లింక్‌ తెరిస్తే ఖాతా గల్లంతే

ABN , First Publish Date - 2023-03-28T00:41:59+05:30 IST

అపరిచితుల నుంచి వచ్చే లింకులకు స్పందిస్తే మీ బ్యాంక్‌ ఖాతా ఖాళీ అవుతుందని జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌ అన్నారు.

లింక్‌ తెరిస్తే ఖాతా గల్లంతే
బాధితుల గోడు వింటున్న ఎస్పీ

భీమవరం క్రైం, మార్చి 27 : అపరిచితుల నుంచి వచ్చే లింకులకు స్పందిస్తే మీ బ్యాంక్‌ ఖాతా ఖాళీ అవుతుందని జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌ అన్నారు. భీమవరం సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందనలో ఫిర్యాదులు స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదులను గడువులోగా త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. అమెజాన్‌, ఫ్లిప్‌కార్డు తదితర సంస్ధలలో బహుమతులు వచ్చాయని వచ్చే మేసేజ్‌లు పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓటీపీ నెంబర్‌ ఎట్టిపరిస్థితుల్లో చెప్పకూడదని చెబితే సైబర్‌ నేరగాళ్లు మీ బ్యాంకు అకౌంట్లో ఉన్న డబ్బులు ఖాళీ చేస్తారన్నారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఎస్పీని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. మొత్తం 16 ఫిర్యాదులు అందాయి. ఎక్కువగా వరకట్నం వేధింపులు, సరిహద్దు తగాదాలు, సివిల్‌ వివాదాలపై ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.

తన భర్తతో గొడవలు ఉన్నాయని విడాకుల కేసు కోర్టులో ఉందని ఆ కేసు వాయిదాలకి వచ్చినప్పుడు తన భర్త కొట్టి బెదిరించాడని దానిపై చర్యలు తీసుకోవాలని పాలకోడేరు గ్రామానికి చెందిన ఒక వివాహిత కోరింది.

తమ గ్రామంలో ఒక వ్యక్తి చీటీలు కట్టించుకుని ఆ డబ్బులు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నాడని న్యాయం చేయాలని ఉండి గ్రామానికి చెందిన ఒక మహిళ ఫిర్యాదు చేసింది.

తన భర్తకి తనకు గొడవలు అవుతున్నాయని తన భర్త అత్తమామలు కట్నం కోసం వేధిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని పాలకోడేరు మం డలం నుంచి వచ్చిన మహిళ ఫిర్యాదు చేసింది.

తన కుమారుడికి గవర్నమెంట్‌ ఆసుపత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానని ఒక వ్యక్తి డబ్బులు తీసుకున్నాడని ఉద్యోగం ఇప్పంచలేదని డబ్బులు అడుగుతుంటే ఇవ్వట్లేదని న్యాయం చేయాలంటూ పాలకొల్లుకి చెందిన మహిళ ఎస్పీని కోరింది.

స్పందన అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలి : డీఆర్వో

భీమవరం టౌన్‌, మార్చి 27 : స్పందనలో వచ్చిన ప్రతీ దరఖాస్తు బాధ్యతతో పరిశీలించి పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.కృష్ణవేణి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరు కార్యాలయంలో నిర్వహించిన జిల్లాస్థాయి స్పందనలో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ స్పందనలో అందిన వినతుల పరిష్కారం అర్జీదారులు సంతృప్తి కలిగించేలా ఉండాలన్నారు. ఒకే సమస్యపై రెండోసారి ఫిర్యాదు రాకుండా అర్జీలు రీఓపెన్‌ అయ్యే అవకాశం లేకుండా శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. 162 దరఖాస్తులు వచ్చాయని వీటన్నిటిని త్వరితగతిన పరిష్కరించాలన్నారు. డీపీవో నాగలత, డీఎల్‌డీవో అప్పారావు, డీఎస్పీ శ్రీనాఽథ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-28T00:41:59+05:30 IST