కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ)ను మూసివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర..

ABN , First Publish Date - 2023-02-07T13:11:53+05:30 IST

కేంద్ర ప్రభుత్వం రైతాంగం పై కక్షకట్టినట్లుగా వ్యవహరిస్తోందని, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ని మూసివేసేందుకు కేంద్ర

కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ)ను మూసివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర..

జంగారెడ్డిగూడెం: కేంద్ర ప్రభుత్వం రైతాంగం పై కక్షకట్టినట్లుగా వ్యవహరిస్తోందని, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ని మూసివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ విమర్శించారు. జంగారెడ్డిగూడెంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో మంగళవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం ఆయన మాట్లాడారు. కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగానూ రైతులకు వ్యతిరేకంగా ఉన్న కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా ఈనెల 9న దేశవ్యాపిత పిలుపులో భాగంగా బ్లాక్ డే పాటించాలని కోరారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు సమర్పించిన బడ్జెట్ లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు భారీ ఎత్తున నిధులు తగ్గించారన్నారు. ఒకవైపు దేశవ్యాప్తంగా రైతులు, రైతు సంఘాలు మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలని, రైతులు పండించిన అన్ని పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరతుండగా, దానికి పూర్తి భిన్నంగా కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) కి కేవలం రూ లక్ష రూపాయలు మాత్రమే కేటాయించిందని ఆందోళన వ్యక్తం చేశారు.

వ్యవసాయ అనుబంధ రంగానికి గత సంవత్సరం కంటే 5శాతం రూ. 7,307 కోట్లు తక్కువ (గత సంవత్సరం రూ 1,51,521 కోట్లు కేటాయించగా ఈ సంవత్సరం రూ. 1,44,214 కోట్లు) కేటాయించారన్నారు. ఉపాధి హామీ పథకానికి 18శాతం రూ. 29,000 కోట్లు (గత సంవత్సరం రూ 89,400 కోట్లు కేటాయించగా ఈ సంవత్సరం రూ. 60,000 కోట్లు) కేటాయించారన్నారు. మార్కెట్ ఇంటర్ వెర్షన్ స్కీమ్ కు గత సంవత్సరం రూ 1,500 కోట్లు కేటాయించగా ఈ సంవత్సరం కేవలం ఒక కోటి రూపాయలు మాత్రమే కేటాయించడమే గాక ఈ పధకాన్ని రద్దు చేయనున్నట్లు ప్రతిపాదించారని చెప్పారు. ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సి ఐ) కి గత సంవత్సరం రూ. 2,87,194 కోట్లు కేటాయించగా ఈ సంవత్సరం రూ 1,97,350 కోట్లు కేటాయించారు. రూ 90,000 కోట్లు నిధులు తగ్గించారన్నారు.

ఒకవైపు రైతులు తాము పండించిన పంటలకు సరైన ధరలు దక్కక, పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక అప్పులపాలు అయి రైతులు ఆత్మహత్యలకు బలి అవుతుంటే బహిరంగ మార్కెట్ లో ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వం కాటన్ కార్పోరేషన్, ఆయిల్ ఫెడ్, ఫుడ్ కార్పోరేషన్ వంటి వివిధ సంస్థల ద్వారా జోక్యం చేసుకొని మద్దతు ధరలు కల్పించి రైతులను ఆదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోకుండా రైతులను మార్కెట్ ఒడిదుడుకులకు బలి చేసేందుకు కార్పొరేట్ కంపెనీలు యధేచ్ఛగా రైతాంగాన్ని దోపిడీ చేసుకునేందుకు వీలుగా మద్దతు ధరల వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు పూనుకోవడం అంటే ఇది రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల ప్రభుత్వంగా రుజువు చేసుకుంటున్నదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తన రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల ఆలోచనలు మార్చుకొని రైతాంగం పండించే పంటలకు మద్దతు ధరల వ్యవస్థను పటిష్టం చేసేలా కేంద్ర ప్రభుత్వపై వత్తిడి తెచ్చేందుకు రైతాంగం ఆందోళనలకు సమయత్తం కావాలని కోరారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు జిల్లా కమిటీ సభ్యులు సిరి బత్తుల సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T13:11:55+05:30 IST