జిల్లాలో కరోనా భయం
ABN , Publish Date - Dec 31 , 2023 | 01:29 AM
జిల్లాలో కరోనా వేరియంట్ జెఎన్–1 ప్రాఽథమిక లక్షణాలైన జలుబు, తలపోటు, ముక్కుకారడం, జ్వరంతో ఇబ్బంది పడే వారి సంఖ్య పెరగడంతో వైద్యశాఖ అప్రమత్తం అయింది.
భీమవరం, డిసెంబరు 30 : జిల్లాలో కరోనా వేరియంట్ జెఎన్–1 ప్రాఽథమిక లక్షణాలైన జలుబు, తలపోటు, ముక్కుకారడం, జ్వరంతో ఇబ్బంది పడే వారి సంఖ్య పెరగడంతో వైద్యశాఖ అప్రమత్తం అయింది. జిల్లాలోని 34 పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉంచిన కిట్లతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా కేసులు నమోదవుతున్నట్టు పుకార్లు వస్తుంటే వైద్యశాఖ అటువంటి కేసులు రాలేదని, అయినప్పటీకీ తమ శాఖ అప్రమత్తంగా ఉన్నట్టు వైద్యాధికారులు చెబుతున్నారు. జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులు వంటి లక్షణాలు ఉన్నవారు వైద్యుల వద్దకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. ప్రతీరోజు వందలాదిమంది జనరల్ ఫిజీషియన్ వద్దకు వెళ్లి వైద్య సేవలు పొందుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స కోసం వారి సంఖ్య పెరిగింది. ఇదిలా ఉండగా ఏలూరు జిల్లాకేంద్రలో కేసులు పెరుగు తున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ మరింత అప్రమత్తం చేస్తున్నారు. రెండు జిల్లాలకు నిత్యం రాకపోకలు సాగిస్తారు. దీంతో అటువంటి లక్షణాలు ఉన్నవారు ఆందోళన చెందుతున్నారు. ఇది ప్రాణాపాయకరమైన వైరస్ కాదని వైద్యశాఖ పదేపదే చెప్పడం వల్ల ఆ లక్షణాలు ఉన్నవారు కొంత ధైర్యంగా ఉంటున్నారు. మరో వైపు వైద్య సిబ్బంది గ్రామీణస్థాయి వరకు ఇంటింటి సర్వే ముమ్మరం చేశారు.