సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2023-02-07T00:11:33+05:30 IST

సైబర్‌ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ సూచించారు.

సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
అర్జీలు స్వీకరిస్తున్న ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ

ఏలూరు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 6 : సైబర్‌ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ సూచించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన స్పందనలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఎక్కువగా వర కట్నం వేధింపులు, సరిహద్దు తగాదాలు, సివిల్‌ వివాదాలపై ఫిర్యాదులు వచ్చాయి.

‘తన కుమారుడు ఉరి వేసుకుని చనిపోయాడు. ఈ ఆత్మహత్య వెనుక కొందరి ప్రమేయం ఉంది. వారిపై చర్యలు తీసుకోవాలి’ అని మండవల్లి మండలం ఎంగిలిపాకలంకకు చెందిన ఓ వ్యక్తి ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు.

తన భర్త చావుకు కారణమైన అత్త, మామ, ఆడ పడుచులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నూజివీడు మండలం మీర్జాపురానికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు.

కేడీఐ ఫ్యూచర్‌ అనే సంస్థలో 11 లక్షలు పొదుపు చేశామని. ఆ డబ్బును సంస్థలో పనిచేసే నాగరాజు వ్యక్తిగత అవసరాలకు వాడుకుని, తమను మోసం చేశాడని ఏలూరు నుంచి కొంత మంది దివ్యాంగులు ఎస్పీని కలిసి న్యాయం చేయాలని కోరారు.

తన భార్యను మరో వ్యక్తి మాయమాటలు చెప్పి తీసుకువెళ్ళిపోయాడని, తాను సంపాదించిన 14 కాసుల బంగారం, పది లక్షలు నగదు, తన అన్న కొడుకు వద్ద మరో మూడు లక్షలు తీసుకుని వెళ్లిపోయిందని ఆమెపై చర్యలు తీసుకోవాలని దెందులూరు మండలం నాగుల దేవుడుపాడుకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు.

అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని నాటు వైద్యం చేస్తామని చెప్పి ఇద్దరు వ్యక్తులు 20 వేలు తీసు కుని ఎవో పొడులు ఇచ్చి మోసం చేశారని ఏలూరుకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. వీటిని పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ ఆదేశించారు.

Updated Date - 2023-02-07T00:11:35+05:30 IST