సాగర ఘోష
ABN , First Publish Date - 2023-12-11T00:14:45+05:30 IST
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే పేరుగాంచిన పేరుపాలెం, కేపీ పాలెం సాగర తీరాలు ప్రమాదాలకు నిలయంగా మారాయి
ప్రమాదాలకు నిలయంగా తీరం
విహార యాత్రలో విషాదాలు
బీచ్‌లో స్నానాలు చేస్తూ మృత్యువాత
మొగల్తూరు, డిసెంబరు 10: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే పేరుగాంచిన పేరుపాలెం, కేపీ పాలెం సాగర తీరాలు ప్రమాదాలకు నిలయంగా మారాయి.సముద్ర స్నానం చేస్తూ గల్లంతవుతున్న వారు కొందరైతే ప్రమాదాల బారిన పడి కాలో, చెయ్యి విరగొట్టుకుంటున్నవారు మరికొందరు. సముద్ర స్నానానికి అనువుగా లేకపోయినా ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న అలలను చూసి ఉత్సాహంతో వాటికి ఎదురెళ్లి మృత్యువాత పడుతున్నారు. గడచిన ఐదు సంవత్సరాలలో సుమారు 40 మంది మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. 2015లో ఆరుగురు, 2016లో ఇద్దరు, 2018లో పదిమంది, 2019లో ఏడుగురు, 2021లో ఐదుగురు, 2022లో ఇద్దరు, 2023లో ఇప్పటి వరకూ సుమారు 8 మంది గల్లంతై మృతి చెందారు.సరదాగా గడిపేందుకు వచ్చిన వారు సముద్రంలో కలిసిపోవడంతో తల్లితండ్రులకు తీరని వ్యధగా మారుతోంది.
19 కిలోమీటర్ల తీరప్రాంతం
జిల్లాలో నరసాపురం, మొగల్తూరు మండలాల్లో సుమారు 19 కిలో మీటర్లు తీర ప్రాంతం విస్తరించి ఉంది. నరసాపురం మండలంలో కంటే మొగల్తూరు మండలంలోని కేపీ పాలెం, పేరుపాలెం సాగర తీరం వెంబడి పచ్చని కొబ్బరి, సరుగుడు తోటలతో పాటు ఇసుక మైదానం, ఆధ్మా త్మిక ఆనందాన్ని కలిగించేలా వివిధ ఆలయాలు నిర్మించారు. పేరుపాలెంలోనే సముద్రంలో ఉప్పుటేరులు కలిసే సముద్ర ముఖద్వారం ఉండడంతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకంటుంది. ఆహ్లదకర వాతావరణం, ప్రకృతి రమణీయమైన దృశ్యాలు చల్లని గాలి ఉండటంతో పలు ప్రాంతాల నుంచి శని, ఆదివారం రోజులతో పాటు కార్తీక మాసంలో జరిగే సముద్ర పుణ్యస్నానాలు, పిక్నిక్ పార్టీలకు వేలాది మంది వస్తుంటారు
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా...
పేరుపాలెం, కేపీపాలెం సాగర తీరాలు అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారుతున్నాయి. పలు ప్రాంతాల నుంచి ప్రేమికులు తీరానికి వస్తున్నారు. చాలామంది ఈ ప్రాంతానికి వచ్చి మద్యం సేవిస్తున్నారు. రాత్రి సమయాల్లో ఎక్కువగా ఆసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు సమాచారం.
సముద్ర స్నానానికి అనువైన ప్రాంతం కాదు
పేరుపాలెం సాగర తీరంలో అండర్ కరెంట్స్ ఉండటంతో స్నానాలకు అనువుగా ఉండదు. సముద్రంలోకి దిగిన వారికి కాలు అడుగుబాగంలో గొయ్యి కింద ఏర్పడుతుంది. మద్యం సేవించి స్నానాలకు దిగడంతో అలలు వచ్చిన సమయంలో బ్యాలెన్స్ చేసుకోలేక పడిపోయి గల్లంతవ్వుతున్నారు. కేవలం కార్తీక మాసంలో మాత్రమే పోలీసు బందోబస్త్, గజ ఈత గాళ్ళును ఏర్పాటు చేస్తున్నారు. తీరంలో పోలీస్ అవుట్ పోస్ట్‌ను ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించారు.
ఆఖరి ఆదివారం సందడి
కార్తీకమాసం చివరి ఆదివారం మొగల్తూరు మండలంలోని పేరుపాలెం, కేపీ పాలెం సాగరతీరాలు సందర్శకులతో కళకళలాడాయి. ఈ ఏడాది కార్తీక మాసంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ కారణంగా ఈనెల 3వ తేది నుండి 8వ తేది వరకూ పేరుపాలెం బీచ్‌ను సందర్శించేందుకు నిషేధం విదించారు. ఈ ఆదివారం చివరి కావడం కారణంగా వేలాదిగా బీచ్‌కు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మాత్రమే సముద్ర స్నానాలకు అనుమతించారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పహరా కాశారు.