అవే హామీలు
ABN , Publish Date - Dec 30 , 2023 | 12:47 AM
సీఎం వైఎస్ జగన్ భీమవరం సభలో ఎప్పటి లాగే వరాలు గుప్పించారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చెప్పిన ప్రతీ సమస్య పరిష్కారానికి నిధులు కేటాయిస్తాను. యనమదుర్రుపై నిర్మించిన అప్రోచ్‌ల ఏర్పాటుకు రూ.39 కోట్లు, గొంతేరు వంతె నకు రూ.12 కోట్లు, పుట్‌పాత్ బ్రిడ్జికి రూ.5 కోట్లు, భీమవరం నుంచి నరసాపు రం వెళ్ళేందుకు తొక్కొడు మురుగుకాల్వపై వంతెన నిర్మాణానికి నిధులు కేటాయిస్తాని సభా ముఖంగా హామీ ఇచ్చారు.
భీమవరం సభలో సీఎం జగన్ పునరుద్ఘాటన
ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అడిగిన వెంటనే ఓకే చెప్పిన సీఎం
నిధులు విడుదలై.. పనులు మొదలయ్యే వరకు అనుమానమే
విద్యా దీవెన బహిరంగ సభకు భారీగా జన సమీకరణ..
సభ ప్రారంభం కాగానే వెనుదిరిగిన జనం
గ్యాలరీల్లో ఐదు గంటలపాటు నరకం.. వెళ్లేవారి అడ్డగింత
విద్యా దీవెన పథకం నిధులు విడుదల సభలో పాట్లు
భీమవరం–ఆంధ్రజ్యోతి: భీమవరం/ టౌన్/రూరల్, డిసెంబరు 29 : సీఎం వైఎస్ జగన్ భీమవరం సభలో ఎప్పటి లాగే వరాలు గుప్పించారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చెప్పిన ప్రతీ సమస్య పరిష్కారానికి నిధులు కేటాయిస్తాను. యనమదుర్రుపై నిర్మించిన అప్రోచ్‌ల ఏర్పాటుకు రూ.39 కోట్లు, గొంతేరు వంతె నకు రూ.12 కోట్లు, పుట్‌పాత్ బ్రిడ్జికి రూ.5 కోట్లు, భీమవరం నుంచి నరసాపు రం వెళ్ళేందుకు తొక్కొడు మురుగుకాల్వపై వంతెన నిర్మాణానికి నిధులు కేటాయిస్తాని సభా ముఖంగా హామీ ఇచ్చారు. అయితే సీఎం ఇచ్చిన హామీలపై ప్రజలు అనుమా నాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నేతగా భీమవరం విచ్చేసిన పుడు జగన్ అనేక హామీలు ఇచ్చారు. అందులో యనమ దుర్రు వంతెనలకు అప్రోచ్‌లు ఉన్నాయి. వాటిని అధికారం లోకి వచ్చిన నాలుగున్నరేళ్లుగా అమలు చేయలేదు. గత ఏడాది నవంబరులో నరసాపురం వచ్చినపుడు సీఎం మూడు వేల 600 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇప్పటికి ఆ పనులు ప్రారంభం కాలేదు. ప్రభుత్వం నుంచి పాలనా అనుమతులు మంజూరు చేయలేదు. టెండర్లు పిలవలేదు. భీమవరం నియోజకవర్గంలో అప్రోచ్‌ల రహదారు లు, వంతెనల నిర్మాణాలకు నిధుల విడుదలకు ఇచ్చిన హామీపై ప్రజలకు నమ్మకం కలగడం లేదు. కొద్ది రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఆ తర్వాత టెండర్లు పిలిచే అవకాశం ఉండదు. పిలిచినా ఎన్నికల ముందు పను లు జరుగుతున్నాయన్న ఆశ లేదు. సీఎం జగన్ అమలు కాని హామిలు ఇచ్చారంటూ నియోజకవర్గ ప్రజలు, ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శిస్తున్నారు.
రియల్ హీరో గ్రంఽధి
గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌ను భీమవరం ప్రజలు తిరస్కరించారు. మళ్లీ ఇక్కడికే వస్తానంటున్నారు. ఆయన సినిమా హీరో, మా శ్రీనన్న రియల్ హీరో అంటూ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ను సీఎం జగన్ ఆకాశానికి ఎత్తారు. పరోక్షంగా గ్రంధి పోటీలో ఉంటారంటూ సంకేతాలు ఇచ్చారు. మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు, కొత్తగా ఏర్పాటైన పశ్చిమ గోదావరి జిల్లాకు భీమవరం జిల్లా కేంద్రంగా చేయాలంటూ శ్రీనన్న అడిగారు. అటువంటి రియల్ హీరో అంటూ ఎమ్మెల్యేను పొగడ్తలతో ముంచెత్తారు.
జగన్‌కు ఘన స్వాగతం
భీమవరం వచ్చిన జగన్‌కు హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం లభించింది. 10:40 గంటలకు చేరుకున్న ఆయనకు ప్రజాప్రతినిధులు, అధికారులు పూల బొకేలు అందించారు. వారితో జగన్ 20 నిమిషాలపాటు మాట్లాడారు. మంత్రులు కొట్టు సత్యనారాయణ, మేరుగ నాగార్జున, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, తానేటి వనిత, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, కలెక్టర్ పి.ప్రశాంతి, ఎమ్మెల్యేలు ముదునూరి ప్రసాదరాజు, గ్రంధి శ్రీనివాస్, పుప్పాల వాసుబాబు, అబ్బయ్య చౌదరి, తలారి వెంకట్రావు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎస్పీ రవిప్రకాశ్, జేసీ ఎస్.రామసుందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. తర్వాత బస్సులో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సభ ముగిసిన అనంతరం హెలిప్యాడ్ ప్రాంతానికి రెండు గంటల పది నిమిషాలకు చేరుకుని అక్కడ అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్యం నిమిత్తం లక్ష రూపాయల చొప్పున అప్రూవల్ చేశారు. అయితే వీరికి చెక్కులను కలెక్టర్ అందజేశారు. పలువురితో కరచాలనం, ఫొటోలు దిగారు. 4 గంటల ఐదు నిమిషాలకు హెలిప్యాడ్ నుంచి హెలికాఫ్టర్ మీద బయలుదేరి వెళ్ళిపోయారు. జడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఆరంభానికి ముందే జనం బయటకు..
సీఎం పర్యటనలో జనం ఇబ్బందులకు గురయ్యారు. విద్యా దీవెన పథకం నిధులు విడుదలకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రాకుండానే జనం వెనుదిరిగారు. షెడ్యూల్ ప్రకా రం సీఎం 10.40 హెలిప్యాడ్‌కు చేరుకుని, మరో 20 నిమిషాల కు సభావేదికకు వచ్చారు. అప్పటికే రెండు గంటల ముందే సభావేదిక ముందు కుర్చీలు నిండిపోయాయి. తదుపరి వచ్చి న వారికి అవకాశం లేకపోయింది. దీంతో వెళ్లిన వాహనాలు ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ నుంచి వెనుదిరగడం మొదలైంది. సీఎం ప్రసంగం మొదలైన అర గంటకే జన ప్రవాహం కదిలింది. చాలా వాహనాలు మార్కెట్ కమిటీ వైపు, బైపాస్‌లోను తణుకు రోడ్డులోను నిలి పారు. అక్కడి నుంచి నడిచి వెళ్లిపోయారు. దూరప్రాంతాల నుంచి ఏలూరు, తణుకు డిపోల నుంచి అధిక సంఖ్యలో 12.40 సమయానికి రావటం కనిపించింది. వచ్చే వాహనాలు వస్తుంటే, వెళ్ళే వాహనాలు వెళ్లిపోయాయి. మహిళలు పెద్ద సంఖ్యలో ప్రారంభంలో వెళ్లిపోయారు. ఒంటి గంట సమయంలో బైపాస్ నుంచి వెళ్లారు.
బాక్సుల్లో పెట్టి బంధించారు
సీఎం 11 గంటలకు సభలోకి వచ్చారు. అప్పటికే రెండు గంటలకుపైగా కూర్చున్న జనంలో అసహనం మొదలైంది. సీఎం సభ 1.35 గంటలకు ముగిసింది. సుమారు 5 గంటలపాటు కూర్చున్న మహిళలు, యువకుల లఘశంక ప్రయత్నాలను పోలీసులు, వలంటీర్లు అడ్డుకున్నారు. కొంద రు బయటకు వెళ్లే ప్రయత్నాలకు అవకాశం ఇవ్వకపోవడం తో అసహనం వ్యక్తం చేశారు. వారితో వాగ్వాదానికి దిగారు.
నల్లటి దుస్తులతో వచ్చిన అనేక మందిని పోలీసులు లోపలకు రానివ్వలేదు. దుస్తులు మార్చుకుని రండి.. అంటూ పోలీసులు వెనక్కు పంపించారు. అంబేడ్కర్ సెంటర్‌లో న్యాయవాదులు నల్ల కోటు ధరించి జగన్‌కు స్వాగతం పలకడానికి నిలబడినప్పుడు కొందరు పోలీసులు తెలియక నిరసన తెలిపేందుకు వచ్చారేమోనని అనుకుని భయపడి వారితో మాట్లాడారు. విషయం తెలుసుకుని వదిలారు.
జన సమీకరణ చేసినప్పటికీ వచ్చిన వారికి అల్పాహారం, మంచినీటి వసతి కల్పనలో నిర్వాహకులు విఫలమయ్యారు. సభలో పాల్గొనే వారికి మంచినీరు పూర్తిగా అందలేదు. వేలాది మంచినీటి ప్యాకెట్లను అందుబాటులో పెట్టినప్పటికీ అవి కూడా ఖర్చయ్యాయి. 12 గంటల సమయానికి ఎండ తీవ్రత పెరిగింది. దీంతో దాహం కోసం సొంత సొమ్ములతో వాటర్ బాటిల్స్ కొనుగోలు చేసుకున్నారు. మధ్యాహ్నం కొందరికి ఆహారం అందకపోవడంతో ఇబ్బంది పడ్డారు.
రియల్ హీరో నిజాలు తెలియవా ?
జగన్‌కు జనసేన జిల్లా అధ్యక్షుడు చినబాబు ప్రశ్న
భీమవరం, డిసెంబరు 29 : ‘భీమవరం ఎమ్మెల్యే శ్రీనన్న ఒక రియల్ హీరో.. పవన్ సినిమా హీరో మాత్రమే’ అంటూ ఎద్దేవా చేసిన సీఎం జగన్‌కు రియల్ హీరో(ఎమ్మెల్యే గ్రంఽధి) గురించి నిజా లు తెలియవా ?’ అని జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొటిక లపూడి గోవిందరావు(చినబాబు) ప్రశ్నించారు. భీమవరంలో సీఎం బహిరంగ సభలో పవన్ వ్యక్తిగత జీవితంపై సీఎం చేసిన విమర్శలను ఖండిస్తూ శుక్రవారం భీమవరం జనసేన పార్టీ కార్యాల యంలో విలేకరుల సమావేశంలో చినబాబు మాట్లాడారు. 2004 వైఎస్ భిక్షతో ఎమ్మెల్యే అయిన రియల్ హీరోకు, 2009లో ఎం దుకు సీటు దక్కలేదు. తనకు సీటు రాలేదని, సాక్షాత్తూ సీఎం దిష్టిబొమ్మను దహనం చేసిన విషయాన్ని జగన్ గ్రహించలేదా ? ఈయన అడిగిందే తడవుగా అమలు కానీ భారీ హామీలకు ఎన్నో నిధులు ఇస్తామంటూ సీఎం అలవాటులో పొరపాటుగా హామీ ఇచ్చేశారు. గతంలో సీఎం ఇచ్చిన హామీలకే దిక్కులేదు. నరసాపురంలో రూ.3,200 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. రెండు యూనివర్సిటీలకు చేపట్టిన పనులు ముందుకు సాగడం లేదు’ అని విమర్శించారు. పవన్‌పై వ్యక్తిగత విమర్శలు మానక పోతే తాము కూడా వారి వ్యక్తిగత విమర్శలతో బజారుకు ఈడుస్తామని ఆయన హెచ్చరించారు. బొమ్మిడి నాయకర్, వేగేశ్న కనకరాజుసూరి, జుత్తిగ నాగరాజు, పచ్చమట్ల ధర్మరాజు, వీరమహిళ బండారు శ్యామల తదితరులు పాల్గొన్నారు.