ముంపు నుంచి సురక్షిత ప్రాంతాలకు రావాలి

ABN , First Publish Date - 2023-07-21T00:13:35+05:30 IST

మండలంలో యడవల్లి–గొల్లపల్లి మధ్య ఎద్దువాగు పొంగడంతో కొయిదా, కటుకూరు ముంపు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు రావాలని జాయింట్‌ కలెక్టర్‌ బి.లావణ్యవేణి సూచించారు.

ముంపు నుంచి సురక్షిత  ప్రాంతాలకు రావాలి
వరద ఉధృతిపై స్ధానికులు, అధికారులకు సూచనలు ఇస్తున్న జేసీ లావణ్యవేణి

ముంపు సమస్య తలెత్తే ప్రాంతాల్లో జేసీ పర్యటన

వేలేరుపాడు, జూలై 20: మండలంలో యడవల్లి–గొల్లపల్లి మధ్య ఎద్దువాగు పొంగడంతో కొయిదా, కటుకూరు ముంపు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు రావాలని జాయింట్‌ కలెక్టర్‌ బి.లావణ్యవేణి సూచించారు. వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో గురువారం జేసీ పర్యటించారు. వరద ఉధృతి పెరుగుతున్న క్రమంలో ఆయా ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతలు, పేషెంట్లు సురక్షిత ప్రాంతా లకు వచ్చేందుకు సహకరించాలని కోరారు. వరద ఉధృతి పెరిగితే కష్టమని, ముం దుగానే సురక్షిత ప్రాంతాలకు రావాలని కోరారు. వరద సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం శుక్రవారం ఇక్కడికి చేరుకుంటుందన్నారు. అగ్నిమాపక, మత్స్యశాఖ, టూరిజం బోట్లను సిద్ధం చేశామన్నారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో వరద సహాయక, పునరావాస చర్యలపై సమీక్షించారు. పాడి పశువులకు వ్యాధినిరోధక టీకాలు వేసేందుకు, వాటికి అవసరమైన పశు గ్రాసాన్ని అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక జేడీని జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశించారు. ప్రత్యేక పారిశుధ్య పనులను చేపట్టాలని జిల్లా పంచాయితీ అధికారిని ఆదేశించారు. అసిస్టెంట్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌, ఐటీడీఏ పీవో సత్యనారాయణ, ఆర్డీవో ఝాన్సీరాణి, డీపీవో టి.శ్రీనివాస్‌, పాల్గొన్నారు.

పోలవరం: వరదల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉం డాలని తహసీల్దారు బి.సుమతి సూచించారు. తహసీల్దారు కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సూచించారు. మండల అధికారులంతా అందు బాటులో ఉండాలని ఆదేశించారు. తహసీల్దారు కార్యాలయంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో జి.శ్రీను, సీఐ విజయ్‌బాబు, ఎస్‌ఐ పవన్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-07-21T00:13:35+05:30 IST