కాల్ మనీ భూతం
ABN , First Publish Date - 2023-12-08T00:14:19+05:30 IST
అవసరం కోసం తీసుకున్న అప్పు సామాన్యుల మెడకు వడ్డీతో సహా ఉచ్చు బిగుస్తోంది. తీసుకున్న అప్పు కంటే వడ్డీనే ఎక్కువ అవుతోంది. అప్పు చెల్లించలేక బాధితులు ఆత్మహత్యలు చేసకుంటున్నారు.. జంగారెడ్డిగూడెంలో అక్రమ వడ్డీ వ్యాపారుల దందా జోరుగా సాగుతోంది..
జంగారెడ్డిగూడెంలో జోరుగా దందా
అసలును మించిపోతున్న వడ్డీలు
కట్టలేక బాధితుల ఆత్మహత్యలు
తేడా వస్తే కేసులు తారుమారు
జంగారెడ్డిగూడెం టౌన్, డిసెంబరు 7 :అవసరం కోసం తీసుకున్న అప్పు సామాన్యుల మెడకు వడ్డీతో సహా ఉచ్చు బిగుస్తోంది. తీసుకున్న అప్పు కంటే వడ్డీనే ఎక్కువ అవుతోంది. అప్పు చెల్లించలేక బాధితులు ఆత్మహత్యలు చేసకుంటున్నారు.. జంగారెడ్డిగూడెంలో అక్రమ వడ్డీ వ్యాపారుల దందా జోరుగా సాగుతోంది..కాల్‌మనీ భూతం సామాన్యులకు ఉరితాడు బిగిస్తుంది. వడ్డీలు, చక్రవడ్డీలు పిండేస్తూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. 2015లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కాల్‌మనీపై ఉక్కుపాదం మోపి అక్రమ వడ్డీల చెర నుంచి విముక్తి కల్పించింది.ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రజలపై విరుచుకుపడుతూ అక్రమ వడ్డీలను లాగేస్తున్నారు. సకాలంలో వడ్డీ చెల్లించకపోతే కటుంబ పరువు బజారుకు ఈడుస్తూ వీరవిహారం చేస్తున్నారు. పెద్దల సమక్షంలో సెటిల్మెంట్‌కు వెళితే అసలు కాదు..వడ్డీ చెల్లిస్తే వదిలేస్తామంటున్నారు. దీన్నిబట్టి అర్థం చేసు కోవచ్చు వడ్డీ ఎంత ఉంటుందో. అప్పుల బాధ, వడ్డీల బాదుడు భరించలేక ఎవరైనా సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడినా ఆ నోటును చిత్తుకాగితంలా పక్కన పడేసి సాధారణ ఆత్మహత్యగా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. గతేడాది ఐసీఐసీఐ బ్యాంకులో పనిచేసే సీనియర్ ఉద్యోగి మారిశెట్టి నాగరాజు కాల్‌మనీ బూతానికి బలై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వడ్డీ వ్యాపారులు పీడిస్తు న్నారంటూ 75 లక్షలకు పైగా వడ్డీ చెల్లించానంటూ నాలుగు పేజీల నోట్‌లో 11 మంది అక్రమ వడ్డీ వ్యాపారుల పేర్లు రాసి మృతిచెందాడు. ఈ ఘటన పట్టణంలో సంచలనం అయినా ఎటువంటి చర్యలు లేవు. లోన్ యాప్‌లనైతే అరికట్టగలిగారు గాని, ఊడలమర్రిలా విస్తరించిన కాల్‌మనీను అరికట్టడంలో అధికారులు విఫల మయ్యారనే విమర్శలు వినపడుతున్నాయి.
అసలు కన్నా వడ్డీ తీపి
అసలు ఎంతన్నది కాదు.. వడ్డీ ఎంత లాగేశామన్నదే ముఖ్యం. రూ.5 వడ్డీ ఇవ్వ నిదే అప్పు దొరికే పరిస్థితి లేదు. అయితే అనుకున్న తేదీ మారితే వడ్డీ రేటు మారిపోతుంది. రెండు నెలలు చెల్లించకపోతే రూ.15 నుంచి రూ.25 లకు వడ్డీ చేరు తుంది. రూ.10 వేలు అప్పు తీసుకుంటే చేతికి రూ.7 వేలు మాత్రమే ఇస్తారు. నెల రోజులకు రూ.10 వేలు చెల్లించాలి. నెలరోజల తర్వాత రూ.10 వేలు ఇవ్వని పక్షంలో మరలా నెలరోజులు గడువు ఇచ్చి రూ.15 వేలు చెల్లించాల్సిందిగా ఒప్పందం కుదుర్చుకుంటారు.
అక్రమ వడ్డీలకు అడ్డాగా జంగారెడ్డిగూడెం
జంగారెడ్డిగూడెం పట్టణంలో వడ్డీ వ్యాపారం జోరుగా సాగుతోంది. యువకులు, కాలేజీ విదార్థులు, విశ్రాంత ఉద్యోగులు సైతం అక్రమ వసూళ్ల బాటలో ఉన్నారు. ఉద్యోగం చేయడం కన్నా బెదిరించి వడ్డీలు వసూలు చేయడమే మేలని అధికశాతం మంది యువకులు అక్రమ వడ్డీలబాట పట్టారు. ఇందుకు కావాల్సింది కేవలం రూ. 50 వేల నుంచి లక్ష రూపాయల పెట్టుబడి అంతే. నలుగురు ఆకతాయి కుర్రాళ్ళు పక్కన ఉంటే చాలు వడ్డీ వసూలు చేయడం, లేదంటే కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి సెటిల్మెంట్ చేయడం. ఈ వ్యాపార సూత్రాన్ని ఒడిసిపట్టుకున్న అక్రమ వడ్డీల బ్యాచ్ అప్పులు ఇస్తాం..అంటూ రోడ్లపై వీరవిహారం చేస్తున్నారు.
చెల్లించనివారే టార్గెట్
సకాలంలో అసలు వడ్డీ ఇచ్చేస్తే ఏముంది మజా ! చెల్లించని వాళ్ళే అక్రమ వడ్డీ వసూలు దారులకు వనరులు. దుకాణాల్లో పనిచేసే యువకులు, చిరు ఉద్యోగులు, కోడిపందాల జూదరులు, క్రికెట్ బెట్టింగ్ ఆడేవారు వీరికి టార్గెట్. ఈజీ మనీకి అలవాటు పడుతున్న యువత జూదం ఉచ్చులోకి దిగుతున్నారు. పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్లు బాధితులు జూదం డబ్బులు చెల్లించేందుకు అక్రమ వడ్డీ వ్యాపారుల చేతిలో చిక్కుతున్నారు. ఇంకేముంది రూ.10 వేల అప్పు కాస్త ఆరు నెలల్లో రూ.50 వేలు అవుతుంది.
సూసైడ్ నోట్ రాసినా..
గత నెల 20వ తేదీ రాజీవ్ నగర్‌కు చెందిన కర్రి వెంకటరమణ (34) అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే మృతుడు డైరీలో అప్పులకన్నా వడ్డీల భారం భరించలేక చనిపోతున్నానని సూసైడ్ నోట్ రాసి మృతిచెందాడు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తుల వల్ల చనిపోతున్నట్లు లేఖలో పేర్కొన్నట్లు స్థానికులు, బంధువులు చెబు తున్నారు. లక్షకు రూ.5 లక్షలు వడ్డీ చెల్లించినా ఇంకా చెల్లించాలంటూ వేధిసున్నారని తనను వదిలేయని వేడుకున్నా కనికరించట్లేదని లేఖలో స్పష్టంగా వివరించినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే మరణ వాంగ్మూలానికి రేటుకట్టిన వ్యాపారులు కుటుంబ సభ్యులకు డబ్బు ఇచ్చి నోరు మూయించినట్లు తెలిసింది. చివరికది నడుము నొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్టుగా కేసు నమోదైంది.