ఆషాఢం పూజలు

ABN , First Publish Date - 2023-07-07T23:30:58+05:30 IST

సత్రంపాడులో సౌభాగ్యలక్ష్మీదేవి ఆలయంలో ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా అర్చకులు వారణాసి రాఘవేంద్రశర్మ సామూహిక కుంకుమ పూజలను జరిపించారు.

ఆషాఢం పూజలు
ఏలూరులో మహిళల సామూహిక కుంకుమ పూజలు

ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవార్లు

ఏలూరు కార్పొరేషన్‌, జూలై 7: సత్రంపాడులో సౌభాగ్యలక్ష్మీదేవి ఆలయంలో ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా అర్చకులు వారణాసి రాఘవేంద్రశర్మ సామూహిక కుంకుమ పూజలను జరిపించారు. అమ్మవారికి మహా మంగళ స్నానం చేయించి అనంతరం విశేష అలంకరణ జరిపి ప్రత్యేక హారతులు ఇచ్చి నివేదన సమర్పించారు. పెద్ద సంఖ్యలో మహిళలు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుని భక్తి సంకీర్తనలు ఆలపించి భజనలు నిర్వహించి శ్రీచక్ర లక్ష్మీ కుంకుమ పూజల్లో పాల్గొని తీర్థ అన్నప్రసాదాలు స్వీకరించారు.

సత్రంపాడు లక్ష్మీగణపతిస్వామికి వివిధ రకాల కూరగాయలతో శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు భక్తులతో ప్రత్యేక పూజలు జరిపించారు. స్వామివారికి భక్తులు గరికతో పూజలు చేశారు.

జీలుగుమిల్లి: గ్రామ దేవత జగదాంబ అమ్మవారు శుక్రవారం శాకంబరి గా భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆషాఢ మాసం పురస్కరించుకుని అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. అశ్వారావుపేట, సమీప గ్రామాల భక్తులు అలంకరణకు కావాల్సిన కూరగాయలు సమకూర్చారు.

దెందులూరు: కొవ్వలి రోడ్డులో పెద్దింట్లమ్మ ఆలయంలో అమ్మవారు 18 రకాల కూరగాయలతో శాకంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. పలు గ్రామాల భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.

Updated Date - 2023-07-07T23:30:58+05:30 IST