ఉండిలో అగ్ని ప్రమాదం
ABN , First Publish Date - 2023-06-24T00:07:38+05:30 IST
ఉండి మెయిన్ సెంటర్‌లోని ఒక షాపులో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది.
కాలి బూడిదైన షాపులోని విలువైన వస్తువులు
రూ.50 లక్షల వరకు ఆస్తి నష్టం
ఉండి, జూన్ 23 : ఉండి మెయిన్ సెంటర్‌లోని ఒక షాపులో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. విలువైన సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయి.ఉండి ప్రధాన సెంటర్‌లో చలమలశెట్టి సత్యనారాయణ కొన్ని సంవత్స రాలుగా ఫొటో స్టూడియో, రెడీమేడ్ దుస్తులు, ఫ్యాన్సీ, చెప్పులు, జిరాక్స్ వంటి వ్యాపారాల నిర్వహిస్తున్నారు. మూడు అంతస్తుల భవనంలో కింద వ్యాపారం సాగిస్తూ పైన నివాసం ఉంటున్నారు. శుక్రవారం యజమాని వేరే ఊరు వెళ్లారు. ఉదయం దుకాణంలోకి పొగలు వచ్చి కమ్మివేశాయి. అటువైపుగా వెళ్లే యువకులు చూసి కేకలు వేయడంతో చుట్టుపక్కల ప్రజలు గుమిగూడారు. షట్టర్సు, గ్లాసు అద్దాలను పగలగొట్టి లోపలకు వెళ్లారు. పైఅంతస్తులో వంటపని చేసుకుంటున్న మహిళను బయటకు తీసుకు వచ్చారు. అగ్ని ప్రమాద సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. విద్యుత్ షార్టు సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. స్టూడియోకు సంబంధించి విలువైన కెమెరాలతో విలువైన సామాగ్రి ప్రమాదంలో దగ్ధమయ్యాయని సుమారు రూ.50 లక్షలు వరకు నష్టం వుండవచ్చునని షాపు యజమాని తెలిపారు. ఈ ఘటనతో ఎన్‌హెచ్ 216 జాతీయరహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలను ఉండి సంత మార్కెట్ రహదారి గుండా మళ్లించారు. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజులు సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. భీమవరం డీఎస్పీ బి.శ్రీనాధ్, జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీని వాసరావు, సహాయ అధికారి సూర్యప్రకాశరావు, ఇతర సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.