సీఎం గారూ.. చింతలపూడి పూర్తిచేయరూ..

ABN , First Publish Date - 2023-03-19T00:37:07+05:30 IST

మహారాజశ్రీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహనరెడ్డి గారికి చింతలపూడి ఎత్తిపోతల పథకం ఆయకట్టు రైతుల విన్నపం. అయ్యా...

సీఎం గారూ.. చింతలపూడి పూర్తిచేయరూ..
చాట్రాయి మండలంలో చింతలపూడి కాలువ

మహారాజశ్రీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహనరెడ్డి గారికి చింతలపూడి ఎత్తిపోతల పథకం ఆయకట్టు రైతుల విన్నపం. అయ్యా... మీ నాన్న గారు వైయస్‌ రాజశేఖరరెడ్డి గారి హయాంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్‌–1 నిర్మాణ పనులు ప్రారంభించి కొంత వరకు పూర్తి చేశారు. రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ హయాంలో ఫేజ్‌–2 కూడా రూపకల్పన చేసి రూ. 4909 కోట్లు కేటాయించి 2 ఫేజ్‌లు కలిపి సుమారు 60 శాతం పనులు పూర్తిచేశారు. మీరు అధికారంలోకి వచ్చాక పనులు ఆగిపోయాయి. నాలుగేళ్లుగా పనులు జరగపోవటంతో మేము ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నాం. రాష్ట్ర విభజన తరువాత నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ ద్వారా తెలంగాణ దాటి ఆంధ్రాకు నీరు విడుదల కష్టతరం కావటంతో చింతపూడి ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలు వచ్చి మా భూములు సస్యశ్యామలం అవుతాయని కొండంత ఆశతో ఉన్నాం. బడ్జెట్‌లో ఈ పథకానికి రూ. 279 కోట్లు కేటాయించటంతో మాలో కొత్త ఆశలు చిగురించాయి. వెంటనే పనులు ప్రారంభించటానికి అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని వేడుకొంటున్నాం. ఈ పథకం పూర్తయితే గోపాలపురం, పోలవరం, చింతలపూడి, దెందులూరు, నూజివీడు, ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు, మైలవరం, గన్నవరం, నందిగామ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందటంతో పాటు కొన్ని వందల గ్రామాలకు తాగునీరు అందుతుంది. కనుక దయతో చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించి, ఉపయోగంలోకి తేవటానికి చర్యలు తీసుకోవాలని ప్రార్థిస్తున్నాం. ఇట్లు చింతలపూడి ఎత్తిపోతల పథకం ఆయకట్టు రైతులు.

–చాట్రాయి

Updated Date - 2023-03-19T00:37:07+05:30 IST