మండుటెండలో బతుకు వేట

ABN , First Publish Date - 2023-05-26T00:09:43+05:30 IST

ఎండలు సుర్రుమంటున్నాయి. ఉదయం 7 దాటితే కాలు బయటపెట్టడం కష్టంగా ఉంది. రోహిణి కార్తె ప్రారంభం రోజే ఎండ భగభగ మండింది. బయటకు రావాలంటేనే భయపోతున్న పరిస్థితిలో రోడ్డుపై చిరు వ్యాపారాలు చేసుకునే వారి అవస్థలు వర్ణనాతీతం.

మండుటెండలో బతుకు వేట
గణపవరం– భీమవరంలో రోడ్డులో రహదారి పక్కన నిమ్మకాయలు విక్రయిస్తున్న మహిళలు

చిరు వ్యాపారులకు తప్పని వెతలు

దినసరి కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదని ఆవేదన

రోహిణి కార్తె ప్రారంభం రోజే

మండిన ఎండలు

గణపవరం, మే 25: ఎండలు సుర్రుమంటున్నాయి. ఉదయం 7 దాటితే కాలు బయటపెట్టడం కష్టంగా ఉంది. రోహిణి కార్తె ప్రారంభం రోజే ఎండ భగభగ మండింది. బయటకు రావాలంటేనే భయపోతున్న పరిస్థితిలో రోడ్డుపై చిరు వ్యాపారాలు చేసుకునే వారి అవస్థలు వర్ణనాతీతం. ముంజులు, నిమ్మకాయలు, బొప్పాయి, మామిడి, పీతలు, చేపలు అమ్ముకునే వారిని చూస్తే మనసున్న వారికి బేరం అడగకుండా కొనాలనిపిస్తుంది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. దానికి తోడు రోహిణి ప్రారంభంతో ఎండల తీవ్రతకు ఉక్కబోత తట్టుకోలేకపోతున్నారు. డబ్బులున్నవారు ఏసీ రూమ్‌లు వదిలి రాలేకపోతున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేదలు తమ బతుకు బండిని నడిపించేందుకు రోడ్కెక్కాలి వస్తోంది. ఎండలు లెక్కచేయకుండా గణపవరం నుంచి భీమవరం, తాడేపల్లిగూడెం వెళ్లే రహదారుల వెంబడి చిరు వ్యాపారులు విక్రయాలు చేస్తున్నారు. మండుటెండల్లో మెట్ట ప్రాంతాల నుంచి ఇటు డెల్టా ప్రాంతాల నుంచి ఆటో లేదా బస్సుల్లో వచ్చి అమ్మితే దినసరి కూలి కూడా గిట్టుబాటు అవడం లేదని వాపోతున్నారు.

రోజుకు రూ.1500 దాకా అమ్ముతాం

–రాజేష్‌, తాటిముంజుల వ్యాపారి, నీలాద్రిపురం

ముంజుల సీజన్‌లో ఇక్కడకు వచ్చి అమ్ముతుంటాం. డజను రూ.50 చొప్పున విక్రయిస్తున్నాం. రోజుకు రూ.1500 అమ్ముతాం.అందరూ లేత ముంజులు కావాలంటారు. కవర్లో పెట్టాక కొన్ని ఏరి పక్కన పెడతారు. మరొకటి కొసరు వేయమంటారు. ఎండల్లో అమ్ముతున్నారు..పాపం అని బేర మార కుండా కొనేవారు తక్కువ.ఎండైనా వానైనా బతకాలంటే తప్పదు కదా..

ఎండైనా తప్పదు మరి

–మహాల క్ష్మి, పీతల వ్యాపారి, కాకినాడ

ఎండ తీవ్రంగా ఉన్నా వ్యాపారం చేయక తప్పదు. కాకినాడ నుంచి పీతలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నా. వేసవిలో పీతల కొనుగోళ్లు తగ్గుతున్నాయి. కూలి గిట్టుబాటు కావడం లేదు. ఒక రోజు తెచ్చినవి మొత్తం అయిపోతాయి. ఒకో రోజు అవ్వవు. మిగిలివి గంపలో పెట్టుకుని ఊరికి వెళ్లిపోతాం. ఈ ఎండలో అమ్మకాలు సాగించకపోతే బేరాలు పోతాయి. అలవాటు తప్పుతుంది.

Updated Date - 2023-05-26T00:09:43+05:30 IST