలికి వైద్యసేవలు అందించారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉందని విజయవాడకు రిఫర్‌ చేశారు. బాధితురాలి నుంచి మేజిస్ట్రేట్‌ వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కిరోసిన్‌ పోసి నిప్పంటించినట్టు బాధితురాలు చెప్పింది. రాత్రి 7 గంటల ప్రాంతంలో 108లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు ఎమ్మెల్సీగా కేసు నమోదు చేసి పోలీసులకు సమాచారం అందించారు. టుటౌన్‌ సీఐ ఎం.ప్రభాకర్‌, ఎస్‌ఐ సాధిక్‌, ఎస్‌బీ సీఐ బోణం ఆదిప్రసాద్‌, నిఘా విభాగపు అధికారులు ఆస్పత్రికి చేరుకుని అన్ని కోణాలు వివరాలు సేకరించారు. మరోవైపు ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వేలేరుపాడు ఎస్‌ఐ లక్ష్మీనారాయణ తెలిపారు. ‘బాధితురాలు మైనర్‌ కావడంతో వెంటనే వచ్చి వివరాలు సేకరించడానికి ప్రయత్నించాం. ఆమె వివరాలు చెప్పే పరిస్థితిలో లేదు. ఆమె తల్లితో మాట్లాడాం. ఆమె ఏమీ చెప్పలేకపోయారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి ఒకట్రెండు రోజుల్లోనే కేసు పరిష్కరిస్తాం..’ అని ఎస్పీ డి.మేరీప్రశాంతి చెప్పారు.

Updated Date - 2023-12-04T00:23:45+05:30 IST