బాలల రక్షణకు ప్రత్యేక చర్యలు: కలెక్టర్‌

ABN , First Publish Date - 2023-06-02T23:41:27+05:30 IST

బాలలు, కౌమార బాలికలను గుర్తించి ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.

బాలల రక్షణకు ప్రత్యేక చర్యలు: కలెక్టర్‌

నేటి నుంచి జిల్లాలో బాల కార్మికుల గుర్తింపునకు ప్రత్యేక డ్రైవ్‌

భీమవరం, జూన్‌ 2: బాలలు, కౌమార బాలికలను గుర్తించి ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో బాలల రక్షణకు సంబంధింత శాఖల కార్యాచరణ రూపొందించి తనిఖీలు నిర్వహించాలన్నారు. బాలలు, కౌమార కార్మికుల రక్షణ, పునరావాసంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. 14 ఏళ్ళలోపు చిన్నారులతో ఎవరైనా ఎక్కడైనా పనిచేయిస్తే చట్ట ప్రకారం శిక్షార్హులన్నారు. బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి వారు ఏదైనా పనిలో ఉన్నారా, ఇంటి వద్ద ఉన్నారా ఆరా తీయడంతో పాటు వారిని తిరిగి చదువుకునేందుకు ప్రోత్సహించాలన్నారు. జిల్లాలోని ఆరు టీమ్‌లతో నేటి నుంచి జూన్‌ నెలాఖరు వరకు బాల కార్మికుల గుర్తింపును ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టినట్లు కలెక్టర్‌ తెలిపారు. బాల కార్మికులచే పనులు చేయిస్తున్న యాజమాన్యాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా కార్మికశాఖ అధికారి ఎ.లక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులుగా పనిచేస్తున్నట్లుగా గుర్తిస్తే పిర్యాదు చేయాలని తెలిపారు. చివరగా బాల కార్మికుల నిర్మూలనపై అవగాహన గోడపత్రికని కలెక్టర్‌ ఆవిష్కరించారు.

నాడు – నేడు పనులపై అలక్ష్యం వద్దు

నాడు – నేడు పనులు పూర్తి చేయడంలో అలక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి అధికారులను హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నాడు–నేడు పనులు పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. నిధులు ఉన్నప్పటికీ నాడు – నేడు పనులు ముందుకు సాగకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 40 రోజుల్లో చేయాల్సిన పనులను పది రోజుల్లో ముగిస్తే నాణ్యత ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. తనిఖీలలో నాణ్యత లోపిస్తే చర్యలకు ఎట్టి పరిస్ధితుల్లో వెనకాడేది లేదన్నారు.

Updated Date - 2023-06-02T23:41:27+05:30 IST