శిశువు తలపై కత్తి గాటు

ABN , First Publish Date - 2023-06-11T00:11:14+05:30 IST

పురుడు పోసు కోవడానికి వచ్చిన నిండు గర్భిణికి అత్యవసరంగా సిజేరియన్‌ చేశారు. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. మాతృత్వం పొందిన ఆ తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వడానికి ఆరాటపడింది. బాక్సులో పెట్టిన బిడ్డను తండ్రికి అప్పగించడంతో తీసుకువచ్చి తల్లికి అందించే సమయంలో ఆ శిశువు తలపై రక్తం కారడాన్ని గుర్తించారు.

శిశువు తలపై కత్తి గాటు
పసి బిడ్డతో తండ్రి పవన్‌కుమార్‌

గర్భిణికి సిజేరియన్‌ చేసే సమయంలో వైద్యుల నిర్లక్ష్యం

శిశువు తండ్రి గోరు తగిలిందంటూ వైద్యుల బుకాయింపు

ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఘటన

ఏలూరు క్రైం, జూన్‌ 10 : పురుడు పోసు కోవడానికి వచ్చిన నిండు గర్భిణికి అత్యవసరంగా సిజేరియన్‌ చేశారు. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. మాతృత్వం పొందిన ఆ తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వడానికి ఆరాటపడింది. బాక్సులో పెట్టిన బిడ్డను తండ్రికి అప్పగించడంతో తీసుకువచ్చి తల్లికి అందించే సమయంలో ఆ శిశువు తలపై రక్తం కారడాన్ని గుర్తించారు. వైద్యులను ప్రశ్నిస్తే చేతి గోరు మీదే తగిలిందంటూ బుకాయించారు. ఇది ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో జరిగిన సంఘటన. జంగారెడ్డిగూడెంకు చెందిన పవన్‌కుమార్‌ భార్య నాగదుర్గాంజలి నిండు గర్భిణి ఆమె పుట్టిల్లు చింతలపూడి. ఈనెల 9వ తేదీ సాయంత్రం ఆమెకు పురుటి నొప్పులు రావడంతో చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి వెళ్ళగా ఏలూరు ప్రభుత్వ సర్వజనాసుపత్రికి రిఫర్‌ చేశారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో 9వ తేదీ రాత్రి ఎంసీహెచ్‌ బ్లాక్‌లో చేరారు. ఆమెకు ఉమ్మ నీరు తక్కువగా ఉందని ఆపరేషన్‌ చేయాలని వైద్యులు చెప్పి రాత్రి 10.30 గంటల సమయంలో ఆపరేషన్‌ చేశారు. ఆ తరువాత ఆ బిడ్డను 12 గంటల సమయంలో పాలు పట్టించమని పవన్‌కుమార్‌కు ఇచ్చారు. పవన్‌కుమార్‌ తన భార్య వద్దకు తీసుకువెళ్ళి ఇచ్చే సమయంలో ఆ బిడ్డ తలపై రక్తం కారడాన్ని గమనించారు. ఇదేమిటని వైద్యులను, సిబ్బందిని అడగగా అతని చేతి గోరు తగిలిందని బుకాయించారు. అంగుళం మేర కత్తి గాటు స్పష్టంగా ఉండడంతో నాలిక కరుచుకున్న వైద్యులు, సిబ్బంది ఆయింట్‌మెంట్‌ రాసి స్టిక్కర్‌ను అంటించారు. ఈ ఘటనపై ఆసుపత్రి అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నారని పవన్‌కుమార్‌ ఆరోపించారు. ప్రస్తుతం బాబు ఆరోగ్యంగా ఉన్నాడని చెబుతున్నారు.

ఈ ఘటనపై మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ సర్జరీ చేసే సమయంలో శిశువుకు తలపై కొద్దిపాటి గాయం తగిలినట్లుగా శిశువు తండ్రి ఆరోపించిన దానిలో వాస్తవం లేదన్నారు. కొద్దిపాటి గోరు గీసుకుని ఉండవచ్చు. అది ఎవరి గోరు అనేది తెలియదు. సహజంగా కాన్పు సమయంలో చేతికి గ్లౌజులు ఉండడం వల్ల వైద్యులు, సిబ్బంది గోర్లు తగిలే అవకాశం లేదు. ఆ చిన్న గాయం వల్ల శిశువుకు ఎలాంటి ప్రమాదం లేదని, ఆయింట్‌మెంట్‌ రాశారన్నారు.

Updated Date - 2023-06-11T00:11:14+05:30 IST