పంట కాల్వలు ఇలా..శివారుకు నీరెలా..?

ABN , First Publish Date - 2023-01-18T00:29:38+05:30 IST

చివరికి సాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. దాళ్వా సాగుకు సంబంధించి మెంటేపూడి – మత్స్యపురి పంటకాలువ నీరు అందించలేని దుస్థితికి చేరింది.

పంట కాల్వలు ఇలా..శివారుకు నీరెలా..?
మెంటేపూడి–మత్స్యపురి కాలువలో తూడు, ప్లాస్టిక్‌ వ్యర్థాలు..

మెంటేపూడి – మత్స్యపురి పంటకాలువ పరిస్థితి

నీరులేక నాట్లు పడని దుస్థితి

వీరవాసరం, జనవరి 17: చివరికి సాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. దాళ్వా సాగుకు సంబంధించి మెంటేపూడి – మత్స్యపురి పంటకాలువ నీరు అందించలేని దుస్థితికి చేరింది. దీంతో రైతులు సాగుపై ఆయోమయంలో పడ్డారు. నారు పెరిగి వరినాట్లుకు సిద్ధమైనా చేలల్లో దుక్కి చేయటానికి నీరు లేదని ఆవేదన చెందుతున్నారు. జనవరి మూడో వారంలోకి చేరినా ఇంకా వరినాట్లు పడని పరిస్థితి. వీరవాసరం పశ్చిమ కాలువ నుంచి బ్రాంచి కాలువగా ఉన్న మెంటేపూడి –మత్స్యపురి పంట కాలువలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు, తూడు పేరుకుపోయింది. గత నెలలో కాలువలో వ్యర్థాలను, తూడును రైతులే స్వయంగా తొలగించారు. తిరిగి యఽథాస్థితికి వచ్చింది. ఫలితంగా మత్స్యపురి ఆయకట్టులోని సుమారు 400 ఎకరాలకు నీరు అందక వరినాట్లు వేయలేని స్థితికి చేరింది. కాలువ ఎగువ భాగంలో అనధికార అడ్డుకట్టలు వేసి సాగునీరు దిగువకు చేరకుండా చేస్తున్నారని సమాచారం. మెంటేపూడి, మత్స్యపురి, మత్స్యపురి ఆయకట్టు భూములకు సాగునీరు అందించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుచున్నారు.

జీఅండ్‌వీ కెనాల్‌ ప్రక్షాళన చర్యలు చేపట్టండి

పరిశీలించిన శాసనమండలి చైౖర్మన్‌ మోషేన్‌రాజు

భీమవరం, జనవరి 17 : ప్రజలకు తాగు,సాగు అవసరాలకు ఉపయోగపడుతున్న జిఅండ్‌వీ కెనాల్‌ కాలుష్యాన్ని తొలగించ టానికి జలవనరులశాఖ చర్యలు చేపట్టాలని శాసన మండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు ఆదేశించారు. భీమవరం పట్టణ శివారున జిఅండ్‌వి కెనాల్‌ కాలువ పరిస్థితిని మంగళవారం ఆయన పరిశీలించారు. పేరుకుపోయిన ప్లాస్టిక్‌ వ్యర్థాలను చూశారు. విస్సాకోడేరు గ్రామం నుంచి యనమదుర్రు లాకు వరకు గల గ్రామాల చెత్త, ప్లాస్టిక్‌ వస్తువులతో నిండిపోయి నీరు మొత్తం కలుషితమైపోతుందని చెప్పారు. ఈ కెనాల్‌ నీటిని ప్రజలు వ్యవసాయదారుల అవసరాలకు వినియోగించు కుంటారని ఇప్పుడు ఉపయోగపడని పరిస్థితి ఏర్పడిందన్నారు. లోతట్టు గ్రామాల ప్రజలు, రైతులు తన దృష్టికి తీసుకు వచ్చారని జిఅండ్‌వీ కెనాల్‌ దుస్ధితిపై చర్యలు చేపట్టాలన్నారు. ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌తో మాట్లాడి కెనాల్‌ శుభ్రపరిచే కార్యక్రమం వెంటనే చేపట్టాలని ఆదేశించారు.

Updated Date - 2023-01-18T00:29:44+05:30 IST