గాలి వాన
ABN , First Publish Date - 2023-04-02T23:46:46+05:30 IST
ఒక్కసారిగా వచ్చిన గాలులతో కూడిన భారీవర్షం భీభత్సం సృష్టించింది.
అరటి, మొక్కజొన్న పంటలకు నష్టం
రాట్నాలమ్మ ఆలయం వద్ద విరిగిపడిన బోర్డులు
పెదవేగి, ఏప్రిల్ 2: ఒక్కసారిగా వచ్చిన గాలులతో కూడిన భారీవర్షం భీభత్సం సృష్టించింది. ఆదివారం గాలివాన ధాటికి రాట్నాలకుంటలోని రాట్నాలమ్మ ఆలయం వద్ద డిజిటల్ లైటింగ్ బోర్డులు ఒక్కసారిగా కూలిపో యాయి. ఆలయ ప్రధాన రహదారిపై డిజిటల్ స్వాగతం బోర్డు నేల వాలింది. దీంతో రహదారిపై కొంతసేపు రాకపోకలు స్థంభించాయి. ఆలయ ఆవరణలో పలుచోట్ల ఏర్పాటుచేసిన బోర్డులు కూడా నేలకూలాయి. వాన తగ్గిన తరువాత ఆలయ పరిసరాల్లో భీభత్స వాతావరణం కనిపించింది. వర్షం కారణంగా బోర్డుల సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమా దమే తప్పిందని ఆలయ సిబ్బంది తెలిపారు. మరో మూడురోజుల్లో తిరునాళ్ళు ప్రారంభం కానున్న తరుణంలో కొంత అంతరాయం కలిగింది.
కామవరపుకోట: మండలంలోని తడికలపూడి పరిసర గ్రామాల్లోని రత్నగిరినగర్‌లో ఆదివారం మధ్యాహ్నం ఒక మోస్తరు నుంచి భారీగా పెను గాలి వీచేసరికి అరటి తోటలన్నీ నేలమట్టం అయ్యాయి. దాదాపు 50 ఎకరాల అరటి పంట నేలమట్టం అయినట్టు రైతులు చెబుతున్నారు. అరటి రైతులను ఆదుకోవాలని టీడీపీ కిలారు సత్యనారాయణ కోరారు.
పోలవరం: మండలంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి గూటాల, కొత్తపట్టిసీమ, పట్టిసీమ, పోలవరం గ్రామాల్లో పలు పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పోలవరం బెస్తావీధి, కొత్తపేట, బాపూ జీ కాలనీ, మెయిన్ బజార్ ప్రాంతాల్లో డ్రెయినేజీ వ్యవస్థలు లేక రోడ్లపై నీరు నిలిచి స్థానిక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పట్టిసీమ, గూటాల, కొత్తపట్టిసీమ ప్రాంతాల్లో కల్లాలపై ఆరబెట్టిన మొక్కజొన్న పంట తడిసి రైతులు నష్టపోయారు. వర్షం గాలులతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మండలంలో రోజంతా విద్యుత్ సరఫరా లేదు.
కొయ్యలగూడెం: మండలంలో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు వీచాయి. అనంతరం భారీ వర్షం తో రోడ్లన్ని జలమయం అయ్యాయి. పొగాకు, మొక్కజొన్న తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మిర్చి రైతులకు కూడా నష్టం వాటిల్లింది.
జిల్లాలో 9.6 మిల్లీ మీటర్ల వర్షపాతం
ఏలూరు సిటీ, ఏప్రిల్ 2: జిల్లాలో గడచిన 24 గంటల్లో జిల్లాలో సరాసరి వర్షపాతం 9.6 మిల్లీమీటర్లు నమోదైంది. ముసునూరు మండలంలో అత్య ధికంగా 66.2 మిల్లీమీటర్లు, కైకలూరు 32.6, కలిదిండి 32.2, మండవల్లి 29.2, ఏలూరు 27.4, పెదపాడు 21.8, పెదవేగి 15.6, పోలవరం 11.2, దెందులూరు 10.4, భీమడోలు 8.2, నూజివీడు 6.4, లింగపాలెం 4.4, బుట్టాయిగూడెంలో 3 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది.