Share News

పేలుతున్న ధరలు

ABN , First Publish Date - 2023-11-10T00:06:06+05:30 IST

టపాసుల ధరలు పేలిపోతున్నాయి. గతేడాదితో పొలిస్తే అన్ని ధరలు 20 నుంచి 30 శాతం వరకు పెరిగాయి. ఏది కొందామన్న రూ.100పైనే ఉంది. రూ.1000 తీసుకెళ్లితే చిన్న క్యారీ బ్యాగ్‌ కూడా నిండడం లేదు. దుకాణాలకు వెళ్లితే ధరలు చూసి చెమటలు పడుతున్నాయి. అగ్గిపెట్టె నుంచి థౌజండ్‌ వాలా వరకు అన్ని ధరలు పేలుతున్నాయి.

పేలుతున్న ధరలు

బాణసంచా సరుకులు కొనాలంటే చుక్కలు

గత ఏడాదితో పోలిస్తే 20 శాతం పెరుగుదల

ఏది కొందామన్నా రూ.100 పైనే

నరసాపురం, నవంబరు 8: టపాసుల ధరలు పేలిపోతున్నాయి. గతేడాదితో పొలిస్తే అన్ని ధరలు 20 నుంచి 30 శాతం వరకు పెరిగాయి. ఏది కొందామన్న రూ.100పైనే ఉంది. రూ.1000 తీసుకెళ్లితే చిన్న క్యారీ బ్యాగ్‌ కూడా నిండడం లేదు. దుకాణాలకు వెళ్లితే ధరలు చూసి చెమటలు పడుతున్నాయి. అగ్గిపెట్టె నుంచి థౌజండ్‌ వాలా వరకు అన్ని ధరలు పేలుతున్నాయి. ల్యాబర్‌, ట్రాన్స్‌పోర్టు, పన్నులు, దుకాణ అద్దెలు, కెమికల్స్‌ ధరల పెరుగుదల టపాసులపై పడిందని, ఆందుకే ధరలు పెరిగాయని వ్యాపారులు చెప్పుతున్నారు. అయితే ప్రస్తుతం లెసెన్స్‌ దుకాణాల్లోనే విక్రయాలు సాగుతున్నాయి. ఇంకా తాత్కాలిక లెసెన్స్‌తో గ్రామాలు, పట్టణాల్లో అమ్మే దుకాణాలు పెట్టలేదు. ఈ వ్యాపారులంతా హోల్‌సేల్‌ దుకాణదారుల నుంచి కొనుగోలు చేసి దుకాణాలు వేసి అమ్ముతుంటారు. ఈ కారణంగా ఇక్కడ ధరలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది. ప్రస్తుతం హోల్‌ సేల్‌ వ్యాపారుల వద్దే ధరలు పేలుతుండటంతో సామాన్య, మఽధ్య తరగతి ప్రజలు టపాసులు కాల్చాగలమా ?అన్న సందేహంలో పడ్డారు.

జిల్లాలో కోట్లలో వ్యాపారం

జిల్లాలో దీపావళి పండుగ చాలా ఘనంగా జరుపుకుంటారు. ప్రతి ఇంట్లో ఏదో బాణసంచా మోత వినిపిస్తుంది. డబ్బులు లేకపోయినా అప్పు చేసి పండుగ జరుపుకుంటారు. ఈ కారణంగా వ్యాపారం ప్రతి ఏటా కోట్లలో జరుగుతుంది. జిల్లాలో లైసెన్స్‌ దుకాణాలు అత్యధికంగా భీమవరం, పాలకొల్లు, తాడేపల్లి గూడెం, తణుకు, దువ్వ నరసాపురం ప్రాంతాల్లో ఉన్నాయి. ఇవి కాకుండా పండుగ మూడు రోజులు తాత్కాలిక లైసెన్స్‌ పొంది ఏర్పాటు చేసే సంఖ్య కూడా ఎక్కువుగా ఉంటుంది. ఈ కారణంగా వ్యాపారం కూడా పెద్ద మొత్తంలో జరుగుతుంది. కొవిడ్‌ కారణంగా రెండేళ్లు జిల్లాలో దీపావళి పండుగ పెద్దగా జరగలేదు. గతేడాది దుకాణాల్లో సరుకు లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈసారి కూడా డిమాండ్‌ ఇదే విధంగా ఉంటుందని భావించి వ్యాపారులు పెద్ద ఎత్తున స్టాక్‌ పెట్టారు. వాతావరణం కూడా అనుకూలంగా ఉండటంతో మూడు రోజుల నుంచి జోరుగానే వ్యాపారం సాగుతుంది.

ధరలు ఇలా..,.

దీపావళిలో ఎక్కువుగా పిల్లలు ఇష్టపడి కాల్చే కాకరపువ్వొత్తులు సాదా బాక్స్‌ ధర మంచి కంపెనీ అయితే రూ.90 నుంచి రూ.110 ఉంది. గత ఏడాది రూ.60 నుంచి 70 ఉండేది. చిచ్చుబుడ్డులు చిన్నవి పది ఉండే చిన్న బాక్స్‌ రూ.60 నుంచి 80 ఉంది. గతేడాది రూ.40 నుంచి 60 మధ్య ఉండేది. అదే పెద్దవి అయితే మంచి కంపెనీ రూ.300 వరకు పలుకుతుంది. తాళ్లు చిన్న పెట్టె రూ.40, పెద్దవి రూ.80, సీమటపాసులు చిన్నది బాక్స్‌ రూ.50 పలుకుతోంది. భూ చక్రాలు గతేడాది రూ.70 నుంచి రూ.80 ఉండేది. ఇప్పుడు రూ.100 నుంచి రూ.120 దాకా ఉంది. 5000 వాలా బాంబు దండ గతంలో రూ.1200 నుంచి రూ.1300 ఉండేది. ఇప్పుడది రూ.1500 నుంచి రూ 1800 పలుకుతోంది. 1000 వాలా మంచి రకం గతంలో రూ.2 వేలు ఉండేది. ఇప్పుడు రూ.2500 ఉంది. ఇందులో సాదా రకం రూ.1800 ఉంది. ఇలా అన్ని రకాల ధరలు 20 నుంచి 30 శాతం వరకు పెరిగాయి.

ధరలు స్వల్పంగా పెరిగాయి

– యర్రంశెట్టి మోహన్‌రావు, లైసెన్స్‌డ్‌ వ్యాపారి, నరసాపురం

గత ఏడాదితో పోలిస్తే ధరలు స్వల్పంగా పెరిగాయి. కెమికల్స్‌, ట్రాన్స్‌పోర్టు, అద్దెలు, కూలీల ఖర్చులు పెరగడంతో తయారీలోనే ప్రభావం కనిపించింది. కొన్ని వస్తువుల ధరలు స్వల్పంగా పెరిగితే మరికొన్ని రకాల ధరలు 10 నుంచి 20 శాతం పెరిగాయి. విక్రయాలు పూర్తిగా వాతావరణం మీదే ఆధారపడి ఉంటాయి. అనుకూలంగా ఉంటే పూర్తిగా సేల్‌ అవుతాయి.

Updated Date - 2023-11-10T00:06:08+05:30 IST