జగనన్న ఇళ్లల్లో కాపురాలు ఎప్పుడు ?
ABN , First Publish Date - 2023-08-02T00:05:58+05:30 IST
సంక్రాంతికి ఇళ్లు అప్పగిస్తామన్నారు.. ఉగాదికి కొత్త కాపురాలు పెట్టిస్తామన్నారు.. మళ్లీ దసరా అన్నారు.. క్యాలెండర్‌లో పేజీలు వెళ్లిపో తున్నాయి.. తప్ప గృహ నిర్మాణ పనులు మాత్రం ఇంకా సాగుతూనే ఉన్నాయి..
మూడేళ్లుగా సాగుతున్న నిర్మాణాలు
భీమవరంలో 50 శాతం లక్ష్యానికి దూరం
వెంటాడుతున్న మౌలిక వసతుల సమస్యలు
భీమవరం, ఆగస్టు 1 : సంక్రాంతికి ఇళ్లు అప్పగిస్తామన్నారు.. ఉగాదికి కొత్త కాపురాలు పెట్టిస్తామన్నారు.. మళ్లీ దసరా అన్నారు.. క్యాలెండర్‌లో పేజీలు వెళ్లిపో తున్నాయి.. తప్ప గృహ నిర్మాణ పనులు మాత్రం ఇంకా సాగుతూనే ఉన్నాయి.. జిల్లాలో జగనన్న కాలనీ నిర్మాణం మూడేళ్లలో 50 శాతం కూడా పూర్తి చేయలేక పోయారు. జిల్లా మొత్తం 71,283 గృహ నిర్మాణాలు చేపట్టాలి. ఇందులో 23,961 నిర్మాణాలను పూర్తి చేశారు. 11,778 గృహాలు బేస్మెంట్, ఆపైన వివిధ దశల్లో సాగుతున్నాయి. ఆలస్యంగా ప్రారంభమైన భీమవరం జగనన్న కాలనీలో 75 ఎకరాల్లో పూడికే లేదు. భీమవరం ప్రాంతానికి చెందిన లబ్ధిదారులకు ఉండి నియోజకవర్గం పరిధిలోకి వచ్చే భీమవరం మున్సిపల్ మంచినీటి సరఫరా చెరువుల పక్కనే 168 ఎకరాల్లో లే –ఔట్ సిద్ధం చేశారు.. అయితే ఇక్కడ పనులు ప్రారంభం కాలేదు. 2021లో కొన్ని పనులు ప్రారంభించినప్పటికీ అవి మొక్కు బడిగానే చేపట్టారు..తరువాత భీమవరం చెందిన ప్రముఖ కాంట్రాక్టర్‌కు గతేడాది డిసెంబర్లో ఈ పనులు అప్పగించారు. ఇక్కడ ఆలస్యంగా పనులు ప్రారంభిం చడంతో లబ్ధిదారులకు ఇళ్లు ఎప్పుడు అందిస్తారో అనేది తెలియదు. మరోవైపు భీమవరం పట్టణ శివారు యనమదుర్రు రోడ్‌లో మూడేళ్లు కిందట కొనుగోలు చేసిన 73 ఎకరాల జగనన్న లేఅవుట్‌లో పూడిక పనులు చేపట్టలేదు.. మట్టి కొరత సమస్య వేధిస్తోంది..ఇక్కడ ఎప్పటికీ పూర్తవుతాయో ఎవరూ చెప్పలేరు.