వైద్యం చేయలేం !
ABN , Publish Date - Dec 29 , 2023 | 12:02 AM
ఆరోగ్యశ్రీ వైద్య చికిత్సల కింద ప్రభుత్వమిచ్చే ప్యాకేజీల మొత్తాన్ని పెంచకుండా చికిత్సల సంఖ్య(ప్రొసీజర్స్)ను, బీమాను రూ.25 లక్షల కు పెంచడం ఎన్నికల స్టంటేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆస్పత్రుల నిర్వహణ ఖర్చులకే సరిపోని వైద్య బిల్లులు
ప్యాకేజీ మొత్తాలు పెంచాల్సిందే
రూ.25 లక్షలకు ఆరోగ్యశ్రీ వైద్యఖర్చ్చ్చులు పెంచడం ఎన్నికల స్టంటే
ఆస్పత్రుల యాజమాన్యాల ఆవేదన
ఏలూరు ఎడ్యుకేషన్, డిసెంబరు 28 : ఆరోగ్యశ్రీ వైద్య చికిత్సల కింద ప్రభుత్వమిచ్చే ప్యాకేజీల మొత్తాన్ని పెంచకుండా చికిత్సల సంఖ్య(ప్రొసీజర్స్)ను, బీమాను రూ.25 లక్షల కు పెంచడం ఎన్నికల స్టంటేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ క్లయిమ్‌లు భారీగా కోతలు పెడుతున్న ప్రభుత్వం తాజాగా వైద్య చికిత్సలకయ్యే ఖర్చుని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచడంతో రోగుల సంఖ్య దానికనుగుణంగా పెరగడమేతప్ప నిర్వహణ పరంగా నష్టాలపాలవడం ఖాయమని ఆస్పత్రుల యాజమాన్యాలు వాపోతున్నాయి. ఈక్రమంలో ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిల కోసం, ప్యాకేజీ మొత్తాల పెంపుకోసం నెట్‌వర్క్ ఆస్పత్రులు ఆందోళనబాట పట్టడానికి సమాయత్తమవుతున్నాయి. మరోవైపు జిల్లాలో రోగులకు ఎక్కడా ఇబ్బందులు కలుగకుండా జిల్లా యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిసారించింది.
చికిత్స ఖర్చుకి, క్లెయిమ్‌ల మధ్య భారీ వ్యత్యాసం
ఆరోగ్యశ్రీ వైద్య చికిత్సలకు అయ్యే ఖర్చుకి ప్రభుత్వం క్లెయిమ్ రూపంలో చెల్లించే ఫైనల్ బిల్లుకి మధ్య భారీ వ్యత్యాసముంటోంది. ఉదాహరణకు సాధారణ ప్రసవానికి నెట్‌వర్క్ ఆస్పత్రికి రూ.8వేలు, సిజేరియన్ డెలివరీకి రూ.12–15వేలు ప్యాకేజీగా నిర్ణయించగా ఇవి చాలా తక్కువని, ఇందులోనూ ఫైనల్ క్లెయిమ్‌ల బిల్లు సెటిల్‌మెంట్‌కు వచ్చేసరికి దాదాపు సగం మొత్తాన్ని కోతపెడుతున్నారని సమాచారం. ఈవిధంగా కోతపెట్టడానికి పలు సాకులు చెబుతున్నారని, పేషెంట్ చికిత్సకు సంబంధించి అన్ని నిబంధనలను పాటించినప్పటికీ నిర్ణీత బిల్లు మొత్తాన్ని కూడా ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చెల్లించే ఫైనల్ బిల్లుకు, డెలివరీకి తీసుకునే బిల్లుకు మధ్య వున్న వ్యత్యాసాన్ని పేషెంట్‌నుంచే వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే పేషెంట్ నుంచి ఏ విధమైన నగదును వసూలు చేయలేదని ఆరోగ్యశ్రీ ట్రస్టు నిర్ధారించుకున్న తర్వాతే ఫైనల్‌బిల్లు మొత్తాన్ని విడుదల చేస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించే ప్యాకేజీల మొత్తానికి వైద్య చికిత్సలు చేయలేమని చేతులెత్తేస్తున్న నెట్‌వర్క్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ కింద పేషెంట్లను చేర్చుకునేందుకు విముఖత చూపడానికి తక్కువ మొత్తంలో చెల్లింపులు, పలు నిబంధనలు, కొర్రీలు ప్రధాన కారణమని చెబుతున్నారు.
బకాయిలు రూ.కోట్లలోనే
జిల్లాలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ప్రైవేటు ఆస్పత్రులు 29 ఉన్నాయి. వీటితోపా టు ఏలూరులో జిల్లా ప్రభుత్వ సర్వజనాసుపత్రి ఒకటి, జంగారెడ్డిగూడెం, నూజివీడు, చింతలపూడిలలో ఏరియా ఆస్పత్రులు, కైకలూరు, దెందులూరు, పోలవరం తదితర తొమ్మిది చోట్ల సీహెచ్‌సీలు, 43 పీహెచ్‌సీలు న్నాయి. జిల్లాలో మొత్తం 6,33,227 ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేశారు. మొత్తం 3,225 వైద్య చికిత్సలను ఆరోగ్యశ్రీలో పొందుపర్చారు. ఆరోగ్యశ్రీ కింద వైద్య చికిత్సలు చేసిన 4–6 నెలల వరకు బిల్లులను ప్రభుత్వం చెల్లించడం లేదని, ఈలోగా ఆస్పత్రుల నిర్వహణ ఖర్చులను భరించలేకపోతున్నామని యాజమాన్యాలు వాపోతున్నాయి. కొత్తగా ఆరోగ్యశ్రీ వైద్యఖర్చులను రూ. 25లక్షలకు పెంచడంతో రోగులసంఖ్య అమాంతం పెరుగుతుందని అంచనావేస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ఇప్పటికే ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.కోట్లలో నెలలతరబడి పేరుకుపోయాయని వాపోతున్నారు. తాజాగా వైద్యఖర్చులను పెంచడంతో దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న మూత్రపిండాల మార్పిడి, కేన్సర్, గుండె మార్పిడి వంటి వైద్య చికిత్సల సంఖ్య పెరిగే అవకాశాలున్నందున ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ వైద్యసదుపా యాన్ని కల్పించలేని స్థితిలో పలు ప్రైవేటు ఆస్పత్రులున్నట్టు సమాచారం.
ప్రత్యామ్నాయంపై ముందస్తు ఏర్పాట్లు
ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయడంతోపాటు, ప్యాకేజీల మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేస్తూ ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రులు శుక్రవారం నుంచి వైద్యసేవలను నిలిపివేయడానికి యోచిస్తున్న నేపథ్యంలో జిల్లాలో ముందస్తు ప్రత్యామ్నాయంపై అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. నెట్‌వర్క్ ఆస్పత్రులకు వచ్చే రోగులను సమీప ప్రభుత్వాసుపత్రులకు తరలించి వైద్యసేవలు అందించాలని సూచించింది. ముఖ్యంగా ప్రసవాల కేసులను చూసేందుకు ప్రభుత్వాసుపత్రుల్లోని గైనకాలజిస్టులను అప్రమత్తం చేసినట్టు ఆరోగ్యశ్రీ జిల్లా కో–ఆర్డినేటర్ డాక్టర్ వెంకట్ తెలిపారు. ప్రత్యేక వైద్యనిపుణులను కూడా అందుబాటులో ఉంచుతామన్నారు. సాధ్యమైనంత వరకు రోగులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్రస్థాయిలోనే ప్రత్యామ్నాయ చర్యలపై అన్ని పీహెచ్‌సీల వైద్యాధికారులతో గురువారం జూమ్ మీటింగ్ నిర్వహించి ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్యసేవల నిలిపివేతపై గురువారం సాయంత్రం వరకు యాజమాన్యాలేవీ తమకు సమాచారం ఇవ్వలేదని వివరించారు.