ప్రతిపాదనలు ఘనం

ABN , First Publish Date - 2023-04-22T23:31:03+05:30 IST

జలవనరుల శాఖపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. నిధులు మంజూరు చేయడంలో తాత్సారం చేస్తోంది.

ప్రతిపాదనలు ఘనం

ప్రభుత్వ స్పందన శూన్యం

ఓఅండ్‌ఎం నిధుల కేటాయింపులో

తాత్సారం.. అధికారుల ఎదురుచూపు

పశ్చిమ డెల్టా పరిధిలో రూ.40 కోట్లతో ప్రతిపాదనలు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

జలవనరుల శాఖపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. నిధులు మంజూరు చేయడంలో తాత్సారం చేస్తోంది. తీరా పనులు నిర్వహించాక బిల్లులు మంజూరు చేయకుండా పిల్లి మొగ్గలు వేస్తోంది. ప్రస్తుత వేసవిలో ఓఅండ్‌ఎం నిధులతో చేపట్టే పనులకు జిల్లా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రభుత్వానికి సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పశ్చిమ డెల్టా పరిధిలో పంట కాలువలు, డ్రైనేజీల మరమ్మతులకు దాదాపు రూ.40 కోట్లతో అంచనాలు రూపొందించారు. పూడిక తీత, తూడు, గుర్రపు డెక్క తొలగింపు, స్లూయిజ్‌ల మరమ్మతుల వంటి పనులు నిర్వహించేందుకు ప్రణాళిక రచించారు. ఇటీవల విజయవాడలతో జలవనరుల శాఖ సమీక్ష నిర్వహించింది. నిధుల లభ్యతపై రోజంతా సుదీర్ఘంగా చర్చించారు. అదే సమావేశంలో జిల్లాకు అవసర మైన నిధులపై స్పష్టత వస్తుందని భావించారు. నిధులు కేటాయిస్తారని ఆశించారు. తీరా ఉన్నతాధికారులు చర్చలకే పరిమితమయ్యారు. నిధుల లభ్యతను బట్టి కేటాయిస్తామంటూ సంకేతాలు పంపారు. వాస్తవానికి పశ్చిమ డెల్టాకు ఓఅండ్‌ఎం నిధులు అందుబాటులో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇటీవల కాలంలో రైతుల నుంచి నీటి తీరువా వసూలు చేయడంలో అధికారులు ప్రయత్నాలు ఫలించాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రైతుల నుంచి నీటి తీరువాను వసూలు చేసి ప్రభుత్వ ఖజానాలో జమ చేశారు. అవే నిధులను ఓఅండ్‌ఎం పనులకు కేటాయించాల్సి ఉంది. ప్రభుత్వం తలచుకుంటే కేటాయింపులకు ఇబ్బందులు లేదు. అయినా తాత్సారం చేయడంలో జాప్యం చేయడం విడ్డూరంగా ఉంది.

ముందంతా పరీక్ష కాలమే

వేసవిలో చేపట్టే పనులకు జిల్లా అధికారులు సిద్ధంగా ఉన్నారు. నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉంది. కాలువలు మూసిన వెంటనే పనులు ప్రారంభించాలి. పూడికతీత పనులు చేయాలి. లేదంటే వర్షాలు ముంచుకొస్తున్నాయి. కాలువల్లో నీటి విడుదల చేసిన తర్వాత పూడిక తీత పనులు సాధ్యం కావు. ప్రభుత్వం ఎంత త్వరగా నిధులు మంజూరు చేస్తే అంతే వేగంగా పనులు చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే కాంట్రాక్టర్లు ఎంత మేర స్పందిస్తారనేది ప్రశ్నార్థకం. టెండర్‌లు వేసేందుకు కాంట్రాక్టర్‌లు చుట్టూ తిరగాల్సి వస్తోంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జలవనరుల శాఖ అధికారులు కష్టకాలం మొదలైంది. కాంట్రాక్టర్లు ముఖం చాటేశారు. వేసవి పనులంటేనే వెనుకంజ వేస్తున్నారు. అధికారులే కాంట్రాక్టర్‌లను గుర్తించి టెండర్‌లు వేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటోంది.

బిల్లులు ఇస్తేనే..

ప్రభుత్వం సకాలంలో బిల్లులు ఇస్తుందన్న భరోసా కల్పిస్తేనే వేసవి పనులు వంద శాతం పూర్తి కాను న్నాయి. లేదంటే 50 శాతం పనులు చేయలేకపోతు న్నారు. పశ్చిమ డెల్టా పరిధిలో రూ.60 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అదే ఇప్పుడు అధికారు లకు శాపంగా మారింది ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్‌లు స్పందించడం లేదు. టెండర్‌లు వేసేందుకు సాహసించడం లేదు. గత మూడేళ్ల నుంచి జిల్లాలో ఇదే పరిస్థితి ఎదురవుతోంది. అయినా ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తోంది.

నష్టపోతున్న రైతులు

డ్రైనేజీలు సక్రమంగా లేకపోవడంతో రైతులు నష్టపోతు న్నారు. మురుగునీటి ప్రవాహం లేకపోవడంతో భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగిపోతున్నాయి. నారుమళ్ల దశలోనే కుళ్లిపోతున్నాయి. దీనివల్ల గడచిన ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా 80 వేల ఎకరాల్లో ఖరీఫ్‌ సాగు చేపట్టలేకపోయారు. తీరా సాగు చేసిన పొలాలు చివరి దశలో ముంపుబారిన పడుతున్నాయి. డ్రైయిన్‌లు ప్రక్షాళన చేసినప్పుడే నీటి ప్రవాహం సక్రమంగా ఉంటుంది. అధిక వర్షాలు కురిసినా సరే పంటపొలాలకు ముప్పు తప్పుతుంది. ప్రభుత్వానికి ఇవేమీ పట్టడం లేదు. అంతిమంగా రైతులు నష్టపోతున్నారు.

Updated Date - 2023-04-22T23:31:03+05:30 IST