ఉరుకులు.. పరుగులు
ABN , First Publish Date - 2023-12-04T00:27:25+05:30 IST
తుఫాన్ గండంతో రైతులు పరుగులు పెడుతున్నారు. జిల్లాలో పలుచోట్ల వరి కోత దశలో ఉండగా పలుచోట్ల చేలలో పనలు, కల్లాల్లో ధాన్యం రాశులు ఉన్నాయి.
కోతలు, చేలో పనలు.. మరికొన్ని చోట్ల ధాన్యం రాశులు
తుఫాన్‌తో వరి రైతులు కలవరం
దెందులూరు / పెదపాడు / లింగపాలెం / జీలుగుమిల్లి, డిసెంబరు 3: తుఫాన్ గండంతో రైతులు పరుగులు పెడుతున్నారు. జిల్లాలో పలుచోట్ల వరి కోత దశలో ఉండగా పలుచోట్ల చేలలో పనలు, కల్లాల్లో ధాన్యం రాశులు ఉన్నాయి. పంట చేతికి వచ్చే దశలో తుఫాన్ తరుముకు రావడంతో ధాన్యం గట్టెక్కించడానికి కంగారు పడుతున్నారు. రైతుల కంగారుతో కూలి ధర ఒక్క సారిగా రూ.400 నుంచి రూ.1200 అయింది. దెందులూరు మండలంలో సుమారు 7 వేల హెక్టార్లలో వరి సాగు చేశారు. ఇప్పటి వరకు 5 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. వాతావరణం మారడంతో ఆదివారం ఒక్కరోజే ఒక టన్ను ధాన్యం కొనుగోలు చేశారు. తేమశాతం 17 లోపు ఉంటే కొనుగోలు చేస్తున్నారు. దీంతో కోత కోసి నాలుగురోజులైనా 4 టన్నుల ధాన్యం రోడ్లపై, కల్లాల్లో ఉంది. ప్రభుత్వం తేమ శాతం నిబంధన మార్పు చేసి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
పెదపాడు మండలంలో యంత్రాల సాయంతో కోత, మాసూలు చేస్తు న్నారు. మరికొన్ని చోట్ల ధాన్యం బస్తాలను భద్రపర్చుకునే పనిలో కొంత మంది రైతులు తలమునకలవుతున్నారు. పొలాలు, గట్లు, రోడ్ల వెంబడి ధాన్యపు బస్తాలను, వరికుప్పలను వర్షం నుంచి కాపాడుకునేందుకు పరాదా లను కప్పుతున్నారు. పంట రక్షణ చర్యలను ఏవో ప్రదీప్‌కుమార్ రైతులకు తెలియజేశారు. క్షేత్రస్థాయిలో సిబ్బందితో పర్యటించి రైతులకు సూచనలు అందజేశారు. ఆర్బీకే సిబ్బంది పాల్గొన్నారు.
లింగపాలెం మండలంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏవో మురళీకృష్ణ సూచించారు. మండలంలో పలుచోట్ల వరి కోతలు జరుగుతున్నాయని, మొక్కజొన్న, ఇతర పంటలు వేస్తున్న రైతులు తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నారు. ఇప్పటివరకు వర్షాభావ పరిస్థి తులతో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పండించిన పంటలను రైతులు తుఫాను వల్ల నష్టపోకుండా తిప్పలుపడుతున్నారు. వరి పనులు చేలల్లో ఉంటే వాటిని కట్టలుగా కట్టి కుప్పలు వేసుకోవాలని ఏవో సూచించారు.
జీలుగుమిల్లి మండలంలో వరి, వేరుశనగ పంట పాడవకుండా రైతులు మాసూళ్ల పనిలో పడ్డారు. మండలంలో సుమారు 2430 ఎకరాల్లో వరి, 3600 ఎకరాలు వేరుశనగ, పొగాకు, మిర్చి సాగవుతున్నాయి. తుఫాన్ ఉధృతమైతే వరి, వేరుశనగ పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు భయపడుతున్నారు. వేరుశనగ పంట సమయానికి తీయకపోతే భూమిలోనే మొలకలు వస్తాయని పి.అంకంపాలెం, రాచన్నగూడెం రైతులు చెబుతున్నా రు. మరో వైపు ట్రాక్టర్లు, టార్బలిన్‌లు అందుబాటులో ఉంచి వాతావరణ పరిస్థితుల నుంచి పంటను దక్కించుకునే ప్రయత్నంలో ఉన్నారు. కూలీలకు డిమాండ్ ఉండటంతో కొందరు రైతులు తెలంగాణ నుంచి ఆటోల్లో కూలీలను తీసుకువచ్చి పనులు చేయిస్తున్నట్లు చెబుతున్నారు. మిర్చి పొగాకు పంటలకు వాతావరణంలో నెలకొన్న మబ్బులు చలి గాలుల రావడంతో చీడపీడలు ఆశించకుండా పంటలకు పిచికారీ పనుల్ని ముమ్మురం చేశారు. ములగలం పల్లి, జీలుగుమిల్లి సొసైటీల్లో ఆర్‌బీకెల ద్వారా ధాన్యం కొనుగోలు జరుగుతున్నట్లు ఏవో కె.గంగాధరం తెలిపారు. ప్రస్తుతం వరి కోతలు నిలుపుదల చేయాలని రైతులకు సూచించామన్నారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం వరి రకం 1001 తప్ప ఇతర రకాలు కొనుగోలు చేస్తున్నామన్నారు.