అందని ఆసరా!

ABN , First Publish Date - 2023-05-08T00:02:25+05:30 IST

అన్న వచ్చి బటన్‌ నొక్కి వెళ్లారు.. ప్రజాప్రతినిధులేమో చెక్కులు పంచి వెళ్లారు. పది రోజుల్లో పండగ వాతావరణం నడుమ నగదు జమ అని మాటలు చెప్పి నెల దాటింది. ఇంతవరకు డ్వాక్వా, డ్వాక్రా గ్రూపుల్లో నగదు మాత్రం పడలేదు.

అందని ఆసరా!

మహిళల పడిగాపులు

పదిరోజులన్నారు.. 40 రోజులు దాటాయి

భారీ డైలాగులతో ఎమ్మెల్యేలు చెక్కుల పంపిణీ

కొన్నిచోట్ల 30 శాతం కూడా విడుదల కాని వైనం

ఆందోళనలో స్వయం సహాయక సంఘాలు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

‘మాట ఇచ్చానంటే నెరవేరుస్తానంతే.. నేనిక్కడ బటన్‌ నొక్కాక నేరుగా మీ ఖాతాల్లోకి ఆసరా ఫలాలు వచ్చి చేరుతాయి. రాబోయే పది రోజుల్లో ప్రతీ మండలంలో, గ్రామంలో మన పార్టీ నాయకుల మధ్య ఒక జాతర వేడుకల మాదిరి ఆసరా మూడో విడత పథకం కింద మీ ఖాతాల్లోకి నగదు వచ్చి చేరతాయి.’ మార్చి 26న జరిగిన దెందులూరు బహిరంగ సభలో సీఎం జగన్‌ చెప్పిన మాటలివి.

‘పది రోజులన్నారు.. నెలన్నర అవుతుంది ఇంత వరకు డబ్బులు పడలేదు. కొన్ని చోట్ల గ్రూపులకు చెక్కులు పంచారు. అవి కూడా ఖాతాలో పడలేదు. కొందరికి పడ్డాయంటున్నారే తప్ప ఎవరికి పడ్డాయన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఏంటో ఆ డబ్బులు ఇంకెన్నాళ్లను పడేనో! కొందరైతే ఎన్నికల టైంలో ఆలస్యమవుతా యంటున్నారు.’ .. ఏలూరులోని ఓ గ్రూపునకు చెందిన లీలావతి అనే మహిళ ఆవేదన.

‘చెక్కులైతే ఇచ్చారు కానీ, ఇంత వరకు జమ కాలేదు. అదేంటంటే కొన్నాళ్లు ఆగమని అంటున్నారు. ఇళ్లకు స్టిక్కర్లు అంటించడానికి వచ్చినపుడు అడుగుతుంటే ఇప్పటికే పూర్తి నగదు మంజూరు అయిపోయుంది. త్వరలో ఖాతాలో పడతాయి. కంగారెందుకు అంటున్నారు.’ .. నూజివీడు నియోజకవర్గంలోని ఓ స్వయం సహాయక సంఘ మహిళ ఆక్రందన.

అన్న వచ్చి బటన్‌ నొక్కి వెళ్లారు.. ప్రజాప్రతినిధులేమో చెక్కులు పంచి వెళ్లారు. పది రోజుల్లో పండగ వాతావరణం నడుమ నగదు జమ అని మాటలు చెప్పి నెల దాటింది. ఇంతవరకు డ్వాక్వా, డ్వాక్రా గ్రూపుల్లో నగదు మాత్రం పడలేదు. ఇళ్లకు స్టిక్కర్లు అంటించడానికి వచ్చేవాళ్లని అడుగుతుంటే కంగారేంటి అంటున్నారని స్వయం సహాయక సంఘాల మహిళలు వాపోతున్నారు. ఎక్కడ చూసినా మంజూరైన లెక్కలే తప్ప ఖాతాల్లో జమ అయిన గణాంకాలకు అధికారులు దూరంగా ఉంటున్నారు. అదేమంటే 90 శాతం ఖాతాలకు నగదు వెళ్లిపోయిందంటారే తప్ప నోరు తెరిచి వివరాలు చెప్పలేకపోతున్నారు. నోరు తెరిస్తే ఏం కష్టమొచ్చి పడుతుందోనని మహిళామణులు సైతం నోళ్లు నొక్కుకుంటున్నారు. జిల్లాలో ఏ ఒక్కరిని అడిగినా రెండు రోజుల్లో వెళ్లి తీసుకోవచ్చన్నారనే చెబుతున్నారు. ఈ జమ వంద శాతం పూర్తయ్యే సరికి ఇంకెన్నాళ్లు పడుతుందోనని మహిళలు పడిగాపులు పడుతున్నారు.

ఇంకెన్నాళ్లకు..

ఆసరా నిధులు అంటూ సీఎం బటన్‌ నొక్కారో లేదో ప్రతీ నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు మరింత ఆర్భాటంగా మెగా చెక్కులను వెలుగు ప్రాజెక్టు పరిధిలోని మహిళా సంఘాల సభ్యులైన మహిళలకు అందజేశారు. చెక్కులు అంది నెల దాటినా నగదు మాత్రం ఖాతాల్లోకి చేరలేదు. ఏలూరు జిల్లాలోని సంఘాల్లో ఉన్న వెనుకబడ్డ అగ్రవర్ణ మహిళలకు నేటికీ ఆసరా నిధులు జమ కాలేదు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 35,748 స్వయం సహాయక గ్రూపులు ఉండగా, ఆ సంఘాల పరిధిలో 3,55,135 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. పథకంలో భాగంగా ఆ మహిళలకు రూ.328 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఆ మొత్తంలో నేటికి 60–70 శాతం మహిళల ఖాతాల్లో కూడా పథకం నగదు జమకాలేదు. నిధుల విడుదలలో తొలి ప్రాధాన్యతగా ఎస్సీ, ఎస్టీ వర్గాల మహిళలకు నిధులు జమ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు నిధులు జమ అయ్యాయని వెలుగు అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో బీసీ ఉన్నత వర్గాల మహిళలకు జమ కాకపోవడంపై మండల స్థాయి అధికారులు తలలు పట్టుకోవాల్సి వస్తోంది. ఈ అవకతవకల నగదు జమల కారణంగా నియోజకవర్గం లోని పలు మహిళా సంఘాల నుంచి వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయి. ఏలూరు రూరల్‌ మండలం పరిధిలోని 14 గ్రామాల్లోని 630 స్వయం సహాయక సంఘాలు ఉండగా, 6349 మంది సభ్యులకు మూడో విడత ఆసరా నగదు కింద రూ.4.74 కోట్లను అధికారులు జమ చేసినట్టు చెబుతున్నారు.

25 శాతం దాటని జమలు

నూజివీడు నియోజకవర్గ వెలుగు కార్యాలయం పరిధిలోని నూజివీడు, ముసునూరు, చాట్రాయి, ఆగిరిపల్లి మండలాల పరిధిలోని 518 సంఘాలు ఉండగా, అందులో 53,189 మంది సభ్యులున్నారు. వారికి రూ. 43.76 కోట్ల నగదు మంజూ రైంది. ప్రతీ మండలంలోనూ స్థానిక ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్‌ అప్పారావు ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించి మహిళలకు చెక్కులను పంపిణీ చేశారు. మరే సీఎం చేయని విధంగా ప్రభుత్వ పథకాలను జగన్‌ చేపడుతున్నారని, బటన్‌ నొక్కిన మరుక్షణం మహిళల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయని చెప్పుకొస్తున్నారు. అయితే సీఎం మీట నొక్కి నాలుగు నెలలు గడుస్తున్నా ఆసరా చెక్కులు నగదుగా మారనేలేదు. ప్రభుత్వం చేస్తోన్న ఈ ద్వంద్వ వైఖరి పట్ల మహిళా సభ్యుల్లో నిరసన వ్యక్తం అవుతోంది. ఇప్పటిదాకా నియోజకవర్గంలో 25 శాతం నిధులు మాత్రమే ఖాతా జమ అవ్వగా, మిగిలిన నిధులను ప్రతీవారం ఒక్కో గ్రామానికి జమచేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

న్యాయం జరగని సంఘాలు

వైసీపీ ప్రభుత్వం మహిళ, అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తామని మహిళలందరికి రుణమాఫీ కింద వైఎస్సార్‌ ఆసరా పథకం అమలు చేస్తున్నామని గొప్పలు చెబుతున్నా క్షేత్రస్థారులో మహిళా సంఘాల సభ్యులు చాలామందికి లబ్ధి చేకూరడం లేదు. వైసీపీ ప్రభుత్వం 11–4–2019 తేదీ నాటికి డ్వాకా సంఘం సభ్యులు తీసుకున్న అప్పు ఎంత, వారి అప్పులో మిగిలిందో అ అప్పును మాత్రమే నాలుగు విడతలగా మహిళల బ్యాంకు ఖాతాలో వేస్తుంది. అయితే జిల్లాలో 42 వేల 213 సంఘాలు అప్పు తీసుకోగా, అందులో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న విధానం వల్ల 38,182 సంఘాలు మాత్రమే అర్హత పొంది మూడు విడతలుగా వైఎస్సార్‌ ఆసరా నగదు పొందుతున్నారు. మిగిలిన 4 వేల 31 సంఘాల వారికి రాలేదు. కారణం 11–4–2019 నాటికి డ్వాకా మహిళలు అప్పు తీసుకుని కట్టకుండా ఉన్న మహిళలకు, అప్పుడే అప్పు తీసుకున్న మహిళలకు మాత్రమే వైఎస్సార్‌ ఆసరా పథకం వర్తించింది. మూడు విడతలుగా విడతకు 985 కోట్ల 34 లక్షలు చెల్లించారు. మరో 985 కోట్ల 34 లక్షలు నాల్గొవ విడతగా చెల్లించనున్నారు. అయితే అప్పు తీసుకుని నిజాయితీగా అప్పు కట్టిన వారికి మాత్రం వైఎస్సార్‌ ఆసరా పథకం వల్ల ఏ మాత్రం లాభం కలగలేదు. దెందులూరు మండలంలో 1,650 డ్వాక్రా సంఘాలు ఉండగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం 11–4–2019 నాటికి అప్పు లేని, లేదా అప్పు కట్టేసిన మహిళలను వదిలేసి కేవలం అప్పు ఉన్న 1,456 సంఘాలను మాత్రమే వైసీపీ ప్రభుత్వం అర్హులుగా ప్రకటించింది. ఈ 1456 సంఘాలకు గాను ఒక్కొక్క విడత రూ.17 కోట్ల 33 లక్షలు వారి బ్యాంక్‌ ఖాతాల్లోకి వేసింది. మూడు విడతలు కలిపి దెందులూరు మండలంలో 54 కోట్ల రూపాయలను వారి బ్యాంకు ఖాతాలో జమ చేసింది.

వేలేరుపాడు మండలంలో..

వేలేరుపాడు మండలంలో 46 సంఘాలకు, జంగారెడ్డిగూడెం మండలంలో 1,600 స్వయం సహాయక సంఘాలున్నాయి. వీటిలో 1314 సంఘాలకు రూ.12.98 కోట్లు ఆసర పధకం ద్వారా మంజూరయ్యాయి. మరో 285 సంఘాలు ఏప్రిల్‌ 11వ తేదీ 2019 నాటికి అప్పు ఉన్న వారికి మాత్రమే ఆసర పఽథకం వర్తించే నిబంధనతో 285 సంఘాలు అనర్హతకు గురయ్యాయి. జంగారెడ్డిగూడెం పట్టణం మెప్మా పరిధిలో మొత్తం 918 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటితో 724 సంఘాలకు రూ.8.40 కోట్లు ఆసర పఽథకం కింద సొమ్ములు పడ్డాయి. మిగిలినవి 2019 ఏప్రిల్‌ 11 నాటికి అప్పులేని గ్రూపులుగా గుర్తించి అనర్హత చేశారు. వీటిలో మరో 11 సంఘాలు అర్హత ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌ నమోదు సమస్య కారణంగా ఆసరా అందలేదు. వీరికి కూడా రెండు, మూడు రోజుల్లో అసర సొమ్ములు అందుతాయని అధికారులు చెబుతున్నారు.

కైకలూరు నియోజకవర్గంలో..

ఆసరా పథకానికి సంబంధించిన మూడో విడత నగదు కైకలూరు నియోజకవర్గంలోని అత్యధిక శాతం డ్వాక్వా గ్రూపులకు నేటికీ అందలేదు. నియోజకవర్గంలో 5,181 సంఘాలకు ఆసరా సొమ్ము జమ కావాల్సి ఉండగా, 3,883 సంఘాలకు నగదు జమ అయింది. నియోజకవర్గంలో 1295 గ్రూపులకు చెందిన సభ్యులకు మాత్రమే నగదు జమ కాలేదని మండల స్థాయి అధికారులు వివరిస్తున్నారు. అలాగే రూ. 46.80 కోట్ల సొమ్ముకు రూ.42 కోట్లు జమ అయింది. ఓబీసీ కార్పొరేషన్‌ నుంచి నిధులు విడుదల కాకపోవడం వల్ల మిగిలిన గ్రూపులకు ఆసరా సొమ్ము అందలేదని, మరో వారంలో విడుదలవుతాయని అధికారులు తెలిపారు.

కంగారెందుకు?

ఆసరా సొమ్ముల పంపిణీ పేరిట ఏప్రిల్‌ 6న పోలవరం మండలంలో 1700 మంది లబ్ధిదారుల కోసం పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు 7.33 కోట్ల రూపాయల చెక్కు స్వయం సహాయక సంఘాలకు అంద జేశారు. కానీ నేటికీ ఆ సొమ్ములు తమ ఖాతాలకు జమ కాలేదని డ్వాక్రా మహిళలు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై ఏపీఎం శ్రీనివాసరావుని వివరణ కోరగా మండలంలో 943 సంఘాలు ఉన్నాయని 764 సంఘాలకు వారి వ్యక్తిగత ఖాతాలకు నగదు జమ అయ్యాయని, ఇంకా 179 సంఘాలకు విడతల వారీగా జమ అవుతాయని ఆందోళన చెందనవసరం లేదన్నారు. కుక్కునూరు మండలంలో స్వయం సహాయక సంఘాలు 992 గ్రూపులు ఉన్నాయి. ఆసరా పథకం అందిన స్వయం సహాయక సంఘాలు 795 కాగా 197 సంఘాలకు అందలేదు. ఎందుకు అందలేదంటే 11–4–2019 నాటికి అప్పు ఉన్న స్వయం సహాయక సంఘాలకు మాత్రమే ఆసర పథకానికి లబ్ధిదారులుగా గుర్తించారు. మిగిలిన వాటికి ఆసర పథకం అందలేదు. కొన్ని కొత్త గ్రూపులు కూడా ఇటీవల ఏర్పడడంతో వాటికి కూడా ఆసర పఽథకం అందలేదు.

సాంకేతిక కారణాలతో నిలిచాయి..

జంగారెడ్డిగూడెం మెప్మా పరిఽధిలో మొత్తం 918 స్వయం సహాయక సంఘాలుండగా అర్హత గల 724 గ్రూపులకు ఆసర అందింది. అయితే 11 గ్రూపులకు ఆసరా అందాల్సి ఉంది. ఈ 11 గ్రూపులు కూడా లబ్ధిదారులు బ్యాంక్‌ అకౌంట్‌లను మార్చుకోవడం, ఆన్‌లైన్‌లో నమోదు కాకపోవడం వంటి కారణాల వల్ల నిలిచిపోయాయి. వెంటనే 11 సంఘాలకు సంబంఽ దించి నివేదిక ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. వారికి కూడా ఆసరా వర్తిస్తుంది.

– నాగమణి, జంగారెడ్డిగూడెం మెప్మా, ఏపీఎం

Updated Date - 2023-05-08T00:02:25+05:30 IST