ఆరోగ్యశ్రీ ఆర్భాటం..!
ABN , Publish Date - Dec 22 , 2023 | 12:22 AM
అసెంబ్లీ ఎన్నికల వేళ ఆరోగ్యశ్రీ సేవలను విస్తరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అటు ఆసుపత్రుల యాజమాన్యం నుంచి, జనంలో ప్రతికూల స్పందన వినిపిస్తోంది. ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల నుంచి రూ.25 లక్షలు వరకు ఆరోగ్యశ్రీ ప్రయోజనాన్ని పెంపుదల చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే బిల్లుల మంజూరులో జరుగుతున్న జాప్యంపై ఆవేదన వ్యక్తమవుతోంది.
రూ.25 లక్షలకు సేవలు విస్తరణ
వైసీపీ ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం
ఉన్న బిల్లుల చెల్లింపులకే దిక్కులేదు
రూ. 50 వేలు దాటితే జాప్యమే
ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల నుంచి ఫిర్యాదులు
మూడేళ్లుగా అందని ఈహెచ్‌ఎస్ సేవలు
భీమవరం, డిసెంబరు 21 : ఎన్నికల వేళ ఆరోగ్యశ్రీ సేవలను విస్తరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అటు ఆసుపత్రుల యాజమాన్యం నుంచి, జనంలో ప్రతికూల స్పందన వినిపిస్తోంది. ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల నుంచి రూ.25 లక్షలు వరకు ఆరోగ్యశ్రీ ప్రయోజనాన్ని పెంపుదల చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే బిల్లుల మంజూరులో జరుగుతున్న జాప్యంపై ఆవేదన వ్యక్తమవుతోంది. దీనిపై ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించిన (ఈహెచ్‌ఎస్) బిల్లులు పూర్తిస్థాయిలో మంజూరు కాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఎన్నికల అస్త్రంగా పట్టణాలు, గ్రామాల్లో ఆర్భాటంగా ఇప్పుడు ప్రచారం చేపట్టింది. జిల్లాలో 5 లక్షల 82 వేల 585 కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేసినట్లు మూడు రోజుల కిందటే జిల్లా అధికారులు ప్రకటించారు. జిల్లాలో 30 ప్రైవేటు, ఒక జిల్లా, నాలుగు ఏరియా హాస్పిటల్స్, మూడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 34 పైమ్రరీ హెల్త్ సెంటర్లలో మొత్తం 72 హాస్పిటల్స్‌లో ఆరోగ్యశ్రీ సేవలు పొందే ఆసుపత్రులుగా నమో దయ్యాయి. 2019 జూన్ నుంచి 2023 డిసెంబరు వరకు 1,93, 122 మందికి ఆపరేషన్లు, చికిత్సలు నిర్వహించి 409 కోట్ల 65 లక్షలు ఖర్చు చేశారని చెపుతున్నారు. అయితే కోట్లాది రూపాయలు మాత్రం ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. కొన్ని ఆసుపత్రు లకు రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు బిల్లులు పెండింగ్ ఉన్నాయి.ఎటువంటి ఫిర్యాదు చేస్తే ఏ కొంప మునుగుతుందో అని యాజమాన్యాలు నలిగి పోతున్నాయి. రూ.50 వేల వరకు చేసిన బిల్లులకు వేగంగానే మంజూరవుతున్నాయి. ఆపై మాత్రం లాటరీగా మారిందని చెబుతున్నారు.
ఈహెచ్‌ఎస్‌కు అనుమతి ఎప్పుడు ?
మూడేళ్లుగా ఉద్యోగులకు సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ (ఈహెచ్‌ఎస్) ద్వారా వైద్యసేవలు పూర్తిగా అందడం లేదు. రూ.25 వేల బిల్లులకు సైతం ప్రభుత్వం నుంచి అనుమతులు రాని పరిస్థితి నెలకొంది. కొంతమందికి వైద్యం చేసిన తర్వాత ఆరు నెలలు, సంవ త్సరం కూడా పడుతోందని ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో పొరుగు రాష్ట్రా నికి వెళ్లి వైద్య సేవలు పొందుదామని చేసిన ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు. ఆంధ్రప్రదేశ్ హెల్త్ కార్డులను అనుమతించడం లేదంటూ హైదరాబాదులో కొన్ని ఆసుపత్రులు నేరుగా బోర్డులు పెట్టేశాయి. వైద్య నిధికి ఉద్యోగులు తమ వాటా చెల్లిస్తున్నప్పటికీ తమ కుటుంబ సభ్యులకు వైద్యసేవలకు అక్కరకు రాని పరిస్థితి నెలకొందని ఉద్యోగులు వాపోతున్నారు. కొన్ని ఆసుపత్రులు తమ పలుకుబడి ఉపయోగించి బిల్లులు మంజూరు చేసే ప్రయత్నం చేస్తుంటే చాలా ఆసుపత్రులు చేతులెత్తేస్తున్నాయి.
ఎన్నికల వేళ ప్రచారం..
ఆరోగ్యశ్రీ పథకం పాతదే అయినా ఇప్పుడు పథకం విస్తరణ గురించి ఆర్భాటంగా ప్రచారం చేపట్టారు. సమీపంలో ఎన్నికలు ఉండటంతో ప్రచార అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు. పెంచిన సొమ్ము ఆరోగ్యశ్రీ నూతన స్మార్ట్‌కార్డుల పంపిణీని కూడా జిల్లా అంతటా పార్టీ నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు వలంటీర్లు పర్యవే క్షణలో ప్రత్యేక కార్యక్రమంగా పంపిణీ చేస్తున్నారు.ఈనెల 19 నుంచి జిల్లా వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ అవగాహనా కార్యక్రమం, లాంఛనంగా నియోజక వర్గానికి ఐదు గ్రామాల్లో స్మార్ట్‌కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారం భించారు. ఏఎన్ ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు, వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఆరోగ్యశ్రీ పథకం గురించి వివరించడం, ఆరోగ్యశ్రీ, దిశ యాప్‌లను డౌన్‌లోడ్ వంటివి చేస్తున్నారు.