రబీ గుబులు
ABN , First Publish Date - 2023-11-19T23:53:08+05:30 IST
రబీకి సాగుకు నీరు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గోదావరి డెల్టా పరిధిలో ప్రతి ఎకరా సాగు చేసుకునేలా అధికారులు ప్రణాళికలు రచించారు. నీటి లభ్యతపైనా అంచనాలు వేసుకున్నారు. గోదావరిలో 85 టీఎంసీల నీరు అందు బాటులో ఉంటేనే రబీ సాగు గట్టెక్కుతుంది.

నీటి లభ్యతపైనే అనుమానం
ప్రభుత్వానికి రూ. 15 కోట్లతో ప్రతిపాదనలు
మంజూరైనది రూ. 10 కోట్లే
వర్షాభావ పరిస్థితితో ఖరీప్‌కూ కటకట
రబీ గట్టెక్కేదెలా ?..అధికారుల్లో ఆందోళన
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
రబీకి సాగుకు నీరు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గోదావరి డెల్టా పరిధిలో ప్రతి ఎకరా సాగు చేసుకునేలా అధికారులు ప్రణాళికలు రచించారు. నీటి లభ్యతపైనా అంచనాలు వేసుకున్నారు. గోదావరిలో 85 టీఎంసీల నీరు అందు బాటులో ఉంటేనే రబీ సాగు గట్టెక్కుతుంది. అంతటి నీటి ప్రవాహం ఉంటుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితులతో గోదావరిలో నీటి ప్రవాహం అంతగా లేదు. ప్రతి ఏటా ఆగస్టు నుంచి అక్టోబరులో నీటి ప్రవాహాన్ని బట్టి రబీలో లభ్యతను అంచనా వేస్తారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఎదుర య్యాయి. శివారు ప్రాంతాలకు సాగు నీరు అంద లేదు. పంట పొలాలు దెబ్బతిన్నాయి. అదే ఇప్పుడు అధికారులను కలవర పాటుకు గురిచేస్తోంది. అతిగా అంచనా వేస్తున్నామన్న భావన అధికారుల్లో నెలకొంది.
సీలేరుపై ఆశలు
సీలేరు నుంచి 40 టీఎంసీల నీరు లభించనుంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా సీలేరు నుంచి ప్రతిఏటా ఆ మేరకు నీటి లభ్యత ఉంటోంది. పోలవరం ప్రాజెక్ట్ వద్ద మరో 12 టీఎంసీల నీరు అందుబాటులో అంచనా వేశారు. మరో 25 టీఎంసీలు గోదావరి ప్రవాహం ద్వారా అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. అదే ఇప్పుడు అధికారులను కలవరం పెడుతోంది. గోదావరిలో అంత నీరు లభ్యత లేకపోతే పరిస్థితి ఏమిటనే విషయమై అధికారులు ఆందోళన చెందుతున్నారు. వంతుల వారీ విధానంతో గట్టెక్క వచ్చంటూ ముందుగానే ప్రణాళికలు వేసుకుంటున్నారు.
ప్రభుత్వం చిన్నచూపు
రబీలో పరిస్థితులు చేయిదాటిపోకుండా ఉండాలంటే అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అవసమైన చోట ఎత్తిపోతలను అమలు చేయాలి. ప్రధానంగా దొంగరావిపాలెం వద్ద ఎత్తిపోతలకు సిద్ధం కావాల్సి ఉంటుంది. కాలువల్లోనూ ఇంజన్‌లు ఏర్పాటు చేయాలి. కాలువల్లో అడ్డుకట్ట వేయాలి. డ్రెయిన్‌లలో నీటిని వినియోగించు కోవాలి. కాలువలు, డ్రెయిన్‌లలో తూడు, గుర్రపు డెక్కను తొలగించేందుకు చర్యలు చేపట్టాలి. అవేమీ ప్రభుత్వానికి పట్టడం లేదు. ఆశించిన స్థాయిలో నిధులు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ప్రతిపాదనలు పంపే విషయం లోనూ ముందుగానే కట్టడి చేశారు. కొద్ది మొత్తంలోనే అంచనాలు రూపొందించాలంటూ జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. దాంతో రబీలో సాగు గట్టెక్కాలంటే రూ.15 కోట్లు అవసరమవు తాయంటూ ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం కేవలం రూ. 10 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులను కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకున్నట్టు లేదు. అందుకే రబీసాగుకు జిల్లా అధికారులు ఆశించిన నిధులు కూడా మంజూరు చేయలేదు. నిధుల్లో కోత విధించింది. అవసరమైనప్పుడు నిధులు అందుబాటులో లేకపోతే రబీసాగుకు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇప్పటికే నీటిపారుదల శాఖ అంటే కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. కాలువలపై ఇంజన్‌లు కూడా ఏర్పాటు చేయ లేని పరిస్థితి ఉత్పన్నమవు తోంది. ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించక పోవడంతోనే కాంట్రాక్టర్‌లు ముఖం చాటేస్తున్నారు. అయినా సరే ప్రభుత్వంలో మార్పు కానరావడం లేదు.
ముందస్తు సాగు సాధ్యమేనా
రబీ సాగు చివరిదశలో నీటి ఎద్దడి లేకుండా ఉండేలా ముందస్తు సాగుకు సిద్ధపడాలి. ప్రస్తుతం ఖరీఫ్ సాగును ఒబ్బిడి చేయడంలో రైతులు నిమగ్న మయ్యారు. వాతావరణం అనుకూలంగా ఉంది. ప్రతిఏటా ముంపు బారిన పడిన పంటపొలాలు కూడా ఈ ఏడాది గట్టెక్కాయి. వర్షాలు లేకపోవడం వల్ల వరద నీరు లేదు. దాంతో పంట చేతికొస్తోంది. రైతులంతా పంటను ఒబ్బిడి చేయడంలో బిజీగా ఉన్నారు. దాంతో రబీ ముందస్తు సాగుపై దృష్టి పెట్టలేకపోతున్నారు. జనవరి మొదటి వారం నాటికే నాట్లు పూర్తి కావాలి. ఆ దిశగా ప్రణాళికలు చేయాలి. లేదంటే చివరిదశలో పంట దెబ్బతినే అవకాశం ఉంటుంది.