ఇంకెన్నాళ్లు!

ABN , First Publish Date - 2023-05-01T00:41:16+05:30 IST

పోలవరం నిర్వాసితులతో ప్రభుత్వం దోబూచులాట ఆడుతోంది. ఆర్‌అండ్‌ఆర్‌ సర్వేలు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా పరిహారం అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నిర్వాసితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 ఇంకెన్నాళ్లు!

పరిహారం అందజేతలో నిర్లక్ష్యం

ఈసారి వరదొస్తే ముంపు తప్పదు..

గ్రామాలు ఖాళీ చేసిన వారికీ మొండిచెయ్యి

వేలేరుపాడు, ఏప్రిల్‌ 30 : పోలవరం నిర్వాసితులతో ప్రభుత్వం దోబూచులాట ఆడుతోంది. ఆర్‌అండ్‌ఆర్‌ సర్వేలు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా పరిహారం అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నిర్వాసితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిగో పరిహారం అంటూనే నిర్వాసితులకు చుక్కలు చూపిస్తోంది. ప్రభుత్వం కావాలని జాప్యం చేస్తోందని, గ్రామ సభల పేరిట ఏదో ఒక కొర్రి వేస్తూ పరిహారాలు చెల్లింపును వాయిదా వేస్తోందని ఆరోపిస్తున్నారు. మండలం లో 15 గ్రామ పంచాయతీలతో పాటు వాటి పరిధిలోని గ్రామాలతో కలిపి మొత్తం 41 గ్రామాల్లో ఇళ్ల నష్టపరిహారాలకు సంబంధించి 2019 లోనే జాబితాలు తయారు చేయగా అప్పటి నుంచి నేటి వరకు ఏదో ఒక కారణంతో పరిహారాల్లో కోతలు విధిస్తుండడంతో నిర్వాసితుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. 2019లో ప్రకటించిన నష్టపరిహారాలకు ఇటీవల నిర్వహించిన గ్రామసభల్లో ప్రకటించిన పరిహారాలకు సగానికి పైనే కోతలు విధించడంతో నిర్వాసితులు ఆగ్రహంతో రగిలిపోతూ గ్రామ సభలను బహిష్కరించారు. అధికారులు తాము ప్రకటించిన ప్రకారం ఒప్పుకుంటేనే పరిహారాలను సాధ్యమైనంత త్వరగా చెల్లిస్తామని చెబుతున్నా నిర్వాసితులు ఏ మాత్రం తగ్గకుండా గతంలో ప్రకటించిన పరిహారాలని చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరో రెండు నెలల్లో వర్షాకాలం ప్రారంభమవుతుంది. గత ఏడాది లాగే వర్షాలు అధికంగా పడితే కాపర్‌ డ్యామ్‌ కారణంగా బ్యాక్‌ వాటర్‌ పోటెత్తి గ్రామాలను ముంచెత్తే ప్రమాదం ఉంది. గతేడాది ఎన్నడూ లేని విధంగా జూలైలోనే గోదావరికి భారీ వరదలు రావడంతో గ్రామాలకు గ్రామాలే మునిగిపోగా వేలాది గృహాలు నేలమట్టమయ్యాయి. ఆ నష్టం నుంచి ఇప్పటికీ అయా గ్రామస్థులు కోలుకోలేదు. మరలా మరోసారి వరదలు వస్తే ఈ ప్రాంత ప్రజల జీవనం అస్తవ్యస్తమవుతుంది. వరదల కారణంగా ఇల్లు కూలిపోయిన వారికి రూ.పదివేల నష్టపరిహారం చెల్లిస్తామని స్వయంగా సీఎం హామీ ఇచ్చిన సగానికి పైనే నష్టపరిహారం అందలేదు. అదేవిధంగా 2022 సెప్టెంబరు ఆఖరుకు నిర్వాసితులకు సంతృప్తికరంగానే అన్ని పరిహారాలు చెల్లించి పునరావాస కాలనీలకు తరలిస్తామని ఇచ్చిన హామీ కూడా హామీగానే మిగిలింది. ఖాళీ చేసిన గ్రామాల వాసులకు నష్టపరిహారం ఇవ్వలేదు. గతేడాది వరదల సందర్భంగా బాధితులకు సరైన వసతి కల్పించలేక పునరావాస కాలనీలకు తరలి వెళ్లితే నెల లోగా పరిహారం చెల్లిస్తామని అధికారులు చెప్పడంతో నిజమేనని నమ్మిన నాలుగు గ్రామాల ప్రజలు జీలుగుమిల్లి , తాడువాయి పునరావాస కాలనీలకు తరలి వెళ్లారు. ఇప్పటికీ ఆరు నెలలు దాటినా వారికి పరిహారం కాదు కదా కాలనీలో సరైన సౌకర్యాలను కల్పించలేదు. తిరిగి వెనక్కి వద్దామంటే ఇల్లు కూలిపోయి మరల నిర్మించుకోలేని స్థితిలో ఉన్నారు. మరోవైపు పునరావస కాలనీల్లో చేసేందుకు పనులు దొరక్క ఇబ్బందులు పడుతున్నా అధికారులు పరిహారాలు చెల్లించే విషయంలో దాటవేత ధోరణితో వ్యవహరించడం నిర్వాసితులకు తీవ్ర మనోవేదన కలిగిస్తోంది.

మా గోడు పట్టించుకోవడం లేదు : కారం దారయ్య, కన్నాయిగుట్ట

ప్రభుత్వం నిర్వాసితులను శత్రువుగా చూస్తోంది. నిర్వాసితుల గోడు పట్టించుకోకపోగా ఇతరత్రా సహాయం చేసే యోచన కూడా విరమించుకుంది. గ్రామంలో 22 గృహాలు కాలిపోయి బాధితులు కట్టుబట్టలతో ఉన్నప్పటికి ప్రభుత్వం అందించే సహాయం నేటికీ అందించలేదు. దీనిని బట్టే ప్రభుత్వ ఉద్దేశం అర్థమవుతుంది.

అమలు కాని హామీలు : బాడిస రాము, సీపీఐ మండల కార్యదర్శి

ప్రభుత్వం నిర్వాసితులకు అన్ని విషయాల్లో తీవ్ర అన్యాయం చేస్తోంది. ఎకరాకు మరో రూ.ఐదు లక్షలు అదనంగా ఇస్తామని చెప్పినా ఆర్‌ఆర్‌ ప్యాకేజీ మరో రూ.10 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చినా ఏ ఒక్కటి అమలుకు నోచుకోలేదు. ఇళ్ల నష్టపరిహారాలు కూడా సగానికి పైనే కోతలు పెట్టారు. ప్యాకేజీ పరిహారాలు ఎప్పుడు ఇస్తారన్న దానిపై అధికారుల వద్ద స్పష్టత లేదు.

Updated Date - 2023-05-01T00:41:16+05:30 IST