సంక్రాంతి వేళ.. చాలాకష్టం గురూ..
ABN , First Publish Date - 2023-01-09T23:59:49+05:30 IST
సంక్రాంతి పండుగ సమీపిస్తున్నది.. సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో గోదావరి జిల్లాలకు వచ్చే బంధువుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.. ప్రైవేటుగా బంధువులు, స్నేహితుల నివాసాలు.. వారి గెస్ట్ హౌస్‌లు నిండుకోవడంతో నాలుగు రోజుల్లో వచ్చేవారి కోసం ఇక్కడ వసతి కరువవుతోంది.
భీమవరం పరిసర ప్రాంతాల్లో హోటళ్లు.. లాడ్జీలు ఫుల్
వసతి కోసం రాజకీయ సిఫార్సులు.. పోలీస్ ఒత్తిళ్లు..
బంధువర్గం, మిత్రులతో నివాస గృహాలకూ తాకిడి
భీమవరం, జనవరి 9 : సంక్రాంతి పండుగ సమీపిస్తున్నది.. సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో గోదావరి జిల్లాలకు వచ్చే బంధువుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.. ప్రైవేటుగా బంధువులు, స్నేహితుల నివాసాలు.. వారి గెస్ట్ హౌస్‌లు నిండుకోవడంతో నాలుగు రోజుల్లో వచ్చేవారి కోసం ఇక్కడ వసతి కరువవుతోంది. ఉన్న హోటళ్ళు,లాడ్జీలన్నీ గతంలోనే ఆన్‌లైన్ ద్వారా , ఫోన్ ద్వారా రిజర్వు చేసుకున్నారు. యాజమాన్యాలు కూడా కొన్ని గదులను రిజర్వులో ఉంచుకున్నారు. పండగ దగ్గరికి వచ్చిన తరువాత వాటికి ఉన్న డిమాండ్ బడ్టి చార్జీలు వసూలు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. పండుగ వేళ కనీసం 2 లక్షల మంది వరకు జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. గతంలో ఉన్న అనుభవాలు దృష్ట్యా ఈ అంచనా వేసుకుంటున్నారు. ఇందులో మూడు వంతులు మంది బంధువులు, స్నేహితులు కావడంతో వారికి వసతికి ఇబ్బంది లేదు. ఈ ప్రాంతంలో సంప్రదాయాలు చూడడానికి, కోడిపందాలు కోసం కొందరు వస్తుంటారు. వీరిలో చాలా మంది తమ వాహనాల్లోనే మూడు రోజులు పాటు బస చేసే అలవాటు కొనసాగిస్తున్నారు. మిగిలిన జనానికి ఇప్పటికే బుక్ చేసుకున్న హోటళ్లు సరిపోగా.. వేల మందికి మాత్రం ఇక్కడ వసతి లేదు. వీరి వసతికి డిమాండ్ ఏర్పడుతోంది. ప్రతీ ఏటా ఇదే పరిస్థితి. దీంతో అనేక సిఫార్సులు, ఒత్తిళ్ళు మొదలయ్యాయి. అధికార పార్టీ నాయకుల ద్వారా, సన్నిహితుల ద్వారా చాలా ఒత్తిడి వస్తోందని అంటున్నారు. మరోవైపు పోలీస్‌శాఖ ద్వారా కొంత మంది వీఐపీల కోసమో, వారి కావలిసిన వారి కోసమో సిఫార్సులు ప్రారంభించారు. కొందరు తీవ్ర ఒత్తిడి కూడా తెస్తున్నట్లు తెలిసింది. రెండు రోజులకు ఎంత డబ్బులు అయినా సరే వసతి కావాల్సిందే అన్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంతో పాటు ఉండి నియోజకవర్గం, పాలకొల్లు, నర్సాపురం, ఆచంట, తణుకు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, నిడదవోలు, కొవ్వూరు వంటి నియోజకవర్గాల్లో అనేక ప్రాంతాల్లో సంక్రాంతికి బంధు
గణం పక్కన ఉంచితే అతిథులుగా వేలాదిగా చేరుకుంటారు. ఈ ప్రాంతాల్లో కోడిపందేలను చూసేందుకు వచ్చేవారికి వసతి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రాంతాల్లో పొలాలు, ఆక్వా చెరువులు గట్టున గెస్ట్ హౌస్‌లు ఉన్నాయి. ఇవన్నీ కూడా సంక్రాంతికి హౌస్‌పుల్ అయిపోతుంటాయి. ఎంతో మందిని బంధుమిత్రులు వసతిని సర్ధుబాటులతో గడిపేస్తారు. అయినప్పటికీ వచ్చేవారి సంఖ్య వేలల్లో ఉండటంతో భీమవరం ప్రాంతంలో ఇప్పుడు వసతి సమస్య ఏర్పడింది.