గ్రామాల్లో శిలువ యాత్ర.. చర్చిలలో ప్రార్థనలు

ABN , First Publish Date - 2023-04-07T23:42:26+05:30 IST

గ్రామాల్లో శిలువతో ర్యాలీలు నిర్వహించారు. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు

గ్రామాల్లో శిలువ యాత్ర.. చర్చిలలో ప్రార్థనలు
ఏలూరు ఫైర్‌ స్టేషన్‌ సెంటర్‌లో శిలువతో క్రైస్తవుల ర్యాలీ

జిల్లాల్లో గుడ్‌ ఫ్రైడే కార్యక్రమాలు

శాంతి దూత ఏసు క్రీస్తు శిలువ వేయబడిన రోజు క్రైస్తవులు గుడ్‌ ఫ్రైడేగా ఆచరించారు. గ్రామాల్లో శిలువతో ర్యాలీలు నిర్వహించారు. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రపంచ మానవాళి పాపాలను కడిగివేయడానికి ఏసు శిలువ మరణం పొందినట్లు క్రైస్తవ ఫాదర్లు, పాస్టర్లు సంఘస్తులకు వివరించారు. ఏసు మరణానికి ముందు శిలువపై పలికిన ఏడు మాటలను ప్రజలకు వివరించారు.

ఏలూరు టూటౌన్‌, ఏప్రిల్‌ 7: నగరంలో క్రైస్తవ సోదరులు గుడ్‌ఫ్రైడే ఆరాధనలు చేశారు. నగరంలోని అన్ని చర్చిలలో శుక్రవారం ప్రత్యేక ఆరాధనలు, ఏసుక్రీస్తు శిలువ ధ్యానాలు నిర్వహించారు. ఆర్‌సీఎం, టీఎస్‌ఐ, ఐసీఎం, బాప్టిస్టు, పెంతికోస్తు, సాల్వేషన్‌ ఆర్మీ, హోలివల ప్రార్థన మందిరం, ఎల్‌ఈఎఫ్‌, ఇతర చర్చ్‌లలో శిలువ ధ్యానాలు జరిగాయి. దేవుని సేవకులు క్రీస్తు శిలువలో పలికిన ఏడు మాటల్లోని ఆధ్యాత్మీక సత్యాలను వివరించారు. పలు క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో శిలువను పట్టుకుని నగరంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. ఏసుక్రీస్తు శిలువలో పడిన శ్రమలను ప్రజలకు తెలియజెప్పే విధంగా పలువురు భక్తులు వీధుల్లో శిలువను మోస్తూ ఊరే గింపు నిర్వహించారు. ఏలూరు కథోలిక పీఠాధిపతి జయరావు పొలిమేర ఆధ్వర్యంలో సెంట్‌ ఆన్స్‌ కళాశాల నుంచి భారీ ఊరేగింపుగా బయల్దేరి శిలువను మోసుకుంటూ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంతకు ముందుకు అమలోద్భవి సెతడ్రల్‌ దేవాలయంలో దివ్య బలిపూజ నిర్వహిం చారు. ఐసీఎం చర్చిలో బిషప్‌ మోస్ట్‌ రెవరెండ్‌ ఎస్‌డీ రాజు దేవాలయంలో శిలువ ధ్యానం గురించి వివరించారు. హోలివల ప్రార్థన మందిరంలో దువ్వనపూడి ఆధామ్‌బాబు, ఎల్‌ఈఎఫ్‌ చర్చ్‌లో బ్రదర్‌ సురేష్‌ మార్కస్‌ దేవుని వాక్యాన్ని అందించారు. ఎన్‌టీఆర్‌ కాలనీలో విశ్వపూరి ధ్యాన కేంద్ర డైరెక్టర్‌ రెవరెండ్‌ ఫాదర్‌ డీ.జేవియర్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

ఏలూరు రూరల్‌: మండలంలోని పలు చర్చిల్లో క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. మల్కాపురం, చాటపర్రు, జాలిపూడి, మాదేపల్లి, గుడివాకలంక, పైడిచింతపాడు, ప్రత్తికోళ్ళలంక గ్రామాల్లో క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. లోక రక్షణ కోసం మరణించిన ఏసు కోసం ఉపవాసాలు ఉన్నారు. శిలువతో ర్యాలీ నిర్వహించారు. ఏసుక్రీస్తును బంధించడం నుంచి శిలువ వేసే వరకూ జరిగిన ఘట్టాలను నాటకం ద్వారా ప్రదర్శించారు.

దెందులూరు: ఏసుక్రీస్తు త్యాగాల స్ఫూర్తితో ఎంత కష్టమైనా మంచి మార్గంలో నడవాలని పోతునూరు ఆర్‌సీఎం చర్చి ఫాదర్‌ పరిశె డేవిడ్‌రాజు అన్నారు. పోతునూరు, దోసపాడు గ్రామాల్లో క్రైస్తవులు శిలువ ధరించి ప్రదర్శన, ప్రార్థనలు చేశారు. దెందులూరులో ఆర్‌సీఎం పీఠాధిపతి అమ్మన్‌ రాజా ఆధ్వర్యంలో శిలువ భూజంపై ఉంచుకుని క్రైస్తవలు పాల్గొన్నారు. చల్లచింతలపూడి గౌడవీధిలో పాస్టర్‌ సుధాకర్‌బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గోపన్నపాలెం, గాలాయగూడెం, గంగన్నగూడెం, కొవ్వలి, సోమవరప్పాడు, జోగన్నపాలెం, రామారావుగూడెం, మేదినరావుపాలెం, తదితర గ్రామాల్లోని చర్చిలలో ప్రార్థనలు చేశారు.

బుట్టాయగూడెం: మండలంలోని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బుట్టాయగూడెం సెయింట్‌ మార్క్సు లూథరన్‌ చర్చి సంఘ కాపరి ఎంఎ.ఆమెన్‌, సెయింట్‌ యూజిన్‌ కథోలిక సంఘం ఫాదర్‌ జోసెఫ్‌ రాజ్‌, డికన్‌ ఆధ్వర్యంలో శిలువ యాత్ర నిర్వహించి ప్రార్థనలు చేశారు. యు.సూ ర్యప్రకాశరావు, కాశి విమల, బుడుపుల మాలిని, తలారి రాజు, వెంప ప్రసం గిరాజు, గాంధీరాజు సంఘ పెద్దలు, మరియాదళ సభ్యులు పాల్గొన్నారు.

చింతలపూడి: పలు గ్రామాల్లో క్రైస్తవ భక్తులు శిలువ యాత్రలు చేశారు. ప్రతీ చర్చిలో ప్రార్థనలు జరిపారు. చింతలపూడిలో 40 రోజులుగా ఉపవాస ప్రార్థనలు అనంతరం శుక్రవారం శిలువ యాత్ర 14 ప్లాటూన్లలో మోకాళ్ళపై కూర్చొని మండుటెండలో ప్రార్ధనలు జరిపారు. బోయగూడెం ఆర్‌సిఎం చర్చి ఫాదర్‌ కామా మాథ్యూ కోర్టు సెంటర్‌ నుండి బోయగూడెం చర్చి వరకు ఈ యాత్రలో శిలువను మోశారు. అల్లిపల్లి, ఫాతిమాపురం, ఆంథోనినగర్‌, పలు ప్రాంతాల్లో శిలువ యాత్రలు భక్తిశ్రద్ధలతో జరిగాయి.

Updated Date - 2023-04-07T23:42:26+05:30 IST