బిల్లులతో బంతాట

ABN , First Publish Date - 2023-03-31T00:31:03+05:30 IST

ఆర్థిక సంవత్సరం ముగియడానికి కొన్ని గంటలే ఉంది. వందల కోట్ల బకాయిలకు ఎక్కడా క్లియరెన్స్‌ రాలేదు. రెండు గంటలకోసారి స్తంభిస్తున్న సర్వర్లు. బిల్లులు మంజూరులో కదలిక లేక కాంట్రాక్టర్లు, మరోవైపు ప్రభుత్వ అనుకూలురు అందరిదీ ఒకటే టెన్షన్‌.

బిల్లులతో బంతాట

చేతికిరాని వందల కోట్ల బిల్లులు

మొరాయిస్తున్న సర్వర్లతో చికాకులు

జల వనరుల్లో రూ.350 కోట్ల కరెంటు బిల్లులకు దిక్కులేదు

సొమ్ములు రాక కాంట్రాక్టర్లు ఘొల్లు

ఇప్పటికే రూ.250 కోట్ల బిల్లులతో సర్కార్‌ దోబూచులాట

ఉద్యోగులకూ తిప్పలు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి):

ఆర్థిక సంవత్సరం ముగియడానికి కొన్ని గంటలే ఉంది. వందల కోట్ల బకాయిలకు ఎక్కడా క్లియరెన్స్‌ రాలేదు. రెండు గంటలకోసారి స్తంభిస్తున్న సర్వర్లు. బిల్లులు మంజూరులో కదలిక లేక కాంట్రాక్టర్లు, మరోవైపు ప్రభుత్వ అనుకూలురు అందరిదీ ఒకటే టెన్షన్‌. ఉమ్మడి పశ్చిమలో దాదాపు రూ.1600 కోట్ల బకాయిలు ఉండగా వీటిలో 15వ ఆర్థిక సంఘం పనులకే కొంత దారి దొరికింది. మిగతావన్నీ ఎక్కడికక్కడే. ఈసారీ గల్లంతే!

ఆర్థిక సంవత్సరం ముగిసే ముందు ఎప్పుడూ తల నొప్పే. ఇన్నాళ్లు ఇస్తామని ఊరించిన బిల్లులు క్లియర్‌ కాక, అవుతాయో, లేదో తెలియక అందరిలోనూ ఒకటే గగ్గోలు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరికొద్ది గంటల గడువు మాత్రమే మిగిలి ఉంది. ఈలోపే సీఎఫ్‌ ఎంఎస్‌లో అసలు బిల్లుల కదలిక ఏంటి, ఎన్నొస్తాయి, మరెన్నిపోతాయి అని తెలుసుకోవడానికి రాత్రింబవళ్ళు పడిగాపులు. గతేడాది బడ్జెట్‌ పద్దు, కేటాయింపుల ముగింపునకు కౌంట్‌డౌన్‌ ఆరంభంకాగా అది ఇప్పుడు గంటల వ్యవధిలోకి వచ్చేసింది. ప్రస్తుత పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వ పెద్దల ద్వారా బిల్లులు సాధించేందు కు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కాంట్రా క్టర్ల బకాయిల్లో మూడొంతు లైనా సకాలంలో క్లియర్‌ చేసి ఆ తదుపరి మిగతా వాటికి పద్దు సర్దేవారు. ఈ నాలుగేళ్ల లో ఖజానా నిల్వలు తరిగిపో యినా బడ్జెట్‌ లెక్కల్లో ఆర్భా టానికి కొదవలేదు. ప్రత్యేకించి ఎన్నికల సంవత్సరం కాబట్టి ఎవరి బిల్లు పెండింగ్‌ లేకుండా ఉన్నంతలోనే అందరికీ సర్దుబాటు చేస్తారనుకున్నారు. కొంత ధైర్యం చేసి కాస్తంత పెట్టుబడి పెట్టి చేతికొచ్చిన పనులు పూర్తి చేయగలిగారు. ప్రత్యేకించి ఆర్‌అండ్‌బీ పరిధిలో దాదాపు రూ.230 కోట్లకు పైగానే పనులు సాగగా, వీటిలో ఏ ఒక్క పనికి బిల్లు మంజూరు కాలేదు. ఆర్థిక సంవత్సరం ముగిం పునకు వచ్చేసరికి ఇప్పుడు అంద రూ ఘెల్లుమంటున్నారు. తమ్మి లేరు ఏటిగట్టు పటిష్టతకు కాంక్రీట్‌ రిటర్నింగ్‌ వాల్‌కు సీఎం జగన్‌ స్వయంగా క్లియరెన్స్‌ ఇచ్చి పునాది రాయి వేశారు. పనులన్నీ చేయడా నికి అధికారులు ఉత్సాహపడ్డారు. కాంట్రాక్టర్లు తలూపారు. తీరా బిల్లులు ఇవ్వండి మహాప్రభో అనే పరిస్థితి ఎదు రైంది. వాస్తవానికి సీఎం స్థాయిలో ఏ పనికైనా క్లియరెన్స్‌ లభిస్తే ఆ పనికి ఆసాంతం ఎక్కడా నిధుల కొరత రాదు. కాని ఈ ప్రభుత్వంలో అదీ ఇదీ ఏదీ లేకుండా ఆర్థికంగా అన్నిచోట్ల పెండింగే. ప్రత్యేకించి తన హయాంలో బడుల ను తీర్చిదిద్దుతామని చెప్పి నాడు–నేడు కింద వందల కోట్లు అంకెల్లో కేటాయించారు. తీరా పనులు పూర్తయ్యే నాటికి కొన్నింటికి ఇప్పటి వరకు క్లియర్‌ కాలేదు. పనుల లక్ష్యాలు అందుకోవడానికి ఎడాపెడా వడ్డీలకు తెచ్చి పనులు కానిచ్చేశారు. ఇప్పుడు సీఎఫ్‌ఎంఎస్‌ గీత దాటు కుని ఆ డబ్బు బయట పడాలంటే సాధ్యం కావడం లేదు. రైతుభరోసా కేంద్రాలు, సచివాలయాల నిర్మా ణాలు, గొడౌన్‌ నిర్మాణాలు ఇలా ఒకటేంటి.. అన్నింటిదీ ఇదే పరిస్థితి.

ఈ ఆర్థిక సంవత్సరంలో సాగు నీటి పథకాలకు మరమ్మతులు, నిర్వహణ కింద చేపట్టిన పనులకు బిల్లులు తమకందేలా చేయాలని ఉమ్మడి పశ్చిమలో కొందరు వైసీపీ అనుకూల కాంట్రాక్టర్లంతా మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగారు. సీఎంవో అధికారులతో మాట్లాడి, ఆర్థిక శాఖను ఒప్పించి తమ బిల్లులకు మోక్షం కలిగించాల ని వేడుకున్నా దిక్కూ మొక్కూ లేదు. ఇలా రావాల్సిన మొత్తం రూ.280 కోట్లు పైమాటే..!

ఒట్టి మాటలే..

ఉద్యోగులకు చెల్లిస్తామన్న బకాయిలు ఈ సంవత్సరానికీ హుళక్కే. ఉద్యోగులు ఆందోళన బాటకు సిద్ధపడుతుండడంతో కొన్ని వారాల క్రితం ప్రభుత్వం దిగొచ్చి పెండింగ్‌ బకా యిలను క్లియర్‌ చేస్తామని భరోసా ఇచ్చింది. జీపీఎఫ్‌ కింద కొంతమేర అడ్వాన్సు చెల్లించారు. ఈహెచ్‌ఎస్‌ కింద కొంత రీయింబర్స్‌ బిల్లులు క్లియర్‌ చేశారు. జీఎల్‌ ఐ రుణాలను సర్దుబాటు చేశారు. సరెండర్‌ లీవ్‌ల విష యానికి వచ్చేసరికి మొండి చెయ్యి చూపించారు. ఐదు డీఏ బకాయిలను సర్దుబాటు చేయలేదు. ప్రభుత్వ కార్యా లయాల నిర్వహణ కింద చిన్న చిన్న బిల్లులను ఇవ్వడా నికి సర్కార్‌ సిద్ధంగా లేదు. కరెంటు బిల్లులు, టెలిఫోన్‌ బిల్లులు కొంత చెల్లించినా కాంటింజెంట్‌ బిల్లుల విషయా నికి వచ్చేసరికి పిల్లి మొగ్గలు వేస్తోంది. కార్యాలయాలను శుభ్రపరిచేందుకు డైలీ వేజేస్‌ మీద పనిచేస్తున్న వారికి, తాగునీరు, ఇతరత్ర సమకూర్చుకోవడానికి కొంత ఖర్చు అవుతున్నా దీనినంతటినీ ఆయా శాఖాధిపతులే ఇప్పటికీ బరాయిస్తున్నారు. బిల్లుల రూపంలో మాత్రం ప్రభుత్వం చెల్లించడానికి సిద్ధం లేదు.

కరెంటు బిల్లులు మరిచారు

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి పథకాలకు తిరుగులేని విధంగా బ్రహ్మాండంగా నిధుల కేటాయింపు, పనుల నిర్వహణ జరుగుతుం దని ప్రభుత్వం ఊదరగొట్టింది. వాస్తవ కోణంలో దీనికి విరుద్ధమైన ఫలితాలు ఉన్నాయి. తాడిపూడి, పట్టిసీమ సహా మిగతా ఎత్తిపోతల పథకాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.350 కోట్ల కరెం టు బిల్లులు పెండింగ్‌లో పడ్డాయి. ఈ బిల్లులను తక్షణం చెల్లించాలని ఈపీడీసీఎల్‌ పదే పదే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి గడువు దగ్గర పడినా ఇప్పటి వరకు ఆ బిల్లులు చెల్లించలేదు. మూడేళ్ల క్రితం ఇలాంటి పరిస్థితే తలెత్తినప్పుడు అప్పట్లో ప్రతిపక్షాలు భగ్గు మన్నాయి. దీంతో సర్కార్‌ దిగొచ్చి కరెంటు బిల్లు కొంత సర్దుబాటు చేసింది. ఇప్పుడు అదీలేదు.

Updated Date - 2023-03-31T00:31:03+05:30 IST