మొండి బకాయిలపై మౌనమేల ?

ABN , First Publish Date - 2023-09-26T00:25:10+05:30 IST

పురపాలక సంఘాల్లోని పనితీరును కంప్ర్టోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) ఎండగట్టింది. రాష్ట్రంలో ఎంపిక చేసిన 20 నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలను పరిశీలించింది. స్థానిక సంస్థలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, విధులు మొదలుకొని అమలు తీరుపై సునిశితంగా సమీక్షించింది.

మొండి బకాయిలపై మౌనమేల ?

పేరుకుపోయిన బకాయిలు

ఓసీలు ఇవ్వడంలో వైఫల్యం

నీటి సరఫరాలోనూ వైఫల్యంపై అసంతృప్తి

తణుకులో పరిస్థితిపై ఎండగట్టిన కాగ్‌

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

పురపాలక సంఘాల్లోని పనితీరును కంప్ర్టోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) ఎండగట్టింది. రాష్ట్రంలో ఎంపిక చేసిన 20 నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలను పరిశీలించింది. స్థానిక సంస్థలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, విధులు మొదలుకొని అమలు తీరుపై సునిశితంగా సమీక్షించింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు నగర పాలక సంస్థ, తణుకు పురపాలక సంఘాల్లో ఆడిట్‌ నిర్వహించింది. తణుకు పట్టణంలోని ఆస్తి పన్నుల వసూళ్లు విషయంలో గడిచిన మూడేళ్లలో రూ1.70 కోట్లు మొండి బకాయిలున్నట్టు కాగ్‌ గుర్తించింది. అలాగే 2019 ఎన్నికల ముందు తర్వాత ఆగిన, జరిగిన పన్నులు వసూళ్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం వద్ద సమాధానాలు లేకపోవడాన్ని కాగ్‌ ఏకరువు పెట్టింది. పశ్చిమగోదావరి జిల్లాలో తణుకు పురపాలక సంఘంలో ఆస్తిపన్ను విషయంలో మొండి బకాయిలను కాగ్‌ ఆడిట్‌ ఎత్తి చూపింది. తణుకు మున్సిపాలిటీ సరైన చర్యలు తీసుకోలేకపోయిందని స్పష్టం చేసింది. మూడేళ్లలోనే దాదాపు రూ1.70 కోట్లు మొండి బకాయిలున్నట్టు కాగ్‌ గుర్తించింది. బకాయిదారులకు నోటీసులు జారీచేసి చట్టపరమైన చర్యలు తీసు కోవాల్సిన బాధ్యత మున్సిపాలిటీపై ఉంది. అది సక్రమంగా నిర్వర్తించకపోవడం వల్లే బకాయిలు పేరుకు పోయాయని మొండి బకాయిలు వసూలు చేయలేక మాఫీ చేసిన విషయాన్ని కాగ్‌ ప్రస్తావించింది. బకాయిపడ్డ ఆస్తిపన్నులో రూ. 81 లక్షలు మాఫీ చేశారు. మిగిలిన రూ. 90 లక్షలు వసూలు చేయడంలో అధికారులు విఫలమయ్యారు.

అనుమతులు సరే.. ఆక్యుపెన్సీ ఏదీ

భవన నిర్మాణాల అనుమతులు, అమలు తీరులోనూ మున్సిపాలిటీల డొల్లతనాన్ని కాగ్‌ బట్టబయలు చేసింది. తణుకు మున్సిపాలిటీ కూడా ఆ జాబితాలో ఉంది. తణుకు మున్సిపాలిటీలో ఓ ఆర్థిక సంవ త్సరంలో 369 నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేశారు. అందులో కేవలం 12 భవన నిర్మాణాలకు మాత్రమే ఆక్యుపెన్సీ సర్టిఫకెట్‌లు జారీచేశారు. అంటే మిగిలిన నిర్మాణాల్లో అతిక్రమణలు జరిగినట్టే లెక్క. అప్పుడే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు (ఓసీ) జారీ చేయలేదు. అనుమతులకు అనుగుణంగా నిర్మాణాలు చేపడితేనే ఓసీలు మంజూరు చేసేందుకు అవకాశం ఉంటుంది. అతిక్రమణలను అరికట్టడంలో అధికారులు వైఫల్యం చెందడం వల్లే ఓసీలు ఇవ్వలేకపోయారు. మరోవైపు భవన నిర్మాణాల విషయంలో అతిక్రమణలకు పాల్పడితే మున్సిపాలిటీ జరిమానా విధించి క్రమబద్ధీకరించేలా ప్రభుత్వం గతంలో ఆదేశాలు జారీచేసింది. అందులో తణుకు మున్సిపాలిటీ పలు దరఖాస్తులను పరిష్కరించింది. సుమారు రూ.4.86 కోట్లు ఆదాయం లభించింది. ఆ మొత్తం డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ వద్ద ఉండిపోయింది. ఆ నిధులు రాబట్టడంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు విఫలమయ్యారు.

నీటి సరఫరాలో వైఫల్యం

ఆర్థిక సంఘం నిబంధనలకు అనుగుణంగా పట్టణాల్లో వంద శాతం కుళాయి కనెక్షన్‌లు మంజూరు చేయాలి. భారత ప్రభుత్వం అమలు చేసిన 13, 14 ఆర్థిక సంఘాల నిబంధనలు ఇవే చెపుతున్నాయి.నిధులు వెచ్చించినా సరే కుళాయి కనెక్షన్‌లు మాత్రం పూర్తిస్థాయిలో ఇవ్వలేక పోయారు. అన్ని మున్సిపాలిటీలు ఇదే పరిస్థితిలో ఉన్నాయి. తణుకులో 24,408 కుటుంబాలు ఉన్నట్టు కాగ్‌ గుర్తించింది. అయితే 5,171 కుటుంబాలకు మాత్రమే కుళాయి కనెక్షన్‌లు మంజూరు చేసినట్టు నిర్ధారించింది. అంటే 21.19 శాతం మాత్రమే పూర్తి చేశారు. మరో 78.81 శాతం పెండింగ్‌లో ఉన్నట్టు వేలెత్తి చూపింది. మరోవైపు సుందరీకరణ, హరిత వనాల అభివృద్ధిలోనూ మునిసిపాలిటీ వెనుకపడిందని పరోక్షంగా ప్రస్తావించింది. ప్రభుత్వ పరంగా తణుకు మున్సి పాలిటీకి పెద్దగా గ్రాంట్‌లు మంజూరు కాలేదు. సొంత ఆదాయం పైనే ఆధారపడుతోంది. దాదాపు 70 శాతం సొంత నిధులతోనే అభివృద్ధి జరుగుతోంది. ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్‌లు తక్కువగా ఉన్నట్టు కాగ్‌ ప్రస్తావించింది. తణుకు మున్సిపాలిటీలో గ్రామాల విలీన విషయంలో న్యాయపరమైన చిక్కులను కాగ్‌ నివేదికలో పొందుపరిచింది.నాలుగు గ్రామాల్లో వార్డుల విభజన చేయడమే కాకుండా, అభివృద్ధి పనులను కూడా మున్సిపాలిటీ చేపడుతోందని గుర్తించింది. న్యాయస్థానంలో సమస్య ఉన్నాసరే మున్సిపాలిటీ గ్రామాల్లో జోక్యం చేసుకుంటున్నట్టు గుర్తించామని నివేదికలో స్పష్టం చేసింది.

Updated Date - 2023-09-26T00:25:10+05:30 IST