ఏలూరు సొమ్ము.. ఎక్కడికెళ్లింది?
ABN , First Publish Date - 2023-09-26T00:38:53+05:30 IST
పురపాలక సంఘాల్లోని పనితీరును కంప్ర్టోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఎండగట్టింది.

నగరపాలక సంస్థ నిర్వహణలో లోపాలను కడిగేసిన కాగ్
వైసీపీ పాలనలో ప్రజాధనానికి లోపించిన జవాబుదారీతనం
ఈఎంసీ ఇచ్చిన ఏ రూపాయికీ ప్రభుత్వం వద్ద నో ఆన్సర్
కోట్లాది రూపాయలను ఆయా శాఖలకు బదిలీ చేయలేదు
(ఏలూరు,ఆంధ్రజ్యోతి)
పురపాలక సంఘాల్లోని పనితీరును కంప్ర్టోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఎండగట్టింది. రాష్ట్రంలో ఎంపిక చేసిన 20 నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలను పరిశీలించింది. స్థానిక సంస్థలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, విధులు మొదలుకొని అమలు తీరుపై సునిశితంగా సమీక్షించింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు నగర పాలక సంస్థ, తణుకు పురపాలక సంఘాల్లో ఆడిట్ నిర్వహిం చింది. తణుకు పట్టణంలోని ఆస్తి పన్నుల వసూళ్లు విషయంలో గడిచిన మూడేళ్లలో రూ1.70 కోట్లు మొండి బకాయిలున్నట్టు కాగ్ గుర్తించింది. అలాగే 2019 ఎన్నికల ముందు తర్వాత ఆగిన, జరిగిన పన్నులు, వసూళ్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం వద్ద సమాధానాలు లేకపోవడాన్ని కాగ్ ఏకరువు పెట్టింది.
బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం
అనధికారికంగా లేదా మంజూరైన ప్లాన్లకు భిన్నంగా నిర్మిం చిన భవనాలకు జరిమానా విధించేందుకు 2019 నాటి రాష్ట్ర ప్రభుత్వం పలు నియమాలతో కూడిన బిల్డింగ్ పీనలైజేషన్ (బీపీఎస్)ను విడుదల చేసింది. నిర్మింపజేసిన భవనాల్లోని అన్ని అంతస్తులలో నియమాలు ఉల్లంఘించి నిర్మితమైన ప్రాంతానికి జరిమానా చార్జీలను విధించింది. వీటి ప్రకారం సమర్ధ అధికారుల ఆధ్వర్యంలో వసూలు చేసిన మొత్తాన్ని ప్రత్యేక ఖాతాలో ఏదేని ఒక అధికారి నియంత్రణలో ఉంచి, నిర్వహించాలని నిర్దేశించింది. సౌకర్యాల పెరుగుదల కోసం మాత్రమే ఆ మొత్తాన్ని ఉపయో గించాలని నిబంధనల్లో పేర్కొన్నారు. వెబ్‌సైట్ పనిచేయని కారణంగా కాగ్ తనిఖీ చేసిన కొన్ని పట్టణ స్థానిక సంస్థలు బీపీఎస్ కోసం వచ్చిన దరఖాస్తుల ఖరారుకు సంబంధించి సమాచారాన్ని అందించలేదు. వెబ్‌సైట్ పనిచేయకపోవడానికి గల కారణాలను కోరినా డిప్యూటీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ శాఖ(డీటీసీపీ) తెలుపలేదని కాగ్ స్పష్టం చేసింది. అందుబాటులో ఉన్న సమాచారం నుంచి బీపీఎస్ కింద జరిమానాల చార్జీల కోసం డీటీసీపీ నుంచి రూ.74.11 కోట్లను ఏపీలోని 14 స్థానిక సంస్థల నుంచి సేకరించింది. అలా వివరాలు ఇవ్వని స్థానిక సంస్థల్లో ఏలూరు కార్పొరేషన్‌కు చెందిన నగదు ఉంది. కాగ్ తెలియజేసిన వివరాల ప్రకారం ఈఎంసీ 339 బీపీఎస్ దరఖాస్తులను పరిష్కరించగా, జమ చేసినా డీటీసీపీ వద్ద రూ.6.82 కోట్లు ఉన్నట్లు వివరిస్తోంది. అలాగే 2016–17 నుంచి 2021–22 మధ్య కాలంలో ఐఈసీ, సామర్థ్యం పెంపు కాంపొనెంట్ల కింద నిధులను పొందినా తనిఖీ చేసిన స్థానిక సంస్థల్లో ఈ కార్యకలాపాలను చేపట్ట లేదని కాగ్ వివరించింది. బదులుగా పట్టణ స్థానిక సంస్థలు సీడీఎంఏ ఆదేశాల ప్రకారం రూ.7.98 కోట్ల మేర రాష్ట్రవ్యాప్తంగా కేటాయించిన స్థానిక సంస్థలు నిధులను సీడీఎంఏకు బదిలీ చేశాయని చెబుతోంది. అందులో భాగంగా ఏలూరు నగర పాలక సంస్థ ఐఈసీ మొదలైన వాటి కోసం సీడీఎంఏకి రూ.14.18 కోట్లను బదిలీ చేసింది.
లేబర్ సెస్
భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ సెస్ చట్టం, 1996 భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు వనరులను పెంపొందించే ఉద్దేశంతో యజమానులు వెచ్చించే నిర్మాణ వ్యయంపై సెస్ విధింపు, వసూళ్లకు వీలు కల్పిస్తోంది. ఈ సెస్ నియమావళి–1998 ప్రకారం ప్రభుత్వ కార్యాలయం, స్థానిక సంస్థ లేదా సెస్ కలెక్టర్ వసూలు చేసిన సెస్ ఆదా యాన్ని ఏపీ భవన, నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు బదిలీ చేయాలి. కాగా ఎంపిక చేసిన ఏపీలోని 20 పట్టణ స్థానిక సంస్థల్లో 2016–17 నుంచి 2021–22 మధ్యలో 15 స్థాని క సంస్థలు 2022 జనవరి నాటికి వసూలు చేసిన రూ. 55.39 కోట్ల లేబర్ సెస్‌ను సంక్షేమ బోర్డుకు బదిలీ చేయలేదు. పట్ణణ స్థానిక సంస్థల వారీగా పెండింగ్‌లో ఉన్న లేబర్ సెస్ బదిలీ వివరాలను కాగ్ విడుదల చేయగా, ఇందులో ఏలూరు నగర పాలక సంస్థ విడుదల చేసిన రూ.3.91 కోట్లను ఈ ప్రభుత్వం బోర్డుకు బదిలీ చేయకుండా తమ వద్దే ఉంచుకున్నట్లు కాగ్ స్పష్టం చేసింది.
హరిత రుసుము
ఐదు వేల చదరపు అడుగులు లేదా అంతకుమించిన విస్తీర్ణంలో నిర్మింపజేసిన నిర్మాణాలకు సంబంధించి, భవన నిర్మాణ అనుమతులు జారీ చేసే సమయంలో ప్రతీ చదరపు అడుగుకు రూ.3ను హరిత రుసుము విధించి ఏకీకృత హెడ్ ఆఫ్ అకౌంట్ కింద వసూలు చేయాలని ప్రభుత్వం అన్ని పట్టణ స్థానిక సంస్థలకు ఆదేశించింది. ఈ మేరకు కాగ్ నిర్వ హించిన తనిఖీలతో భాగంగా 2018 నుంచి 2022 మధ్య కాలంలో 15 కార్పొరేషన్లను పరిశీలించింది. భవన నిర్మాణ అనుమతులను జారీ చేసే సమయంలో సంబంధిత దరఖా స్తుల నుంచి రూ.12.91 కోట్లను రాష్ట్ర వ్యాప్తంగా వసూలు చేసినట్టు కాగ్ గుర్తించింది. పట్టణ స్థానిక సంస్థలు వసూలు చేసిన హరిత రుసుము గణాంకాల్లో తేడాలను గుర్తించింది. 2022 జనవరి నాటికి ఆ పద్దులకు ఆ మొత్తాన్ని బదిలీ చేయ లేదని కనుగొంది. ఆ కార్పొరేషన్లు పంపిన మొత్తాల్లో ఏలూరు కార్పొరేషన్ నుంచి రూ.49 లక్షలు పంపినట్లు తేల్చింది.