వణికిస్తున్న జ్వరాలు

ABN , First Publish Date - 2023-09-23T00:28:56+05:30 IST

జిల్లాలో కొద్ది రోజులుగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. మొన్న కుక్కునూరు మండలంలో ప్రజలు పడకేయగా, తాజాగా అన్ని ప్రాంతాల్లోనూ దీని తీవ్ర పెరుగుతోంది. ప్రతి ఊరిలోనూ జ్వర పీడితులు వణికిపోతున్నారు.

వణికిస్తున్న జ్వరాలు
చల్లావారిగూడెం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో జ్వరంతో బాధపడుతున్న దండగల శాంతమ్మ

జ్వరాలు తగ్గినా నీరసంతో బాధలు

ఓ వైపు వైరల్‌, మరోపక్క డెంగీ

చల్లావారిగూడెం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో జ్వరాల విజృంభణ

జంగారెడ్డిగూడెం, సెప్టెంబరు 22 : జిల్లాలో కొద్ది రోజులుగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. మొన్న కుక్కునూరు మండలంలో ప్రజలు పడకేయగా, తాజాగా అన్ని ప్రాంతాల్లోనూ దీని తీవ్ర పెరుగుతోంది. ప్రతి ఊరిలోనూ జ్వర పీడితులు వణికిపోతున్నారు. దగ్గు, రొంప, ఒళ్లు నొప్పులు, తలపోటుతో అవస్థలు పడుతున్నారు. ఒకపక్క వర్షాకాలం మరోపక్క పారిశుధ్యం లోపం వెరసి దోమల మోత మోగిపోతోంది. గడచిన పది రోజులుగా జిల్లాలో జ్వరపీడితుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వైరల్‌ ఫీవర్‌లతో పాటు టైఫాయిడ్‌, డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. గత ఆగస్టులో మలేరియా విజృంభిస్తే ఈనెలలో డెంగీ జ్వరాలు అధికంగా నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా డెంగీ జ్వరాలు పెరిగితే ఏజెన్సీ, మెట్ట ప్రాంతంలో వైరల్‌ ఫీవర్‌లు విజృంభిస్తున్నాయి. వారం రోజులుకు జ్వరతీవ్రత తగ్గినప్పటికీ ఒంటినొప్పులు, నీరసంతో ఏ పని చేయలేకపోతున్నారు.

ఈ నెలలోనే 51 డెంగీ కేసులు..

జిల్లావ్యాప్తంగా ఈ నెలలోనే ప్రభుత్వ లెక్కల ప్రకారం 51 డెంగీ కేసులు నమోదు కాగా వాస్తవానికి దీనికి రెట్టింపు స్థాయిలో కేసులు ఉన్నాయి. తీవ్ర జ్వరం వచ్చిన వారు కొంతమంది ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్తే మరికొంత మంది ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తున్నారు. ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు ప్రాంతాల నుంచి తెలంగాణలోని అశ్వారావుపేట తదితర ప్రాంతాల్లోని ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తు న్నారు. ఈ నెలలో మలేరియా జ్వరాలు తగ్గుముఖం పట్టి కేవలం జిల్లాలో ఏడు కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇక వైరల్‌ ఫీవర్ల సంగతి చెప్పనక్కర్లేదు. ప్రతీ ఇంట్లో ఒక్కో కేసు నమోదు అవుతోంది. జ్వరం వచ్చి తగ్గిన పది రోజులకు కూడా నీరసం, ఒంటి నొప్పులతో మంచంపైనే ఉంటున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 150 మలేరియా కేసులు నమోదు కాగా వాటిలో 128 కేసులు ఏజెన్సీలోనే నమోదయ్యాయి. ఇప్పటి వరకు జిల్లాలో 113 డెంగీ కేసులు నమోదు కాగా వాటిలో ఏజెన్సీలో మూడు కేసులు, మిగిలిన ప్రాంతంలో 110 కేసులు నమోదయ్యాయి.

ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీపై జ్వరాల దాడి..

జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి పంచాయతీ చల్లావారిగూడెంలో సుమారు 550 నిర్వా సిత కుటుంబాలు జీవిస్తున్నారు. ఈ కాలనీలో పదిహేను రోజులుగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. వీరికి ఇక్కడ ఇళ్లకు నిర్మించారే తప్పా ఆస్పత్రి సదుపాయం లేక జ్వరపీడితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏ చిన్న జ్వరం వచ్చినా రెండు కిలోమీటర్ల దూరంలోని తాడువాయి వెళ్లాలి. కాలనీ నుంచి సరైన రహదారి కానీ రవాణా సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జంగారెడ్డిగూడెం వెళ్లి రావడానికి ఆటోకి రూ.1000 కిరాయి ఇవ్వాల్సి వస్తోందని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి దాదాపు ఐదుగురు ఆర్‌ఎంపీలు ప్రతీ రోజు వచ్చి వీరికి చికిత్స అందిస్తున్నారు. రక్త పరీక్షల పేరిట దాదాపు రూ.1200 వసూలు చేస్తున్నారని అదే ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితమే కదా అని కాలనీ వాసులు వాపోతున్నారు.

లోపించిన పారిశుధ్యం

దోమలు వృద్ధి చెందడానికి పరిసరాల అపరిశుభ్రమే కారణమని వైద్యులు చెబుతున్నారు. కానీ వాస్తవానికి చూస్తే పల్లెలు, పట్టణాల్లో పారిశుధ్యం లోపించింది. ఏజెన్సీలో డ్రెయినేజీ వ్యవస్థలు లేకపోవడం, పంచాయతీలకు ఆదాయం తక్కువగా ఉండడం వల్ల అక్కడ పారిశుధ్య పనులు అంతంత మాత్రంగానే సాగిస్తున్నారు. పట్టణాల విషయానికొస్తే ఇళ్ల మధ్యలో ఖాళీ స్థలాలను దోమలు స్థిర నివాసాలుగా ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఏళ్ల పాటు అక్కడే మురుగునిల్వ ఉండడంతో దోమలు పెరిగి పందులు అక్కడే దొర్లడంతో వ్యాధులు ప్రబలుతున్నాయిన పట్టణ ప్రజలు వాపోతున్నారు.

నీరసం, ఒంటి నొప్పులు తగ్గడం లేదు..

జ్వరం వచ్చి ఐదు రోజులు అవుతుంది. జ్వరం వచ్చిన తొలిరోజు తాడువాయి గ్రామం వెళ్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందాను. ప్రస్తుతం జ్వరం తగ్గిన నీరసం, ఒంటి నొప్పులు మాత్రం తగ్గలేదు.

– బుడిపుటి ప్రగతి,చల్లావారిగూడెం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ

సంవత్సరం మలేరియా డెంగీ

2019 143 368

2020 131 65

2021 79 284

2022 70 345

2023 150 51

Updated Date - 2023-09-23T00:28:56+05:30 IST