చింతతీర్చేదెవరు?
ABN , First Publish Date - 2023-03-03T00:24:06+05:30 IST
చింతలపూడి.. పేరుకే నగర పంచాయతీ. కాని, ఎలాంటి అభివృద్ధి లేదు.
నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ అయ్యి రెండేళ్లు
అయినా చింతలపూడికి వీడని సమస్యలు
చింతలపూడి.. పేరుకే నగర పంచాయతీ. కాని, ఎలాంటి అభివృద్ధి లేదు. సకాలంలో మంచినీళ్లు అందవు. సెంట్రల్ లైటింగ్ వెలగవు. ప్రధాన వీధుల్లో రోడ్లు అధ్వానం. డ్రెయినేజీ వ్యవస్థ లేదు. మురుగునీటితో దోమల బెడద, దుర్వాసన. పారిశుధ్యం అధ్వానం. పొరుగు గ్రామాల నుంచి వచ్చే ప్రజలకు కనీసం వాష్‌రూమ్స్ కాని, సాయంత్రం వేళ పార్కులో సేద తీరే పరిస్థితులు కాని ఏమీ లేవు. ఇది చింతలపూడి దీన స్థితి.
చింతలపూడి, మార్చి 2 : ఉమ్మడి పశ్చిమ గోదావరిలో 2020 డిసెంబ రు 31న చింతలపూడి నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ అయ్యింది. ఇది జరిగి రెండేళ్ళవు తు న్నా ఒక్క అభివృద్ధి జరగలేదు. పన్నులు భారీ గా పెంచి ఆలస్యమైతే వడ్డీ రూపంలో అదనం గా వసూలు చేస్తున్నారు. ఏడాదికి రెండుసా ర్లు ఇంటి పన్నులు చెల్లించాలి. కుళాయి పన్ను, చెత్త పన్ను షరా మామూలే. నియోజకవర్గ కేంద్రంమైన చింతలపూడి తెలంగాణ–ఆంధ్ర సరిహద్దు కేంద్రం. ఎటు చూసినా మూడు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. దళితవాడ లు, కాలనీలలో సమస్యలు తిష్టవేసి ఉంటాయి. నగర పంచాయతీలో జనాభా 2011 లెక్కల ప్రకారం 25 వేల 952. ఓటర్లు 21 వేల 684. 20 వార్డులు, ఆదాయం కేవలం ఇంటి పన్నుల రూపేణా 2 కోట్ల 54 లక్షల 68 వేలు. సచివా లయ వ్యవస్థ వచ్చాక సిబ్బంది బాగా పెరిగా రు. సచివాలయ కార్యదర్శులు, వలంటీర్లు, కార్యాలయ సిబ్బంది, వాటర్ వర్కర్స్, పారి శుధ్య సిబ్బంది మొత్తం 266 మంది. నగర పంచాయతీలో 2 వేల 150 వీధిలైట్లున్నా 20 శాతం వెలగవు. పబ్లిక్ టాప్‌లు 900 వరకు ఉన్నాయి. 11 ఓవర్‌హెడ్ ట్యాంకుల ద్వారా మంచినీటి సరఫరా చేస్తుంటారు. అదీ రోజు విడిచి రోజు. నీటి కోసం ప్రజలకు రోజూ తిప్పలు తప్పవు. చాలా మంది టిన్నుల నీళ్లను కొనుగోలు చేస్తున్నారు.
మెయిన్‌రోడ్డుపై 2008లో కోటి రూపాయల తో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ నేటికీ వెలగడం లేదు. దీనికి అమర్చిన దీపాలను తొలగించి స్తంభాలను అలంకార ప్రాయం గా మిగిల్చారు. ముగ్గురు ఎమ్మెల్యేలు మారినా ఈ లైట్లు వెలిగించేందుకు చర్యలు తీసుకోలేదు. రాత్రి వేళ ప్రజలు, ప్రయా ణికులు ఇబ్బందులు పడుతున్నారు.
నగర పంచాయతీ ఏర్పడక ముందే అండర్ డ్రైనేజీ సిస్టం ఏర్పాటు చేసి ఉండాలి. కాని, ఇప్పటి వరకు అసలుకే డ్రైనేజీలు లేక వీధుల్లో చాలా గృహ వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. మెయిన్‌రోడ్డు మీద కొద్ది దూరం మినహా 20 వార్డులలో సరైన డ్రెయినేజీ సౌకర్యం లేదు. వర్షం వచ్చినా, ఇళ్ళల్లో మురుగు నీరైనా రోడ్లపైనే పారుతుంది.
ఇక ఏ వీధిలో చూసినా రోడ్లు సరిగా లేవు. డోర్ నెంబర్లు సక్రమంగా ఉండవు.
అక్రమ లేఅవుట్ల జోరు
ఇక్కడ అక్రమ లే అవుట్లు జోరుగా ఉన్నా యి. నగర పంచాయతీ అయిన రెండేళ్ళలోనే ఆరుచోట్ల డీటీసీపీ అనుమతి లేకుండానే లే అవుట్లు వేసి ఇళ్ల ప్లాట్లుగా విక్రయించడంతో ఇటీవల మునిసిపల్ అధికారులు లే అవుట్ లలో పాతిన ఇళ్ళ ప్లాట్ల రాళ్ళను తొలగించారు. నగర పంచాయతీలో 25 నుంచి 30 లే అవుట్ లు ఉంటాయని సమాచారం. అపార్టుమెంట్లు 15కు పైగా ఉన్నాయి. ఈ అక్రమ లే అవుట్‌లు డీటీసీపీ లేకుండా ఉన్నా పట్టించుకునే నాథుడు లేడు. ముందు ముందు ఈ లే అవుట్‌లలో గృహాలు నిర్మిస్తే సౌకర్యాలు ఏ విధంగా కల్పిస్తారనేది ప్రశ్నార్థకం.
ఇంటి పన్నులు దారుణం
ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరిగి భారమవుతుంటే ఇప్పుడు ఇంటి పన్నులు దారుణంగా పెంచారు. ఇవి సామాన్య, మధ్య తరగతి వారికి భారంగా మారింది. సకాలంలో కట్టకపోతే పెనాల్టీ, ఆన్‌లైన్ విధానమంటూ మరింత భారాన్ని పెంచారు. నగర పంచాయతీగా మారినా ఒరిగిందేమీ లేదు.
– సయ్యద్ బాబు, చింతలపూడి
అభివృద్ధి శూన్యం
చింతలపూడి నగర పంచాయతీగా అయ్యి రెండేళ్లయినా ఎలాంటి అభివృద్ధి లేదు. ఇంటి పన్ను, చెత్త పన్నంటూ పెనాల్టీతో కట్టాలని హెచ్చరిస్తున్నారు. పారి శుధ్యం బాలేదు. పబ్లిక్ టాయిలెట్స్ లేవు. రోడ్లు, కాలనీల సమస్యలు ఒక్కటి పరిష్కారం కావడం లేదు.
– తుర్లపాటి బాబు, చింతలపూడి
నిధులు మంజూరు కావాలి
చింతలపూడి నగర పంచాయతీలో ఇతర గ్రామాల నుంచి వచ్చే ప్రజలకు పాతబస్టాం డ్‌లో సులభ కాంప్లెక్స్ నిర్మాణానికి, వేగిలింగేశ్వ రస్వామి చెరువు గట్టుపై వాకింగ్ ట్రాక్ నిర్మాణా నికి చర్యలు తీసుకుంటు న్నాం. ప్రత్యేక అధికారి ఇటీవల పరిశీలించా రు. నిధులు మంజూరు కావాల్సి ఉంది.
–నల్లా రాంబాబు, చింతలపూడి కమిషనర్